Singer Subh: భారత్ - కెనడా దేశాల మధ్య రెండ్రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హత్యలో భారత ప్రమేయం ఉందంటూ.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. ఆ తర్వాత భారత దౌత్యవేత్తలను కెనడా బహిష్కరించడం, ఆ వెంటనే భారత్.. కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించడంతో మరింత ముదిరింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. ఈ సమయంలో పంజాబీ-కెనడియన్ సింగర్ శుభనీత్ సింగ్ భారత్ లో ఓ షోను ప్రదర్శించేందుకు ఇప్పటికే షెడ్యూల్ అయిపోయింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో శుభ్ పెట్టిన ఓ పోస్టు ఉద్రిక్తతకు దారి తీసింది. భారత్ - కెనడా మధ్య ఉన్న వివాదానికి ఆజ్యం పోసేలా శుభ్.. ఇండియా మ్యాప్ ను వక్రీకరిస్తూ పోస్టు పెట్టాడు. ఇందులో పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ప్రత్యేక దేశాలుగా చూపించాడు. దీంతో శుభ్ పై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.


శుభ్ తీరును భారతీయులు తీవ్రంగా ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా శుభ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా యువ మోర్చా (BJYM) సభ్యులు వేర్పాటువాద ఖలిస్థానీ అంశాలకు మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తూ అతని పోస్టర్ లను చించేశారు. ఖలిస్థానీ తీవ్రవాది అయిన అమృత్ పాల్ సింగ్ కు మద్దతు ఇచ్చాడు. ఇప్పటికే షెడ్యూల్ అయిన షో పైనా ఫైర్ అవుతున్నారు. బుక్‌మైషో ద్వారా ఈ షోకు సంబంధించిన టికెట్లను ఇప్పటికే విక్రయించగా.. బుక్‌మైషో పైనా మండిపడుతున్నారు. ఈ క్రమంలో అన్‌ఇన్‌స్టాల్ బుక్‌మైషో అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన బుక్‌మైషో.. కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబీ - కెనడియన్ సింగర్ శుభనీత్ సింగ్ భారత పర్యటనను రద్దు చేసింది. బుక్‌మైషో 7 -10 రోజుల్లో టికెట్ల డబ్బులను తిరిగి చెల్లిస్తామని తెలిపింది. శుభనీత్ సింగ్ భారత పర్యటనకు బుక్‌మైషో స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. 


కోర్డెలియా క్రూయిజ్ లో నిర్వహించనున్న క్రూయిజ్ కంట్రోల్ 4.0 ఈవెంట్ లో భాగంగా శుభ్ ముంబై లో సెప్టెంబర్ 23 నుంచి 25వ తేదీ వరకు ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. స్టిల్ రోలిన్ ఇండియా టూర్, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై సహా ఇతర 12 ప్రధాన భారతీయ నగరాల్లో మూడు నెలల పాటు ప్రదర్శనలను ప్లాన్ చేశారు. ఈ క్రమంలో భారత్ - కెనడా మధ్య వివాదం తలెత్తడం, దానికి ఆజ్యం పోసేలా శుభ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో బుక్‌మైషో అతడి పర్యటనను రద్దు చేసింది. 


ఇదే ఏడాది జూన్ లో సర్రేలోని గురుద్వారా ఎంట్రన్స్ వద్ద ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. జలంధర్ లో హిందూ పూజారిని చంపిన కేసులో ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ కు చెందిన నిజ్జర్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రకటించింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ పై రూ. 10 లక్షల రివార్డు కూడా ఉంది. నిజ్జర్ హత్య కేసులో ప్రమేయం ఉందన్న కారణంతో కెనడా అగ్రశ్రేణి భారత దౌత్యవేత్తను బహిష్కరించినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తీవ్రంగా ఖండించారు. కెనడా ప్రధాని వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమైనవని, ప్రేరేపితమైనవని అన్నారు. కెనడా దౌత్యవేత్తలను కూడా భారత ప్రభుత్వం బహిష్కరించింది.