బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పార్థీవ శరీరాన్ని చూసి అభిమానులు, ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు. టాలీవుడ్ నటులు నందమూరి బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, శ్రీకాంత్‌, ఆలీ‌తోపాటు ప్రభుదేవ తదితరులు పునీత్‌కు నివాళులు అర్పించారు. స్టేడియం ప్రాంగణంలోనే పునీత్‌కు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. పునీత్ తల్లితండ్రులు పార్వతమ్మ, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ అంతిమ సంస్కారాలను కూడా ఇక్కడే నిర్వహించారు. 


పునీత్‌కు నివాళులు అర్పించిన తర్వాత హీరో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పునీత్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు. ‘‘పునీత్ లేడంటే నమ్మలేకపోతున్నాం. కన్నడంలో ‘జేమ్స్’ సినిమా కోసం 40 రోజులు ఆయనతో కలిసి పనిచేశాను. ఈ సినిమా కంటే ముందు నుంచే పునీత్ తెలుసు. ఆయన అన్న శివ రాజ్‌కుమార్‌, ఆయన కుటుంబ సభ్యులు నాకు బాగా తెలుసు. ‘జేమ్స్’ సినిమా ఇంకా పూర్తి కాలేదు. అందులో నాది ప్రతినాయకుడి పాత్ర. నాకు బాడీగార్డుగా పునీత్ నటిస్తున్నాడు. ఇంకా ఒక ఫైట్ సీన్, పాట, డబ్బింగ్ మిగిలి ఉంది. డబ్బింగ్ శివ రాజ్‌కుమార్ చెప్పవచ్చేమో. వారం కిందటే పునీత్ నాతో మాట్లాడాడు. కన్నడ డబ్బింగ్ కూడా నేనే చెప్పాలని కోరాడు’’ అని శ్రీకాంత్ తెలిపారు.



పునీత్‌కు రాత్రి నుంచే బాగోలేదు: ‘‘జేమ్స్ షూటింగ్ సమయంలో పునీత్ రోజు నాకు ఇంటి నుంచి భోజనం తెచ్చేవాడు. అప్పు చాలా ఫిట్‌గా ఉంటాడు. ఎప్పుడూ హుషారుగా ఉండే వ్యక్తి. ఏ రోజు ఆయనకు ఫీవర్, ఇతర అనారోగ్య సమస్యలేవీ రాలేదని పునీత్ ఫ్రెండ్స్ చెప్పారు. ఆయనకు గర్వమనేదే ఉండేది కాదు. అభిమానులను కౌగిలించుకుని అప్యాయంగా ఉండేవాడు. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా సేవా కార్యక్రమాలు చేసేవాడు. మీడియాలో ఆయన జిమ్‌లో వ్యాయామం చేస్తూ పడిపోయారని అంటున్నారు. అందులో నిజం లేదు. రాత్రి నుంచే ఇబ్బందిగా ఉందన్నాడు. ఉదయం 8 గంటల సమయంలో తన ఫ్యామిలీ డాక్టర్‌ను కలిశాడు. అక్కడి నుంచి హాస్పిటల్‌కు వెళ్తుండగా చనిపోయాడు.  


Also Read: మంచు విష్ణుకు హైపర్ ఆది పంచ్.. ‘లెట్ దెమ్ నో అంకుల్’ అంటూ..


పునీత్ కుమార్తె అమెరికా నుంచి బెంగళూరు రావడానికి ఆలస్యం కావడంతో అంతిమ సంస్కారాలను ఆదివారం 10.30 గంటలకు నిర్వహించనున్నారు. దీంతో శనివారం సాయంత్రం 6 గంటలకు పూనీత్ భౌతికకాయ సందర్శన నిలిపివేశారు. పునీత్‌కు ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు పలకనున్నారు. పునీత్ మృతికి సంతాపంగా ఇప్పటికే కర్ణాటకలో థియేటర్లను మూసివేశారు. మూడు రోజుల పాటు మద్యపాన నిషేధం విధించారు.



Also Read: పునీత్ రాజ్‌కుమార్‌కు బాలకృష్ణ, ఎన్టీఆర్ నివాళి.. తలకొట్టుకుంటూ కన్నీరుమున్నీరు


Also Read: ఎప్పటికీ మా గుండెల్లో ఉంటావ్! - పునీత్ మరణంపై అనుష్క స్పందన


 Also Read: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణంపై ప్రముఖుల దిగ్భ్రాంతి.. మోదీ ట్వీట్