పల్నాడు: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై ఏపీ తెలుగు అకాడమీ ఛైర్మన్‌ నందమూరి లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలో నారా లోకేష్‌ కామెడీ చూసి అందరూ ఎంజాయ్‌ చేస్తున్నారంటూ యువగళం పాదయాత్రపై సెటైర్లు వేశారు. ఒక కమెడియన్‌ పాదయాత్ర చేస్తే కామెడీ తప్ప ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదని నారా లోకేష్‌ను ఎద్దేవా చేశారు. లోకేష్ ఓ ఐరన్ లెగ్ అంటూ ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తరహాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిపై నిప్పులు చెరిగారు. 


వారిద్దరికి మానవత్వం ఉందా ?
లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభానికి హాజరై, జనంతో కలిసి నడిచే ప్రయత్నం చేసిన నందమూరి వారి అబ్బాయి తారకరత్నకు గుండెపోటు రావడం బాధాకరం అన్నారు. దివంగత నేత ఎన్టీఆర్ మనవడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసినా లోకేష్ మాత్రం పాదయాత్ర ఒక్కరోజు కూడా ఆపడం లేదన్నారు. తమ అధికార దాహం కోసం ఒక్కరోజు కూడా పాదయాత్ర ఆపలేదంటే చంద్రబాబు, లోకేష్ మనస్తత్వం ఎలాంటిది, వీరికి మానవత్వం లేదని రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయిందన్నారు లక్ష్మీపార్వతి. ఈ జన్మలో లోకేష్ నాయకుడు కాలేడని, చంద్రబాబు, లోకేష్‌ స్వభావం చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు. తండ్రీకొడుకు ఎక్కడ కాలు పెడితే మరణాలు, అపశృతులు జరుగుతున్నాయని.. వీళ్లు వచ్చేది మనుషులను చంపడానికేనా అని ప్రజలు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారని లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


బెంగళూరుకు క్యూ కట్టిన నందమూరి కుటుంబసభ్యులు 
తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన ప్రస్తుతం పోరాడుతున్నాడని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్లిన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తారకరత్నను చూసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తారకరత్న ఎక్మోపై లేరని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. వైద్యులు చేస్తున్న చికిత్సకు స్పందిస్తుండడం కాస్త ఊరటనిచ్చే అంశమని అన్నారు. అయితే, క్రిటికల్ కండిషన్ నుంచి బయటపడ్డారని చెప్పలేమని అన్నారు. తన అన్న తారకరత్నకు ఎన్‌హెచ్ హాస్పిటల్‌లో మెరుగైన వైద్యం అందుతోందని అన్నారు. ఆత్మబలం, మనోబలం, అభిమానుల ఆశీస్సులు, తాతగారి ఆశీస్సులతో మళ్లీ కోలుకొని, ఇంతకుముందులాగే మనందరితో కలిసి తిరగాలని ఆకాంక్షించారు. ఇలాంటి పరిస్థితిలో తమకు అండగా నిలిచిన కర్ణాటక ప్రభుత్వానికి, తనకు ఆప్తుడైన కర్ణాటక ఆరోగ్య మంత్రి కేశవ సుధాకర్ కు ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు.


తారకరత్న ఆరోగ్య విషయంపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. అవయవాలు అన్నీ బాగానే పని చేస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ, ఆరోగ్యం మెరుగుపడడం కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. గుండెలో క్లాట్ అవడం, కాస్త ఇంటర్నల్ బ్లీడింగ్ అవడం వల్ల స్టంట్ వేయడం కుదరలేదని చెప్పారు. ప్రస్తుతం వైద్యులు స్టెప్ బై స్టెప్ పర్యవేక్షిస్తున్నారని అన్నారు. "ఇవాళ మేం కొంచెం గిచ్చినా రెస్పాండ్ అయ్యాడు. ఇంకో రెండు మూడు సార్లు గిచ్చితే అవ్వలేదు. దానికోసం కొంచెం టైం పడుతుంది. మెడికేషన్ పని చేయాలి కదా? కొంచెం టైం తీసుకుంటుంది. కళ్లలో కూడా కొంచెం మూమెంట్స్ ఉన్నాయి’’ అని బాలకృష్ణ అన్నారు.