ఏపీలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నా కూడా టీడీపీ ఉత్సాహంగానే ఉంటుంది. గత సమావేశాలకు చంద్రబాబు హాజరు కాకపోయినా టీడీపీ నేతలు అసెంబ్లీలో హడావిడి చేశారు, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూశారు. కానీ ఈసారి పరిస్థితి వేరు. చంద్రబాబు జైలులో ఉన్నారు, లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. మరి అసెంబ్లీలో టీడీపీని నడిపించేది ఎవరు..? బాలయ్య అంతా తానై చూసుకుంటారనే చర్చ టీడీపీ వర్గాల్లో నడుస్తోంది.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత బాలయ్య రెండు రోజులు లీడ్ రోల్ పోషించారు. మంగళగిరి పార్టీ ఆఫీస్ లో బావ కుర్చీలో కూర్చుని మరీ రివ్యూ మీటింగ్ లు పెట్టారు. చంద్రబాబు అరెస్ట్ బాధతో మరణించిన వారి కుటుంబాలను తాను పరామర్శిస్తానని హామీ ఇచ్చారు. వారికి తాను అండగా ఉంటానన్నారు. జైలులో పవన్ ములాఖత్ సమయంలో కూడా బాలకృష్ణ అన్నీ తానై చూసుకున్నారు. కానీ హఠాత్తుగా ఆయన సీన్ లోనుంచి మాయమయ్యారు. రెండు మూడు రోజులుగా భువనేశ్వరి, బ్రాహ్మణి నిరసనలను ముందుండి నడిపిస్తున్నారు. రాజమండ్రిలోనే మకాం వేసి పార్టీ శ్రేణులకు ధైర్యం చెబుతున్నారు. పరామర్శలకు వచ్చేవారిని వారే రిసీవ్ చేసుకుంటున్నారు. మరి అసెంబ్లీలో టీడీపీ తరపున పోరాటం చేసేది ఎవరు అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. లోకేష్ మాజీ ఎమ్మెల్సీ కావడంతో అసెంబ్లీకి రాలేరు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉన్నా కూడా ఆయన అంత ధీమాగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టగలరా అనే అనుమానాలున్నాయి. ఇప్పుడు అందరి చూపూ బాలయ్యపైనే ఉంది. అసెంబ్లీలో దబిడ దిబిడ ఆయన వల్లే సాధ్యమంటున్నారు.
నందమూరి అభిమానులు కోరుకుంటున్నదేంటి..?
చంద్రబాబు అరెస్ట్ తర్వాత, నారా-నందమూరి ఫ్యామిలీల మధ్య చిచ్చు పెట్టేందుకు చాలామంది చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి ఆ రెండు కుటుంబాల మధ్య గొడవలు సృష్టించేందుకు కొంతమంది వ్యూహాలు పన్నారు. టీడీపీ అనుకూల మీడియా బాలయ్యకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదని, వైపీసీ అనుకూల మీడియాలో సింపతీ చూపించడం ఇక్కడ విశేషం. ఒకవేళ నిజంగానే బాలయ్యకు ప్రాధాన్యత వచ్చినా వారు తట్టుకోలేని పరిస్థితి. అయితే టీడీపీలో మాత్రం అలాంటి వ్యవహారాలేవీ లేవంటున్నారు నేతలు. నారా అయినా, నందమూరి అయినా టీడీపీ పటిష్టత కోరుకుంటున్నామని చెబుతున్నారు. బాలయ్య ప్రస్తుతానికి పార్టీని ముందుండి నడిపించినా, చంద్రబాబు వచ్చాక పార్టీపై పెత్తనం ఆయనకే ఉంటుందని, అందులో అనుమాన పడాల్సిన అవసరం లేదంటున్నారు.
వాస్తవానికి బాలయ్య కూడా పార్టీపై పెత్తనం కోరుకోవడంలేదు. అక్కడ ఉన్నది సొంత బావ, సొంత అల్లుడు. అలాంటి ఉమ్మడి కుటుంబంలో చిచ్చురేపడం ఆయన అభిమతం కూడా కాదు. అయితే ఇప్పుడు ఆయన షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. నాలుగు రోజులుగా రాజమండ్రిలో కనపడ్డంలేదు, అటు పార్టీ ఆఫీస్ కి కూడా రావడంలేదు. రేపటినుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలకు బాలయ్య కచ్చితంగా హాజరవుతారని అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఎమ్మెల్యేలను ఆయనే ముందుండి నడిపిస్తారని చెబుతున్నారు. అదే నిజమైతే నందమూరి అభిమానుల ఆనందం మరింత రెట్టింపవుతుంది. కష్టకాలంలో బాలయ్య సేవలు టీడీపీకి ఉపయోగపడినట్టు కూడా ఉంటాయి.