ఈరోజుల్లో ప్రేక్షకులు ఎక్కువగా వైవిధ్యభరితమైన కథలనే ఇష్టపడుతున్నారు. పైగా ఈ వైవిధ్యభరితమైన కథలలో కొంచెం కామెడీ కలిస్తే.. ఇంక సినిమా హిట్టే అన్న నమ్మకాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఇదే అతిపెద్ద సక్సెస్ ఫార్ములా అని మేకర్స్ భావిస్తున్నారు. పూర్తిస్థాయి కామెడీ చిత్రాలు కూడా ఈరోజుల్లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయలేక కమర్షియల్‌గా ఫెయిల్ అవుతుండడంతో కథ కొత్తగా ఉండాలి, కానీ దాంట్లో కామెడీ ఉండాలి అని డైరెక్టర్స్ అనుకుంటున్నారు. అలాంటి ఒక వైవిధ్యభరితమైన కామెడీ ఎంటర్‌టైనరే ‘స్లమ్ డాగ్ హస్బెండ్’. ఈ మూవీ ఓటీటీ అప్డేట్ ఇటీవల బయటికొచ్చింది.


హైప్ క్రియేట్ చేయలేక..
చిన్న సినిమాల్లోనే కంటెంట్ కరెక్ట్‌గా ఉంటుంది అని ఇప్పటికీ ఎన్నో సినిమాలు నిరూపించాయి. అలాంటి మరో చిత్రం ‘స్లమ్ డాగ్ హస్బెండ్’. ఈ మూవీ టైటిల్ దగ్గర నుండి పోస్టర్ వరకు అన్నింటిలో ఇది మామూలు కామెడీ చిత్రాలులాంటిది కాదు అని ప్రూవ్ చేస్తూనే ఉంది. ఏ ఆర్ శ్రీధర్ తెరకెక్కించిన ఈ మూవీని ప్రమోట్ చేయడం కోసం టీమ్.. చాలానే కష్టపడింది. ఈ ప్రమోషన్స్ కారణంగా ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ గురించి కొంతవరకు ప్రేక్షకులకు తెలిసింది. అందులో కొందరు మాత్రమే దీనిని థియేటర్లలో చూడడానికి ముందుకొచ్చారు. కాబట్టి సినిమాకు కావాల్సిన హైప్ క్రియేట్ అవ్వలేదు. దీంతో కలెక్షన్స్ కూడా అంతగా రాలేదు. కానీ ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌లోని కొన్ని సీన్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


బ్రహ్మాజీ సపోర్ట్ ఉన్నా..
జులై 29న ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ సినిమా థియేటర్లలో విడుదలయ్యింది. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రణవి మణుకొండ.. ఈ మూవీతో హీరోయిన్‌గా మారింది. ఇక ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు ఈ చిత్రంలో హీరోగా నటించాడు. అందుకే ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ ప్రమోషన్స్‌లో బ్రహ్మాజీ ముఖ్య పాత్రను పోషించాడు. సినీ సెలబ్రిటీలకు స్పెషల్ ప్రీమియర్ ఏర్పాటు చేశాడు. తానే స్వయంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. అంతే కాకుండా తన కొడుకు కోసం ఈ సినిమాలో కమెడియన్ పాత్రలో కూడా కనిపించాడు బ్రహ్మాజీ. అయినా కూడా కలెక్షన్స్ విషయంలో ఈ ప్రమోషన్స్ ఏవీ సపోర్ట్ చేయలేకపోయాయి. అందుకే థియేటర్లలో విడుదలయ్యి నెలరోజులు అవ్వకముందే ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ మూవీ ఓటీటీ అప్డేట్ వచ్చేసింది.


ప్రణవి మణుకొండ పోస్ట్..
‘స్లమ్ డాగ్ హస్బెండ్’.. ఆగస్ట్ 24న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అవుతున్నట్టుగా మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రణవి మణుకొండ.. ఈ మూవీ ఓటీటీ అప్డేట్‌ను స్వయంగా పోస్ట్ చేసింది. ఏ ఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అప్పి రెడ్డి, వెంకట అన్నప్పరెడ్డి నిర్మించారు. భీమ్స్ సినిరిలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఇక ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ కథ విషయానికొస్తే.. హీరోయిన్‌ను పెళ్లి చేసుకునే ముందు ఒక కుక్కతో హీరో పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత తన జీవితంలో జరిగే మార్పుల చుట్టూ కథ తిరుగుతుంది. ఇలాంటి ఒక డిఫరెంట్ కథను దర్శకుడు బాగానే రాసుకున్నా.. దాని ఔట్‌పుట్, ప్రమోషన్స్ వల్ల ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ మూవీ ఎక్కువమంది ప్రేక్షకుల వరకు వెళ్లలేదు.






Also Read: 'ఖుషి' సెన్సార్ పూర్తి - విజయ్ దేవరకొండ, సమంత సినిమా రన్ టైమ్ ఎంతంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial