‘మా’ ఎన్నికల నేపథ్యంలో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్న హీరో శ్రీకాంత్.. విష్ణు ప్యానెల్ సభ్యులపై మండిపడ్డారు. తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులతో జరిగిన సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ఆరు నెలల కిందటే ప్రకాష్ రాజ్ నా దగ్గరకు వచ్చారు. ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. నువ్వు కూడా ఉంటే బాగుంటుంది. పెద్దవాళ్లు, చిన్నవాళ్లను కలుపుకుని వెళ్తావు అని అన్నారు. ఇందుకు నేను గత ప్రెసిడెంట్ల కంటే భిన్నంగా నువ్వు ఏం చేస్తావని అడిగాను. ఇందుకు ఆయన చెప్పిన సమాధానం నచ్చింది’’ అని శ్రీకాంత్ అన్నారు. 


బిల్డింగ్ అందరికీ ఉపయోగపడాలి: ‘మా’కు ప్రత్యేకంగా భవనం ఉండాలనేది అందరి కల. అయితే, ఆ భవనం అధ్యక్షుడు, సిబ్బంది కూర్చోడానికి కాకుండా.. అందరికీ ఉపయోగపడేలా ఉండాలి. ఆ భవనం వల్ల ‘మా’కు లాభం రావాలి. దీనిపై అప్పట్లో శివాజీ రాజా, నేను ప్రయత్నించాం. ‘మా’ ఏర్పాటు చేసిన కొత్తలో ఫండ్ రైజింగ్ చాలా ముఖ్యమని భావించాం. ఈ సందర్భంగా క్రికెట్ మ్యాచ్ నిర్వహించి నిధులు సమకూర్చాం. ఆ తర్వాత సీసీఎల్ పెట్టి రూ.3 కోట్లు వరకు నిధులు తీసుకురావాలని అనుకున్నాం. కానీ, దాని వల్ల మాకు పేరు వస్తుందనే కారణంతో కొందరు అడ్డుకున్నారు. ఆ తర్వాత అమెరికా, లండన్‌లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణల సహకారంతో కార్యక్రమాలు నిర్వహించాం. అయితే, ఆ నిధులు మేం కాజేశామని ఆరోపించారు. చేయని తప్పుకు మాపై బురద చల్లారు. దీనిపై విచారణ జరపాలని కోరడంతో కోర్డినేషన్ కమిటీ పెట్టారు. ఎలాంటి అవకతవకలు జరగలేదని కమిటీ తేల్చింది. మరి మాపై బురద ఎందుకు చల్లారని ఆలోచిస్తే.. ‘మా’ ఎన్నికలు దగ్గరపడటం వల్ల రాజకీయాలకు తెరతీశారని అర్థమైంది. సభ్యులు కూడా వారి మాటలను నమ్మారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో నన్ను ఓడించారు. ఆ తర్వాత బిల్డింగ్ లక్ష్యం కూడా మరుగున పడిపోయింది. అప్పటి నుంచి నాకు ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తే పోయింది. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని అనుకున్నాను. కానీ, ప్రకాష్ రాజు.. మీరు అప్పుడు ఓడిపోలేదని.. ఓడించారని.. ఓడిన చోటే గెలిచి మీ లక్ష్యాన్ని కొనసాగించాలని అన్నారు. అందుకే మళ్లీ బరిలో నిలిచాను’’ అని శ్రీకాంత్ అన్నారు. 


Also Read: సినీ పెద్దల ఆశీర్వాదం నాకొద్దు.. నరేష్ నీ చక్రం దొబ్బేశాం.. సిగ్గుపడేలా మాట్లాడకు: ప్రకాష్ రాజ్


ప్రాంతీయవాదం ఎందుకు?: ఈ ఎన్నికల్లో ఎవరినీ నిందించకూడదని అనుకున్నా.. టాలీవుడ్‌లో తెలుగువాళ్లు, తెలుగువాళ్లు కాదనే ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు? అలాంటి కల్చర్ కావాలా? ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడతారా? నేను తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడలో కూడా నటిస్తున్నా. తెలుగువాళ్లంటే వారికి గౌరవం ఉంది. తెలుగువాళ్లు నన్ను పెంచి పోషించారని, వారికి సేవ చేయాలని ప్రకాష్ రాజ్ వచ్చారు. అలాంటివారిని పనిచేయనివ్వరా? ప్రకాష్ రాజ్ షూటింగ్స్ ఉంటే ‘మా’కు సమయం కేటాయించరు అని అంటున్నారు. ఆయనతోపాటు మీ కోసం మేమున్నాం. ఆయన అందుబాటులో లేకపోతే మాలో ఎవరికైనా సరే మీరు సమస్యలు చెప్పుకోవచ్చు. పనిచేసేవాళ్లపై బురద చల్లేవారని నమ్మొద్దు. ఎవరు ఏమటనేది తెలుసుకుని ఓటేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. మాలో ఎవరైనా మందులు, డబ్బులు పంచి ప్రలోభ పెడితే మాకు ఓటేయొద్దు. మనం నేటి తరానికి.. భవిష్యత్తుకు వారధిగా నిలబడాలి. అప్పుడే ఇండస్ట్రీ నిలబడుతుందని శ్రీకాంత్ పేర్కొన్నారు.


వీడియో: 



Also Read: పవన్‌తో విభేదాలు.. ఆయన మార్నింగ్ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్


Also Read: పోసాని ఎక్స్‌పైరీ ట్యాబ్లెట్.. అతడి చావు భయంకరంగా ఉంటుంది: బండ్ల గణేష్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి