Iphone Warning : ఇప్పుడు యువత ఒక్క నిమిషం ఫోన్‌ వదిలేసి ఉండలేకపోతున్నారు. గంటలు గంటలు ఫోన్లకే అతుక్కుపోతున్నారు. నిద్రపోయేప్పుడు కూడా పక్కన ఉండాల్సిందే. చాలా మందికి రాత్రి ఛార్జింగ్‌ అయిపోయే దాకా ఫోన్‌ చూసి ఛార్జింగ్‌ పెట్టి పక్కనే పెట్టుకుని నిద్రపోవడం అలవాటు. మరికొందరు ఫోన్‌ను ఎప్పుడూ పట్టుకునే ఉంటారు, పడుకునేప్పుడు కూడా వదలరు. ఛార్జింగ్‌ పెట్టి దిండు కింద పెట్టుకుని మరీ పడుకుంటారు. ఇలా ఫోన్‌ ఛార్జ్‌ చేసి పక్కన పెట్టుకుని పడుకోవడం చాలా డేంజర్‌. రేడియేషన్‌ ప్రభావం మనపై చూపిస్తుంది, అంతే కాకుండా బ్యాటరీ హీట్‌ అయ్యి ఫోన్‌ పేలిపోయిన సందర్భాలూ చాలా చూశాం.


 స్మార్ట్‌ ఫోన్‌ల నుంచి వెలువడే రేడియేషన్‌ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని, ఫోన్‌ పక్కన పెట్టుకుని ఎప్పుడూ నిద్ర పోవద్దని ఇప్పటికే ఎన్నో సర్వేలు కూడా వెల్లడించాయి. మరీ ముఖ్యంగా ఫోన్‌ ఛార్జింగ్‌లో పెట్టి పక్కన నిద్ర పోవడం చాలా ప్రమాదకం. ఈ విషయాన్ని సర్వేలు తెలపడం మాత్రమే కాదు. ఇటీవల ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ యాపిల్‌ స్వయంగా వెల్లడించింది. ఈ విషయంపై వినియోగదారులకు స్పష్టంగా హెచ్చరిక చేసింది. ఎవరికైతే ఐఫోన్‌ పట్టుకుని నిద్రపోయే అలవాటు ఉందో, ముఖ్యంగా ఛార్జింగ్‌ పెట్టి పక్కన పెట్టుకుని నిద్రపోయే అలవాటు ఉందో అది మంచిది కాదని తెలిపింది. యాపిల్‌ సంస్థ తమ ఆన్‌లైన్‌ యూజర్‌ గైడ్‌లో ఈ విషయాన్ని స్పష్టంచేసింది.


ఐఫోన్లను బాగా వెంటిలేషన్‌ ఉన్న వాతావరణంలో టేబుల్‌ లాంటి ఫ్లాట్‌ సర్ఫేస్‌లపైన ఛార్జింగ్‌ పెట్టాలని యాపిల్‌ సూచించింది. దుప్పట్లు, దిండ్లు, మీ శరీరం వంటి మృదువైన ప్రదేశాలలో ఉంచి ఛార్జింగ్‌ పెట్టకపోవడమే మంచిదని సూచించింది. తేమ ఉన్న ప్రదేశాలలో కూడా ఛార్జింగ్‌ చెయ్యొదని తెలిపింది.ఛార్జింగ్‌ పెట్టినప్పుడు ఐఫోన్లు వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఈ హీట్‌ సులువుగా బయటకు వెళ్లగలిగేలా లేనప్పుడు ఫోన్‌ పేలడం, విద్యుత్‌ షాక్‌ రావడం, మంటలు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని యాపిల్‌ తన గైడెన్స్‌లో వెల్లడించింది. 


ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టి పిల్లో కింద పెట్టడం అస్సలు సురక్షితం కాదని పేర్కొంది. చాలా మంది ఇలా చేస్తుంటారని అది ప్రమాదకరమని తెలిపింది. కనెక్ట్‌ చేసి ఉన్న ఫోన్‌, ఇతర డివైజెస్‌ పైన, పవర్‌ అడాప్టర్స్‌ పైన, వైర్‌లెస్‌ ఛార్జర్స్‌ పైన నేరుగా పడుకోవద్దని.. వీటిని దుప్పట్లు, దిండ్ల కింద ఉంచి కూడా పడుకోవద్దని యాపిల్‌ తన మెసేజ్‌లో స్పష్టంచేసింది. వేడికి త్వరగా రియాక్ట్‌ అయ్యే శరీరతత్వం ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. అలాగే ఛార్జింగ్‌ పోర్ట్‌ల విషంలోనూ కేర్‌ఫుల్‌గా ఉండాలని సూచించింది. ఇతర ఛార్జర్లను వాడకపోవడమే మంచిదని, యాపిల్‌ ప్రొడక్ట్స్‌ వాడడమే శ్రేయస్కరమని పేర్కొంది.


ఇటీవల సర్వేల ప్రకారం దాదాపు మూడొంతుల మంది టీనేజర్లు, యువత నిద్రపోయే ముందు ఫోన్‌ ఎక్కువసేపు వాడుతున్నారని పేర్కొన్నాయి. రాత్రి చాలా సేపు సోషల్‌మీడియా చూడడం, వీడియోలు చూడడం చేస్తున్నారని, ఫోన్లు పక్కనే పెట్టుకుని నిద్రపోతున్నారని వెల్లడైంది. ఇలాంటి అలవాట్లు డే రొటీన్‌కు ఇబ్బంది కలిగించడంతో పాటు ఆరోగ్యానికీ హానికరం. కాబట్టి యువత సెల్‌ఫోన్‌ వాడేప్పుడు కేర్‌ఫుల్‌గా ఉండడం మంచిది.