వెండితెర ప్రేక్షకులకు బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar) పేరు అసలు పరిచయం ఉండకపోవచ్చు. కానీ, యూట్యూబ్ వీక్షకులకు ఆయన పేరు, ఆయన నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమాలు పరిచయమే. తొలుత విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు, లక్ష్మీ పార్వతిలపై ఓ డాక్యుమెంటరీ తీసిన ఆయన... ఆ తర్వాత ఇండిపెండెంట్ ఫిలిమ్స్ చేయడం మొదలు పెట్టారు.
సంచలనం సృష్టించిన 'మాంగల్యం'
'నిర్బంధం' పేరుతో బండి సరోజ్ కుమార్ తొలుత ఓ సినిమా చేశారు. యూట్యూబ్ ప్రపంచంలో ఆ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత 'నిర్బంధం 2' చేశారు. దానికి కూడా మంచి స్పందన లభించింది. ఆ రెండూ ఓ ఎత్తు అయితే... 'మాంగల్యం' పేరుతో బండి సరోజ్ కుమార్ నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా అయితే సంచలనం సృష్టించింది. సుమారు 16 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్ వీడియోలకు సెన్సార్ లేకపోవడంతో డైలాగులు, సన్నివేశాల పరంగా సరోజ్ కుమార్ స్వేచ్ఛ తీసుకున్నారు. తానూ ఏదైతే కథ చెప్పాలని అనుకున్నారో... ఆ కథకు ఎటువంటి కత్తెరలు లేకుండా చెప్పారు. ఇప్పుడు ఆయన ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నారు.
బండి సరోజ్ కుమార్ 'పరాక్రమం'
Bandi Saroj Kumar New Movie : బండి సరోజ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించబోతున్న తాజా సినిమా 'పరాక్రమం' (Parakramam Movie). ఐ, మి, మైసెల్ఫ్... అనేది ఉపశీర్షిక. బిఎస్కే మెయిన్ స్ట్రీమ్ పతాకంపై రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా ప్రీ టీజర్ విడుదల చేశారు. త్వరలో చిత్రీకరణ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రేమికుల రోజు సందర్భంగా 'పరాక్రమం'
ప్రస్తుతం 'పరాక్రమం' సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చిత్ర నిర్మాణ సంస్థ బిఎస్కే మెయిన్ స్ట్రీమ్ తెలియజేసింది. ''సెప్టెంబర్, అక్టోబర్... రెండు నెలల్లో రెండు షెడ్యూల్స్ చేసి, మొత్తం 30 రోజుల్లో సినిమాను పూర్తి చేస్తాం. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చిత్ర బృందం పేర్కొంది.
కుటుంబ సమేతంగా చూడదగ్గ 'పరాక్రమం'
'పరాక్రమం' ప్రీ టీజర్ విడుదల చేసిన సందర్భంగా బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ... ''ఓ నటుడిగా, దర్శకుడిగా ప్రేక్షకుల్లో కొంత మందికి నేను తెలిసే ఉండొచ్చు. 'కళ నాది... వెల మీది' అంటూ డిజిటల్ మాధ్యమాల్లో 'నిర్బంధం', 'మాంగల్యం' చిత్రాలు విడుదల చేశా. వాటి ద్వారా నాకు లక్షలాది ప్రేక్షకుల అభిమానం లభించింది. ఆ ప్రేక్షకులు ఇచ్చిన బలంతో ఇప్పుడు నేను "BSK MAINSTREAM" పేరుతో సొంత నిర్మాణ సంస్థ స్థాపించా. దాని ద్వారా వెండితెరకు పరిచయం కాబోతున్నాను. సకుటుంబ సమేతంగా ప్రేక్షకులు అందరూ థియేటర్లకు వచ్చి చూసేటటువంటి కథాంశంతో 'పరాక్రమం' సినిమా తీయబోతున్నా'' అని చెప్పారు.
Also Read : 'యశోద' నిర్మాత చేతికి '800' - ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ రిలీజ్ ఎప్పుడంటే?
'పరాక్రమం' కథ గురించి బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ ''గోదావరి జిల్లాలోని లంపకలోవ గ్రామంలో పుట్టిన లోవరాజు అనే యువకుడి జీవితంలో జరిగే గల్లీ క్రికెట్, ప్రేమ, నాటక రంగ జీవితం, రాజకీయం అంశాలే చిత్రకథ. యువతను అలరిస్తూ... వారిలో ఆలోచన కలిగించే మంచి కమర్షియల్ కథతో సినిమా తీస్తున్నా. నాతోపాటు ప్రతిభ ఉన్న నూతన నటీనటులను 'పరాక్రమం' వెండితెరకు పరిచయం చేయబోతున్నాను'' అని చెప్పారు.
Also Read : శంకర్ ఎప్పుడు చెబితే అప్పుడు - చేతులు ఎత్తేసిన 'దిల్' రాజు
బండి సరోజ్ కుమార్, అనామిక, కిరీటి, మోహన్ సేనాపతి తదితరులు నటించిన ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ : ప్రవీణ్ గూడూరి, విజువల్ ఎఫెక్ట్స్ : ఐకేరా స్టూడియోస్, సౌండ్ డిజైన్ & మిక్సింగ్ : కాళీ ఎస్.ఆర్. అశోక్, కళా దర్శకత్వం : కిరీటి మూసి, సాహిత్యం : శశాంక్ వెన్నెలకంటి, నిర్మాణ సంస్థ : బి.ఎస్.కె మెయిన్ స్ట్రీమ్ (BSK MAINSTREAM), కథ - కూర్పు - సంగీతం - నిర్మాణం - దర్శకత్వం : బండి సరోజ్ కుమార్.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial