Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు అంసపూర్తిగా ఉందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. నారీ శక్తి వందనం బిల్లులో ఓబీసీ రిజర్వేషన్ ను కూడా చేర్చాలని కోరుకుంటున్నట్లు రాహుల్ తెలిపారు. ఓబీసీ రిజర్వేషన్ ప్రస్తావన లేదని, దాని వల్ల మహిళా రిజర్వేషన్ బిల్లు అసంపూర్తిగా ఉందని ఆయన అన్నారు. 


దేశ మహిళలకు పంచాయతీ రాజ్ అతి పెద్ద ముందడుగుగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. దేశంలోని మహిళలను రాజకీయాల వైపు మళ్లించడంలో, అధికారాలను బదిలీ చేయడంలో అతిపెద్ద ముందడుగు పంచాయతీరాజ్ అని, ఆ వ్యవస్థలో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చినట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు దేశ మహిళలకు పెద్ద ముందడుగు అని అందరూ సమర్థిస్తారని రాహుల్ గాంధీ చెప్పారు. మహిళలు కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. అయితే ఈ బిల్లు అసంపూర్తిగా ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ రిజర్వేషన్ ప్రస్తావన లేదని అన్నారు. 


మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు సంబంధించి రెండు అంశాల పట్ల స్పష్టం రావాలన్నారు. మొదటిది ఈ బిల్లు కోసం కొత్త జనాభా లెక్కలు, కొత్త డీలిమిటేషన్ నిర్వహించాలని రాహుల్ గాంధీ అన్నారు. తన దృష్టిలో లోక్‌సభ, రాజ్యసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నారీ శక్తి వందనం బిల్లును అమలు చేయాలని తెలిపారు.


మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం


మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లుకు అనుకూలంగా 454 మంది లోక్ సభ సభ్యులు ఓటు వేయగా, ఇద్దరు ‘నో’ అని ఓట్ చేసినట్లుగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.


బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం స్లిప్పుల ద్వారా సభలో ఓటింగ్‌ నిర్వహించారు. అంతకుముందు బిల్లు అసంపూర్తిగా ఉందని విపక్షాలు లోక్ సభ నుంచి వాకౌట్ చేశాయి. ఆ తర్వాత స్లిప్పుల ద్వారా ఓటింగ్ ప్రారంభం అయింది. డిజిటల్ ఓటింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్య ఉండడంతో ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పుల ద్వారా ఓటింగ్ నిర్వహించారు.


ఆకుపచ్చ, ఎరుపు రంగు స్లిప్పులపై ఎస్, నో అని ఉంటాయని, దానిపై సభ్యుడు సంతకం చేసి, వారి పేరు, ఐడీ నెంబర్, నియోజకవర్గం, రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం పేరు, తేదీ వంటి వివరాలు రాయాలని లోక్ సభ సెక్రటరీ ఉత్పల్ కుమార్ సింగ్ ముందే సూచించారు. స్లిప్పులు పంపిణీ చేసిన తర్వాత నుంచి మళ్లీ సభ్యుల నుంచి తీసుకొనే వరకూ ఎవరూ తమ సీట్లు వదిలి వెళ్లవద్దని సూచించారు. 


స్మృతి ఇరానీ కౌంటర్‌లు..


డీఎమ్‌కే ఎంపీ కనిమొళి కూడా బిల్‌పై మాట్లాడారు. మహిళలను నమస్కరించాలని పూజించాలని చెప్పడం ఆపేయాలని, వాళ్లకు సమానత్వం ఇవ్వడం కన్నా గౌరవం ఇంకేమీ ఉండదని తేల్చిచెప్పారు. తమను తల్లిగా, చెల్లిగా, భార్యగా గౌరవించాల్సిన అవసరం లేదని, మగాళ్లతో సమానంగా చూస్తే చాలని అన్నారు. అసలు ఏ ప్రాతిపదికన ఈ బిల్ తీసుకొస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ఎన్నికల కోసం బీజేపీ చేస్తున్న స్టంట్ అని మండి పడ్డారు. ఈ బిల్‌ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. "మహిళలు ఇంట్లో వంట చేసుకుంటే ఇంకెవరో వచ్చి దేశాన్ని నడిపిస్తారు" అనే భావజాలంతో బీజేపీ పని చేస్తోందని అన్నారు ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే. అయితే..ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గట్టిగానే స్పందించారు. సోనియా గాంధీ పేరు ఎత్తకుండానే విమర్శలు చేశారు. 2010లో బిల్ తీసుకొచ్చిన వాళ్లు దాన్ని ఎందుకు పాస్ చేయలేకపోయారని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం "ఇది మా బిల్" అని చెప్పుకుంటున్నారని మండి పడ్డారు. మతపరమైన కోటాలు అడుగుతూ కాంగ్రెస్ దేశాన్నితప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మహిళా రిజర్వేషన్ బిల్‌పై ఎన్నో వాదోపవాదాలు జరిగాయి.