పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'కల్కి 2898 AD'. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ లో సుమారు రూ. 600 కోట్ల భారీ బడ్జెట్ అశ్వినీ దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇక కామిక్ కాన్ ఈవెంట్ లో ఈ మూవీ గ్లింప్స్ ని రిలీజ్ చేసిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి పెరిగింది.   


ఫోటో లీక్ పై నిర్మాణ సంస్థ సీరియస్


తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫోటో లీక్ అయ్యింది. ఈ వ్యవహారంపై నిర్మాణ సంస్థ సీరియస్ అయ్యింది. ఈ ఫోటో సినిమాకు సంబంధించి విఎఫ్ఎక్స్ పనులు చేస్తున్న కంపెనీ నుంచే బయటకి వచ్చినట్లు గుర్తించింది. సదరు విఎఫ్ఎక్స్  కంపెనీపై మేకర్స్ పోలీసు కంప్లైంట్ కూడా చేశారు. ఇప్పటికే లీకేజీకి కారణమైన ఉద్యోగిని కంపెనీ నుంచి తొలగించినప్పటికీ, నిర్మాతలు ఆ కంపెనీపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


లీకులను అడ్డుకునేందుకు కీలక నిర్ణయం


ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి లీకుల బెడద తప్పకపోవచ్చనే ఆలోచనతో నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సహా ఏ ఇతర  కంటెంట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.  “వై జయంతి మూవీస్ నిర్మిస్తున్న 'కల్కి 2898 AD' చిత్రం కాపీ రైట్స్ చట్టం ద్వారా పరిరక్షించబడుతుందని అందరికీ తెలియజేస్తున్నాం. ఈ సినిమాలోని ఏదైనా భాగాన్ని లేదంటే ఫోటోలు, వీడియోలను ఇతరులతో లేదంటే సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం చట్ట విరుద్ధం. నిబంధనలను ఉల్లంఘిస్తే పోలీసులు సహకారంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం” అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 






నిర్మాతలను లీకుల తలనొప్పి


గత కొంతకాలంగా చిత్ర నిర్మాతలకు లీకుల బెడద తలనొప్పులు కలిగిస్తున్నాయి.  ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదొక విధంగా కంటెంట్  బయటకి వస్తూనే ఉంది. షూటింగులు జరుపుకుంటున్న లొకేషన్స్ నుంచి ఫోటోలు, వీడియోలు లీక్ అవుతున్నాయి. హీరోల లుక్స్,  పాటలు కూడా బయటకు వస్తున్నాయి. ఎడిటింగ్ రూమ్స్, విఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్న స్టూడియోల నుంచి కూడా ఆయా సినిమాలకు సంబంధించిన విజువల్స్, ఫోటోలు లీక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లీకులకు చెక్ పెట్టేందుకు నిర్మాణ సంస్థలు కీలక చర్యలు చేపడుతున్నాయి.  


వచ్చే ఏడాది సంక్రాంతికి 'కల్కి 2898 AD' విడుదల


సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాగా  'కల్కి 2898 AD'తెరకెక్కిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన దీని గ్లింప్స్‌ వీడియో అభిమానులను ఓ రేంజిలో ఆకట్టుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 12న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.


Read Also: హీరో విజయ్ దళపతి నన్ను నమ్మలేదు- దర్శకుడు అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial