ఇప్పటికే భారత్‌, కెనడా మధ్య ఖలిస్థానీ అంశం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.  తాజాగా కెనడాలో మరో ఖలిస్థానీ సానుభూతి పరుడి హత్యకు గురయ్యాడు.  గ్యాంగ్‌స్టర్‌ సుఖ్‌దోల్‌ సింగ్‌ అలియాస్‌ సుఖా దునెకే హత్యకు గురైనట్లు సంబంధిత వర్గాల నుంచి సమాచారం. బుధవారం కెనడాలోని జరిగిన గ్యాంగ్‌ వార్‌లో ప్రత్యర్థి గ్యాంగ్‌ జరిపిన దాడిలో సుఖా దునెకే మరణించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. సుఖా ఖలిస్థానీ ఉద్యమంలో పనిచేశాడు.


పంజాబ్‌లోని మోఘా జిల్లాకు చెందిన దేవిందర్‌ బంబిహా గ్యాంగ్‌కు చెందిన సుఖా దునెకేపై భారత్‌లో పలు కేసులు ఉన్నాయి. అయితే అతడు 2017లో నకిలీ పత్రాలతో కెనడాకు పారిపోయినట్లు సమాచారం. ఇతడు ఏ క్యాటగిరీ గ్యాంగ్‌స్టర్‌. ఖలిస్థానీ టెర్రరిస్ట్‌ అర్ష్‌ డల్లాకు సన్నిహితుడు. కెనడా వెళ్లిన తర్వాత అతడి ముఠాలో చేరి ఖలిస్థానీ ఉద్యమంలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాద నిరోధక ఏజెన్సీ ఎన్‌ఐఏ విడుదల చేసిన 43 మంది గ్యాంగ్‌స్టర్ల జాబితాలో ఇతడి పేరు కూడా ఉంది.  


పంజాబ్‌కు చెందిన దాదాపు 30 మంది గ్యాంగ్‌స్టర్లు ప్రస్తుతం భారత్‌లో కేసులు తప్పించుకునేందుకు నకిలీ పత్రాలతో ఇతర దేశాలకు పారిపోయినట్లు ఇంటలిజెన్స్‌ వర్గాల సమాచారం. అక్రమంగా ఇతర దేశాలకు వెళ్లి అక్కడ ఆశ్రయం పొందుతూ తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో సుమారు ఎనిమిది మంది కెనడాలో ఉన్నట్లు సమాచారం. అందులో ఒకడైన సుఖా మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.


గత నెలలో అర్ష్‌ డల్లాకు చాలా సన్నిహితులైన ఇద్దరు మన్‌ప్రీత్‌ సింగ్‌పీటా, అతడి సోదరుడు మన్‌దీప్‌లను ఫిలిప్పైన్స్‌ నుంచి భారత్‌కు తరలించారు. తర్వాత ఎన్‌ఐఏ వారిని అరెస్ట్‌ చేసింది. మన్‌ప్రీత్‌ ఫిలిప్పైన్స్‌లో ఉంటూ అర్ష్‌ డల్లా సూచనలతో పంజాబ్‌లో చాలా ప్లాన్స్‌ను ఎగ్జిక్యూట్‌ చేశాడు. 2022 మేలో మూసేవాలా సంచలన హత్య తర్వాత పరారీలో ఉన్న కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ బంధువైన సచిన్‌ను భారత్‌కు తీసుకురావడంలో ఏజెన్సీలు విజయం సాధించాయి. సిద్ధూ మూసేవాల హత్య కేసులో వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న లారెన్స్‌ బిష్ణోయ్‌ సహాయకుడు సచిన్‌ బిష్ణోయ్‌ను అజర్‌బైజాన్‌ నుంచి భారత్‌కు తీసుకువచ్చారు.


ఈ ఏడాది జూన్‌లో ఖలిస్థానీ సానుభూతి పరుడు, ఖలిస్థాన్‌ టైగర్స్‌ ఫోర్స్‌ నేత హర్‌దీప్‌ సిం్‌ నిజ్జర్‌ హత్య జరిగిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తితలు మరింత పెరిగాయి. నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని విశ్వసనీయమైన ఆరోపణలు ఉన్నాయిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడ్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కెనడాలోని భారత రాయబారిపై సోమవారం వేటు వేశారు. కెనడా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారత్‌ కూడా కెనడా రాయబారిని బహిష్కరించి  దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. జూన్‌ 18న కెనడాలోని బ్రాంప్టన్‌ పట్టణంలోని గురుద్వారా సాహిబ్‌ పార్కింగ్‌లో హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అతడు మరణించాడు. అయితే ఇందులో భారత హస్తం ఉందన్నది కెనడా వాదన.