రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీ మృతి చెందారు. టైఫాయిడ్ కారణంగానే ఆ ఖైదీ మృతి చెందినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో అదే జైల్లో ఉన్న చంద్రబాబు భద్రతపై ఆయన కుమారుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతం చేయించేందుకే జైల్లో పెట్టారా అని ప్రభుత్వాన్ని, జగన్‌ను ప్రశ్నిస్తున్నారు.  






చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేయించింది, జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయన్నారు నారా లోకేష్‌. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోందని మండిపడ్డారు. ‌బాబుకు జైలులో భద్రత లేదని... విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.  


జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ  డెంగీతో మరణించారని చెప్పారు లోకేష్. చంద్రబాబును కూడా  ఇలాగే చేయాలని కుతంత్రాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకి ఏం జరిగినా జగన్ దే బాధ్యతని వార్నింగ్ ఇచ్చారు. 


చంద్రబాబు భద్రతపై మొదటి నుంచి టీడీపీ అనుమానం 


చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించినప్పటి నుంచి ఆయన భద్రతపై టీడీపీ లీడర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ రీజన్స్‌ ఒక కారణమైతే అక్కడి సౌకర్యాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ములాఖత్‌ తర్వాత మాట్లాడిన భువనేశ్వరికానీ, యనమల రామకృష్ణుడు కానీ ఈ దోమల విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దోమలు విపరీతంగా ఉన్నాయన్నారు. వాటి నివారణకు చర్యలు తీసుకోడం లేదని ఆరోపించారు. నెట్‌ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని సౌకర్యాలు కల్పించడంలో శ్రద్ధ పెట్టలేదని విమర్శించారు.