జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన RRR చిత్రం ట్రైలర్ మీరు చూసే ఉంటారు. రొమాలు నిక్కబొడుచుకొనే ఉద్వేగభరిత సన్నివేశాలతో రాజమౌళి మరోసారి తన మార్క్ చూపించారు. సుమారు 40 ఏళ్ల తర్వాత జక్కన్న.. నందమూరి, కొణిదెల ఫ్యామిలీని ఒకే తెరపైకి తీసుకొచ్చారు.


సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి కలిసి నటించిన ‘తిరుగులేని మనిషి’ చిత్రం.. 1981, ఏప్రిల్ 1వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ లాయర్‌ రాజాగా నటించారు. పేదలకు సాయం చేస్తూ.. అందరినీ మంచి మార్గంలో పెడుతుంటారు. చిరంజీవి ఓ క్లబ్‌లో గిటారు వాయించే గాయకుడు కిషోర్‌గా నటించారు. ఎన్టీఆర్ తండ్రి శశిభూషణ రావుగా జగ్గయ్య, చెల్లి పద్మ పాత్రలో ఫటాఫట్ జయలక్ష్మీ నటించారు. ఇక కథలోకి వస్తే.. లాయర్ రాజా సోదరి పద్మ.. కిషోర్ ప్రేమలో పడుతుంది. వారి ప్రేమకు శశిభూషణరావు అంగీకరించడు. కిషోర్ పేదరికాన్ని అవమానిస్తాడు. దీంతో పద్మ ఆత్మహత్యాయత్నం చేస్తుంది. కానీ, రాజా వారిద్దరికి పెళ్లి చేస్తాడు. దీంతో శశిభూషణరావు వారిపై కోపం తెచ్చుకుంటాడు. కానీ, మనవడు పుట్టిన తర్వాత వారి ప్రేమను అంగీకరించి చేరదీస్తాడు. 


అయితే, అనుకోని ఘటనలో రాజా తండ్రి శశిభూషన్‌ను గుర్తుతెలియని ముఠా హత్య చేస్తుంది. ఈ సందర్భంగా తన తండ్రికి వజ్రాలను స్మగ్లింగ్ చేసే ముఠాతో సంబంధం ఉందని తెలుసుకుంటాడు. హంతకుల కోసం అన్వేషణలో భాగంగా.. ఒకప్పుడు తన తండ్రికి సాయం చేసిన నాగులు (సత్యనారాయణ)ను కలుస్తాడు. అదే సమయంలో.. తన బావ కిషోర్‌కు ఆ ముఠాతో సంబంధం ఉంటుందని తెలుసుకుని షాకవుతాడు. కిషోర్‌ను రాజా నిలదీస్తాడు. శశిభూషన్ వల్లే తాను చెడ్డవారితో చేతులు కలిపానని, త్వరగా డబ్బు సంపాదించి భార్యను బాగా చూసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ మార్గంలోకి వెళ్లానని చెబుతాడు. ఈ సందర్భంగా రాజా.. ఆ ముఠా నాయకుడిని కనుగోడానికి సాయం చేయాలని రాజాను అడుగుతాడు. ఇంతలో ఆ ముఠా కిషోర్ కొడుకును కిడ్నాప్ చేస్తారు. దీంతో కిషోర్‌లో పరివర్తన వస్తుంది. అయితే, ఆ ముఠా నాయకుడు మరెవ్వరో కాదు.. నాగులేనని తెలిసి ఆశ్చర్యపోతారు. అతడిని అంతం చేసి బిడ్డను రక్షించడంతో కథ సుఖాంతమవుతుంది. 


