గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా లెజెండరీ ఫిల్మ్ మేకర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'గేమ్ ఛేంజర్' (Game Changer Movie). ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాత 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొదలై చాలా రోజులు అయ్యింది. అయితే, అప్డేట్స్ మాత్రం అభిమానులు ఆశించిన రీతిలో రావడం లేదు. అందులో తన తప్పేమి లేదని 'దిల్' రాజు స్పష్టం చేశారు. 


అంతా శంకర్ చేతుల్లోనే...
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన 'గాంఢీవధారి అర్జున' ప్రీ రిలీజ్ వేడుకకు 'దిల్' రాజు ఓ అతిథిగా హాజరు అయ్యారు. 'గేమ్ ఛేంజర్' అప్డేట్ కావాలని ఆయనను ఫ్యాన్స్ అడిగారు. ''నాకు తెలుసు, నేను వచ్చినప్పుడు మీరు అరిచారంటే 'గేమ్ ఛేంజర్' గురించి! అయితే, మన చేతుల్లో ఏమీ లేదు. డైరెక్టర్ (శంకర్) గారు ఇచ్చినప్పుడు డీటెయిల్స్ బయటకు వస్తాయి. మనం ఏమీ చేయలేం అమ్మా'' అని 'దిల్' రాజు చెప్పారు. అదీ సంగతి!  


Also Read ప్రతి పండక్కి, ప్రతి నెలలో శ్రీ లీల సినిమా... వినాయక చవితి నుంచి సంక్రాంతి వరకు



ఇప్పుడు పాటల్లో రామ్ చరణ్, కియారా!
ఈ సినిమాలో కియారా అడ్వాణీ (Kiara Advani) ఓ కథానాయిక. మరో కథానాయికగా  తెలుగమ్మాయి అంజలి నటిస్తున్నారు. ఆమె ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో చరణ్ భార్యగా కనిపించనున్నారు. అమ్మాయి క్లీంకార జన్మించడానికి కొన్ని రోజుల ముందు రామ్ చరణ్ షూటింగులు, ఇతర వృత్తిపరమైన పనులకు విరామం ప్రకటించారు. కొంత గ్యాప్ తర్వాత జూన్ నెలలో మళ్ళీ చిత్రీకరణ ప్రారంభించారు. ఓ భారీ యాక్షన్ సీన్ తీశారు. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతోందని వినికిడి. 


Also Read : అనసూయ విడాకులు తీసుకుంటున్నారా? ఏందీ కొత్త గోల? 


దర్శకుడిగా శంకర్ స్టైల్ గురించి ప్రేక్షకులు అందరికీ తెలుసు. యాక్షన్ సీన్స్ / ఫైట్స్, సాంగ్స్ తీయడంలో ఆయన కంటూ ఒక స్టైల్ ఉంది. ఆయన సినిమాల్లోని పాటల్లో, ఫైటుల్లో భారీతనం కనబడుతుంది. రామ్ చరణ్ కోసం ఆయన అటువంటి భారీ ఫైట్స్, సాంగ్స్ ప్లాన్ చేశారట. ఆ మధ్య విదేశాల్లో బాస్కో సీజర్ కొరియోగ్రఫీలో ఓ సాంగ్ తీశారు. ప్రభుదేవా ఓ పాటకు కొరియోగ్రఫీ చేశారు. 


ఐఏఎస్ అధికారిగా...
ముఖ్యమంత్రి అభ్యర్థి!
శంకర్ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా కనిపించనున్నారు. అభ్యుదయం పార్టీ సీయం క్యాండిడేట్ చరణ్. రాజమండ్రి, విశాఖలో ఆ సీన్స్ తీసినప్పుడు విజువల్స్ లీక్ అయ్యాయి. ఫ్లాష్‌బ్యాక్ కాకుండా ప్రజెంట్‌కు వస్తే... ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారు. తండ్రీ కొడుకులుగా రెండు క్యారెక్టర్లు ఉంటాయని టాక్.


శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'బాయ్స్'లో తమన్ నటించారు. ఆ తర్వాత శంకర్ నిర్మాణంలో వచ్చిన కొన్ని సినిమాలకు సంగీతం అందించారు. అయితే... శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండటం ఇదే తొలిసారి.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial