ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే హీట్ మొదలైంది. టీడీపీ వాళ్లు స్పీకర్‌ పోడియం చుట్టుముట్టారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని టీడీపీ పట్టుబట్టింది. దీనిపై అధికార పక్షం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చెప్పారు. ఈ సందర్భఁగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అంబటి మాట్లాడూ టీడీపీ సభ్యులను రెచ్చగొట్టారు. దీంతో అటు నుంచి కూడా గట్టి రియాక్షన్ వచ్చింది. 


చంద్రబాబు అక్రమ అరెస్టులపై చర్చ జరపాలని టీడీపీ పట్టుబట్టారు. స్పీకర్ పోడియంను చట్టుముట్టారు.  ఈ గందరగోళం మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగించే ప్రయత్నం చేశారు. టీడీపీ సభ్యులు  మాత్రం వెనక్కి తగ్గలేదు. స్పీకర్‌ పోడియం వద్దే నినాదాలు చేస్తూ నిల్చున్నారు. టీడీపీ సభ్యులకు వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా మద్దతు ప్రకటించారు. స్పీకర్‌ వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. 


టీడీపీ సభ్యుల తీరుపై మొదట మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అభ్యంతరం  వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు కోరుతున్నట్టు అన్నింటిపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయితే ప్రోపర్‌ ఫార్మెట్‌లో వస్తే అన్నింటిపై డిస్కషన్ చేద్దాం అన్నారు. అయినా టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. 


ఇంతలో మంత్రి అంబటి రాంబాబు లేచి మాట్లాడటంతో పరిస్థితి ఒక్కసారిగా హీట్‌ ఎక్కింది. టీడీపీ సభ్యులను ఉద్దేశిస్తూ మాట్లాడిన అంబటి రాంబాబు... అక్కడ జరుగుతున్న వాటిపై రన్నింగ్ కామెంట్రీ చెప్పారు. స్పీకర్‌పై దాడి చేయడానికి కూడా కొందరు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇలా వారిని నిలువరించకపోతే రెచ్చగొట్టే ధోరణితో వాళ్లు ఉంటే తమ సభ్యులు కూడా రెచ్చిపోతారంటూ కామెంట్ చేశారు.


తమను రెచ్చగొడుతున్నారని... తమ దగ్గరా ఓవరాక్షన్ చేసే వ్యక్తులున్నారు అని అంబటి అన్నారు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే వారిదే బాధ్యత అని హెచ్చరించారు. అక్రమ కేసులు ఎత్తివేయమని ఇక్కడ కాదు అడగాల్సిందని కోర్టుల్లో వాదించాలన్నారు. 


ఇలా ఆయన కామెంట్ చేస్తూనే బాలకృష్ణ ప్రస్తావన తీసుకొచ్చారు. బాలకృష్ణ తమ వైపు చూసి మీసాలు తిప్పారని... అలాంటి కార్యక్రమాలు సినిమాల్లో పెట్టుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. మీసాలు తిప్పుడం కాదని దమ్ముంటే రా అంటూ బాలకృష్ణకు అంబటి సవాల్ చేశారు. రా రా చూసూకుందాం అంటూ గట్టిగా మాట్లాడారు. దీంతో సభలో ఒక్కసారిగా అరుపులు కేకలతో దద్దరిల్లిపోయింది.
 అంబటి రాంబాబు అలా మాట్లాడుతుండగానే వెనుకే ఉన్న బియ్యం మధుసూదన్ రెడ్డి లేచి టీడీపీ సభ్యుల వైపు వెళ్లడం కనిపించింది. 


బియ్యం మధుసూదన్ రెడ్డి వెళ్తూ వెళ్తూ టీడీపీ లీడర్లను రెచ్చగొట్టేలా వారి ఎదురుగా తొడకొట్టినట్టు తెలుస్తోంది. ఇరు వర్గాల రెచ్చగొట్టే చర్యల కారణంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో స్పీకర్‌ లేచి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి సభను వాయిదా వేసి వెళ్లిపోయారు. 


అంతకు ముందు టీడీపీ సభ్యులు పాదయాత్రగా సభకు వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమ కేసుల్లో అరెస్టు చేశారని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. షెల్ కంపెనీల సృష్టికర్త జగనే అంటూ ప్లకార్డును ఉండవల్లి శ్రీదేవి పట్టుకున్నారు. చంద్రబాబుపై కక్ష- యువత భవితకు శిక్ష అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.