విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత రెండేళ్ళుగా పోరాటం చేస్తున్న విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఈ రోజు మరో కీలక కార్యక్రమం చేపట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉక్కు నగరంలోని త్రిష్ణ మైదానంలో " ఉక్కు ప్రజా గర్జన " పేరుతో భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు అన్ని పార్టీల నుండి ముఖ్యమైన నేతలు హాజరు కానున్నట్లు కమిటీ సభ్యులు చెబుతున్నారు. 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వబోమని స్థానికంగా ఉన్న కార్మికులు, ఉద్యోగులు, మేధావులు అంతా కుటుంబాలతో సహా ఈ భారీ సభకు వచ్చి తమ పోరాటానికి మద్దతు పలకాలని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపునిచ్చింది.


‘ఉక్కు ప్రజాగర్జన’ సభకు హాజరవుతున్న నేతలు వీరే
* వైసీపీ నుంచి వైవీ సుబ్బారెడ్డి, గుడివాడ అమర్ నాథ్ 
* టీడీపీ నుండి అచ్చెన్నాయుుడు
* జనసేన నుండి నాదెండ్ల మనోహర్
* కాంగ్రెస్ నుండి పీ రాకేష్ రెడ్డి
* సీపీఐ నుండి కె. రామకృష్ణ
* సీపీఎం నుండి శ్రీనివాసరావు
* సీపీఐ (న్యూ డెమోక్రసీ) నుండి కె. వెంకటేశ్వర్లు
* బీఎస్పీ నుండి సత్యనారాయణ
* RPI నుండి బొడ్డు కళ్యాణ్ లతో పాటు BRS, ఆమ్ ఆద్మీ, సీపీఐ (ఎం) పార్టీల ప్రతనిథులు ఈ సభకు హాజరు కానున్నారు. వీరితో పాటు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి కొణతాల లక్ష్మీ నారాయణ కూడా ఈ "ఉక్కు ప్రజా గర్జన" సభలో పాల్గొననున్నట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ప్రతినిధులు తెలిపారు.


నేడు జగనన్న చేదోడు చెక్కుల పంపిణీ
నేడు వినుకొండలో జగనన్న చేదోడు పథకంలో భాగంగా చెక్కులను సీఎం జగన్ పంపిణీ చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు సీఎం జగన్‌ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.40 గంటలకు వినుకొండ చేరుకుంటారు. 11.05 నుంచి 12.20 వరకు వినుకొండ వెల్లటూరు రోడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.45 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


ఈ రోజు సాయత్రం ఢిల్లీకి సీఎం జగన్
 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు(సోమవారం) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలవడంతో పాటు పలువురు పారిశ్రామిక వేత్తలతో ఏపీ ముఖ్యమంత్రి చర్చలు చేయనున్నారు. ఇవాళ రాత్రికి 1- జన్‌పథ్‌ నివాసంలో సీఎం జగన్‌ బస చేస్తారు. ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో భాగంగా కర్టెన్‌రైజర్‌ కార్యక్రమాలకు సీఎం జగన్‌ హాజరుకానున్నారు. మంగళవారం 10.30 గంటల నుంచి 5-30 గంటల వరకు ఢిల్లీ లీలా ప్యాలెస్‌ హెటల్‌లోనూ సీఎం జగన్‌ కు ఓ సమావేశం ఉంది.


సీఐడీ ఎదుటకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు


ఐటీడీపీ నిర్వహకుడు చింతకాయల విజయ్‌ సోమవారం సీఐడీ విచారణకు హాజరవుతున్నారు. సీఎం జగన్‌ భార్య వైఎస్‌ భారతి లక్ష్యంగా సోషల్‌ మీడియాలో ఒక పోస్టు గత ఏడాది సెప్టెంబరులో వైరల్‌ అయింది. ఐటీడీపీ ద్వారా సర్క్యులేట్‌ చేశారంటూ సీఐడీ అధికారులు.. ఐపీసీ 419, 469, 153ఏ, 505(2), 120-బి, రెడ్‌ విత్‌ 34, 66(సి)తోపాటు ఐటీ చట్టంలోని సెక్షన్‌ 2000 కింద గత ఏడాది అక్టోబరు 1న ఎఫ్‌ఐఆర్‌ 14/2022 నమోదు చేశారు. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌ రోడ్‌ నంబరు 3లోని చింతకాయల విజయ్‌ ఇంటికెళ్లి గాంధీ జయంతి ముందు రోజు హల్‌చల్‌ చేశారు. 41ఏ నోటీసు ఇచ్చి విచారణకు పిలిచారు. కోర్టులో స్టే తెచ్చుకున్న విజయ్‌ ఈ నెల 27న హాజరవ్వాల్సి ఉంది. ఆ రోజు హాజరు కాలేనంటూ మరోమారు ఆయన కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం అనుమతితో సోమవారం మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు విజయ్‌ హాజరవుతున్నారు.