సినీ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న RRR ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటికే టీజర్లు, పోస్టర్లతో సినిమాపై అంచనాలు పెంచేసిన జక్కన్న రాజమౌళి.. ఈ ట్రైలర్‌లో మూడు గంటల సినిమాను మూడు నిమిషాల్లో చూపించేశారు. ఆధ్యాంత్యం ఉత్కంఠభరిత సన్నివేశాలతో నిండిన ఈ ట్రైలర్ చూస్తున్నంత సేపు ఊపిరి పీల్చుకోవడం మరిచిపోతాం. ఒక వైపు భీమ్.. మరో వైపు రామ్.. తమ పర్‌ఫార్మెన్స్‌తో కళ్లు తిప్పుకోనివ్వకుండా చేశారు. విజువల్స్ మెస్మరైజ్ చేస్తాయ్. కాసేపు మనల్ని ఆ రోజుల్లోని స్వాతంత్ర్య పోరాటంలోకి తీసుకెళ్లిపోతాయి.
'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ విషయానికి వస్తే.. ఒక చిన్నారిని తెల్లదొరలు తీసుకెళ్లడం దగ్గర మొదలైన పోరాటం, వాళ్ల ఆధిపత్యానికి ఇద్దరు వీరులు ఎలా ఎదురు తిరిగారు అనే వరకూ, మూడు నిమిషాల్లో సినిమా ఎలా ఉండబోతోంది అనేది చూపించారు. రాజీవ్ కనకాల పాత్ర ఓ బ్రిటీష్ దోరకు భీమ్ గురించి చెప్పడంతో ఈ ట్రైలర్ ఆరంభమవుతుంది. ‘‘స్క్వాడ్ దొరవారు మా ఆదిలాబాద్ వచ్చినప్పుడు ఓ చిన్నపిల్లను తీసుకొచ్చారు. మీరు తీసుకొచ్చింది గొండ్ల పిల్లనండి’’ అని రాజీవ్ కనకాల అంటారు. ‘‘అయితే వాళ్లకు ఏమైనా రెండు కొమ్మలు ఉంటాయా?’’ అని బ్రిటిషర్ ప్రశ్నిస్తారు. ‘‘వారికి ఒక కాపరి ఉంటాడు’’ అని రాజీవ్ కనకాల చెప్పగానే... ఎన్టీఆర్ ఎంట్రీ. ఎన్టీఆర్ పులిని వేటాడే సన్నివేశాలు.. ఆ తర్వాత గర్జించే సన్నివేశాలు వచ్చాయి.
‘‘పులిని పట్టుకోవాలంటే వేటగాడు కావాలి. ఆ పని చేయగలిగేది ఒక్కడే సార్’’ అని మరో డైలాగ్. ఆ వెంటనే రామ్ చరణ్ పాత్ర ఎంట్రీ. బ్రిటీష్ పోలీస్‌గా తన మనసును చంపుకుంటూ స్వాతంత్య్ర ఉద్యమకారులను అణచివేసే పనిలో చరణ్ ఉన్నట్లుగా చూపించారు. ఆ తర్వాత వంతెనపై వచ్చే సన్నివేశంలో.. భీమ్, రామ్ బ్రిడ్జికి వేలాడుతూ చేతులు పట్టుకొనే సన్నివేశాన్ని చూస్తే గూజ్ బంప్స్ వస్తాయి.
రామ్ చరణ్‌ను అల్లూరిగా చూపించే సన్నివేశాలు అయితే... ఐ ఫీస్ట్! ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. అలాగే, బుల్లెట్‌ను ఎన్టీఆర్ కాలితో సన్నివేశం కూడా! ట్రైలర్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ స్నేహాన్ని చూపించారు. ఆ తర్వాత విధి నిర్వహణలో స్నేహితుడిని చరణ్ అరెస్ట్ చేసే దృశ్యాన్ని కూడా చూపించారు.
పోలీస్ స్టేషన్‌లో జైల్లో ఉన్న చిన్నారిని భీమ్ చూసి పరుగు పెట్టే సన్నివేశం వస్తుంది. ‘‘నన్ను ఈడ ఇడిసిపోకన్నా.. అమ్మ యాదికొస్తుందన్నా’’ అనే సన్నివేశం వస్తుంది. ఆ తర్వాత... 'బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను'’ అంటూ రామ్ చరణ్... భీమ్‌ను అరెస్టు చేస్తాడు. ‘‘తొంగి తొంగి నక్కి నక్కి కాదే... తొక్కుకుంటూ పోవాలే. ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలి’’ అని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ బ్రిటీషర్లపై కోపాన్ని చూపించింది.
‘‘చాలా ప్రమాదం ప్రాణాలు పోతాయ్...’’ అని సముద్రఖని అనడం... ‘‘ఆనందంగా ఇచ్చేస్తా బాబాయ్’’ అని రామ్ చరణ్ అనడం... స్వాతంత్య్రం కోసం అతడు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడనేది చూపించింది. ‘‘యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి’’ అని అజయ్ దేవగణ్ పాత్రతో ఓ డైలాగ్ చెప్పారు. ఆ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ రావడం ఆయుధాలు వాళ్లే అని చెప్పారు. ‘‘ఈ నక్కల వేట ఎంత సేపు కుంభస్థలాన్ని బద్దలకొడదాం పదా’’ అని రామ్ చరణ్ అన్న తర్వాత... ఎన్టీఆర్, చరణ్ బయలుదేరారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బ్రిటీషర్లపై పోరాడినట్టు అర్థం అవుతోంది.