ఈ కథ.. RRR స్టోరీ, పాత్రలకు కాస్త దగ్గర సంబంధం ఉందని చెప్పవచ్చు. ఇందులో రామ్ చరణ్ (రామ్) బ్రిటీష్ వాళ్లతో కలిసి పనిచేస్తున్నట్లే.. ఆ కథలో చిరంజీవి స్మగ్లింగ్ ముఠాతో కలిసి పనిచేస్తాడు. ఇక భీమ్‌ పాత్ర విషయానికి వస్తే.. ఆ సినిమాలో ఎన్టీఆర్ తరహాలోనే పేదలకు అండగా ఉంటాడు. బ్రిటీష్ పాలనలో పోలీస్ అధికారిగా పనిచేస్తున్న రామ్‌తో స్నేహం కుదురుతుంది. ‘తిరుగులేని మనిషి’లో మాత్రం చిరంజీవి.. ఎన్టీఆర్‌కు బావ అవుతాడు. తమ కుటుంబానికి ముఠా నుంచి కష్టం రావడంతో ఇద్దరు కలిసి పోరాడి విలన్లను అంతం చేస్తారు. అలాగే.. రామ్ భీమ్ దేశాన్ని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు బ్రిటీష్ పాలకులతో పోరాడతారు. ఆ చిత్రంలో చిరు.. చెడు మార్గం నుంచి మంచి మార్గాన్ని ఎంచుకున్నట్లే.. ‘ఆర్ఆర్ఆర్‌’లో కూడా చరణ్ బ్రిటీష్ ఆధీనంలోని పోలీస్ జాబ్‌ను వదిలి.. స్వాతంత్ర్య సమరయోధుడిగా మారతాడు. ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించినది రాజమౌళి గురువు కె.రాఘవేంద్ర రావు. కె.దేవి వరప్రసాద్ నిర్మాత.


Also Read: ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఫైట్.. మరి అభిమానులు ఏమనుకుంటున్నారు?


ఆ హిస్టరీ రిపీట్ కాకూడదు: చిరంజీవి, ఎన్టీఆర్ కలిసి నటించిన ఆ చిత్రం బంపర్ హిట్ కొడుతుందని అంతా భావించారు. కానీ, బాక్సాఫీసు వద్ద ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దీంతో చిరు-ఎన్టీఆర్ కాంబినేషన్లో మరే చిత్రాలు రాలేదు. కాలక్రమేనా ఆ దూరం పెరుగుతూ వచ్చింది. ‘తిరుగులేని మనిషి’ చిత్రం సమయానికి చిరంజీవి హీరోగా నిలదొక్కుకోలేదు. నెగటివ్ పాత్రలను మాత్రమే పోషించేవారు. 1982 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా నుంచి చిరంజీవి హీరోగా నటించడం మొదలు పెట్టారు. 1983లో ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ’ చిత్రం.. చిరంజీవి జీవితాన్ని మలుపు తిప్పింది. చిరు సుప్రీం హీరో కావడంతో తన ఇమేజ్‌కు తగిన చిత్రాలను చేస్తూ ఇతర హీరోలకు గట్టిపోటీ ఇచ్చాడు. అప్పటి నుంచి మళ్లీ నందమూరి-కొణిదెల కుటుంబాల్లో ఏ స్టార్ కూడా కలిసి పనిచేయలేదు. 40 ఏళ్ల తర్వాత మళ్లీవారిని కలిపిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. అయితే, ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు రాష్ట్రాల స్వాతంత్ర్య సమరయోధుల సత్తాను చాటే గొప్ప చిత్రం. అందుకే.. ‘తిరుగులేని మనిషి’ బాక్సాఫీస్ రికార్డులు రిపీట్ కాకుండా.. మాంచి హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోసారి ప్రపంచానికి తెలుగు చిత్రాల స్టామినా చూపించేందుకు సిద్ధమవుతున్నారు. మిగతా హీరోలు కూడా కలిసి పనిచేస్తే చూడాలని అనుకుంటున్నారు. 


Also Read: RRR ట్రైలర్.. కుంభస్థలాన్ని బద్దలకొడదాం పదా.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే!


Also Read: చిన్నప్పుడు అజయ్ దేవగన్ బైక్ స్టంట్ చూస్తే.. అమ్మ తిట్టింది: ఎన్టీఆర్




Also Read: అల్లు అర్జున్‌ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?


Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ మృతి...


Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి