ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ క్లిక్ చేస్తున్నారా? అయితే, జాగ్రత్త. ఈ మహిళకు ఎదురైన చేదు అనుభవాన్ని మీరూ ఫేస్ చేయొచ్చు. రూ.లక్షలు పోగొట్టుకోవచ్చు. అదెలా అనుకుంటున్నారా? ఇదిగో ఇలా..


పార్ట్ టైమ్ ఉద్యోగం, మంచి సాలరీ. ఇంకేం! ఎవరైనా ఈ ఆఫర్ కు ఓకే చెప్తారు. తక్కువ కష్టపడ్డా ఎక్కువ డబ్బు వస్తుందంటే ఎవరు మాత్రం ఎలా కాదంటారు. సరిగ్గా ఇదే వీక్ నెస్ ను క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. పార్ట్ టైమ్ ఉద్యోగం ఇస్తామంటూ అమాయకుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. చాలా సందర్భాల్లో బాధితుల నమ్మకాన్ని పొందేందుకు, స్కామర్లు కొంత డబ్బును వారి ఖాతాల్లో జమ చేసి, ఆ తర్వాత పెద్ద మొత్తంలో వారిని నుంచి లాగే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి మోసం కర్నాటకలో జరిగింది. స్కామర్ల మాటలు నమ్మి మంగులూరుకు చెందిన ఓ సాఫ్ట్‌ వేర్ ప్రొఫెషనల్‌ పెద్దమొత్తంలో డబ్బును కోల్పోయింది. సదరు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  


రూ. 10.5 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు


మంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇన్ స్టా గ్రామ్ లో ఓ యాడ్ చూసింది. పార్ట్ టైమ్ జాబ్ తో మరింత ఆదాయం పొందవచ్చు అనే యాడ్ ఆమెను బాగా ఆకట్టుకుంది. ఈ యాడ్ మీద క్లిక్ చేసి తాను ఆ ఉద్యోగం చేయడానికి సిద్ధమేనంటూ ఆ నెంబర్‌కు మెసేజ్ పంపించింది. టెలిగ్రామ్ లో కనెక్ట్ కావాలని అవతలి నుంచి సమాధానం వచ్చింది. సదరు ఉద్యోగి, మెసేజ్ లో చెప్పినట్లుగా ఓ యాప్ డౌన్ లోడ్ చేసి కనెక్ట్ అయ్యింది. అవతలి వ్యక్తితో మాట్లాడింది. మీరు పెట్టే పెట్టుబడి మీద 30 శాతం రాబడి ఇస్తామని చెప్పారు. బాధితురాలు తన గూగుల్ పే ద్వారా వాళ్లు చెప్పిన UPI IDకి రూ.7,000 పంపింది. ఇచ్చిన మాట ప్రకారం ఆమె ఖాతాలోకి  రూ.9,100 వచ్చింది. నెమ్మదిగా ఆమె స్కామర్‌ను నమ్మడం మొదలు పెట్టింది. నెమ్మదిగా రూ.10,50,525 బదిలీ చేసింది. ఆ తర్వాత సదరు స్కామర్ ఆమెను బ్లాక్ చేశాడు. తాను మోసపోయానని గ్రహించిన మహిళ పోలీసులను ఆశ్రయించింది.


స్కామర్ల నుంచి ఎలా సురక్షితంగా ఉండాలంటే?


పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. లింక్డ్‌ ఇన్, నౌకరీ.కామ్ లాంటి జెన్యూన్  పోర్టల్స్ ద్వారా పార్ట్‌ టైమ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. ఒకవేళ ఇతర మార్గాల ద్వారా ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు తెలిస్తే, జాబ్ ఆఫర్ చేసే వ్యక్తులు, సంస్థల గురించి క్షుణ్ణంగా తనిఖీ చేయాలి.  వారి పేరు, వారి కంపెనీ పేరుతో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవాలి. ఉద్యోగం ఆఫర్ చేస్తున్న కంపెనీ గురించి గూగుల్ లో వెతికి చూడాలి. ఉద్యోగం కోసం  పేరు, ఫోన్ నంబర్ మొదలైన  వ్యక్తిగత సమాచారాన్ని పూరించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.  అపరిచితుల బ్యాంక్ ఖాతాలోకి ఎట్టిపరిస్థితుల్లో డబ్బును బదిలీ చేయవద్దు. మీ బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ప్రముఖ కంపెనీలు మీకు ఉద్యోగం ఇవ్వడానికి ఎలాంటి డబ్బు అడగవని గుర్తుంచుకోవాలి.  


Read Also: ఐఫోన్‌ యూజర్లకు కంపెనీ హెచ్చరిక - ఇలాంటి పనులు అసలు చేయొద్దని సూచన


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial