69వ జాతీయ సినిమా అవార్డుల్లో ఉత్తమ నటుడి కేటగిరీలో ఈసారి టాలీవుడ్ నుంచి ఏకంగా ముగ్గురు నటులు రేసులో ఉన్నారు. ‘పుష్ఫ: ది రైజ్’ సినిమాకు అల్లు అర్జున్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు గానూ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రస్తుతం ఉత్తమ నటుడి అవార్డు రేసులో ఉన్నారు. అయితే మలయాళంలో జోజు జార్జి, తమిళంలో సూర్య కూడా ఈ రేసులో ఉన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ఈ అవార్డుల వివరాలను ప్రకటించనున్నారు.
2021 సంవత్సరానికి గానూ ఈ అవార్డులను అందించనున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ 2022లో విడుదల అయినప్పటికీ, దానికి సంబంధించిన సెన్సార్ 2021లోనే పూర్తయిపోయింది. కాబట్టి 2021కే అవార్డుల రేసులో ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. మరి తెలుగు నటులను జాతీయ అవార్డు ఈసారైనా వరిస్తుందా?
ఇప్పటివరకు ఒక్క తెలుగు నటుడికి కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు రాలేదు. మరో పక్క తమిళంలో మాత్రం కమల్ హాసన్ మూడు సార్లు, ధనుష్ రెండు సార్లు ఈ అవార్డు సాధించారు. దివంగత ఎంజీఆర్, చియాన్ విక్రమ్, సూర్య ఒక్కోసారి ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నారు.
కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల నుంచి కూడా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులు గెలుచుకున్న వారు ఉన్నారు. దక్షిణ చలనచిత్ర పరిశ్రమలో ఉత్తమ నటుడి అవార్డును ఒక్కసారి కూడా గెలుచుకోని పరిశ్రమ తెలుగు చలన చిత్ర పరిశ్రమ మాత్రమే. మరి ఈసారైనా ఆ లోటు తీరుతుందేమో చూడాలి.
మరోవైపు 'ఆర్ఆర్ఆర్'కి సీక్వెల్ ఉండబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ కి సంబంధించి అదిరిపోయే అప్డేట్స్ కూడా ఇచ్చారు ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్. తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాజమౌళి - ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన 'సింహాద్రి' సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే ముందుగా ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. "ఎన్టీఆర్ ఓ పరిణితి చెందిన వ్యక్. కష్టం, సుఖం, లాభం, నష్టం అన్ని చూసేసిన ఓ నిండుకుండలాంటి వ్యక్తిత్వాన్ని ఎన్టీఆర్‌లో చూశాను." అని చెప్పారు. అంతేకాకుండా ఎన్టీఆర్ చాలా బ్యాలెన్స్ గా ఉంటారని కూడా అన్నారు.
మళ్లీ ఆ కాంబినేషన్లో(రాజమౌళి - ఎన్టీఆర్) సినిమా ఎప్పుడు ఉంటుంది? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. 'ఆర్ఆర్ఆర్'కి సీక్వెల్ చేస్తున్నామని, అందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ నటిస్తారని వెల్లడించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందనే విషయం ప్రస్తుతానికి తనకు కూడా తెలియదని, కానీ 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ విషయంలో రాజమౌళికి చాలా ప్లాన్స్ ఉన్నాయని తెలిపారు. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ని ఏకంగా హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
Also Read : ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'వృషభ' - జెట్ స్పీడ్‌లో రోహన్, మోహన్ లాల్ సినిమా షూటింగ్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial