Happy Birthday Parasuram Petla: పరశురామ్ పెట్ల. తెలుగు సినిమా దర్శకులలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తీసింది తక్కువ సినిమాలే అయినా, చక్కటి క్రేజ్ సంపాదించుకున్నారు. క్లాసీగా కనిపిస్తూనే మాస్ యాంగిల్ ప్రెజెంట్ చేయడం ఆయన సినిమాల ప్రత్యేకత. సినిమా సినిమాకి గ్యాప్ ఎక్కువ తీసుకున్నా, చక్కటి చిత్రాలు ప్రేక్షకులకు అందిస్తారు పరుశురామ్. పూరి జగన్నాథ్ శిష్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన, గురువునే మించి పోయారు. ‘గీతాగోవిందం’, ‘సర్కారు వారి పాట’ లాంటి చిత్రాలతో సంచలన విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ‘ఫ్యామిలీ స్టార్’ అనే మూవీ చేస్తున్నారు.
అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ
యంగ్ ఏజ్ లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు పరుశురామ్. ‘ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం’, ‘ఆంధ్రావాలా’, ‘143’ లాంటి సినిమాలకి పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ‘పరుగు’ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశాడు. 2008లో ‘యువత’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తొలి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరో నిఖిల్ కు మంచి క్రేజ్ తీసుకొచ్చారు. ఆ తర్వాత మాస్ మహరాజా రవితేజతో కలిసి ‘ఆంజనేయులు’ అనే సినిమా చేశారు. ఈ సినిమాతో ప్రేక్షకులకు అదిరిపోయే కామెడీ అందించారు. ఇప్పటికీ ఈ సినిమా పేరు వినగానే అందరిలో నవ్వుల పువ్వులు పూస్తాయి. ఇక నారా రోహిత్ హీరోగా ‘సోలో’ అనే సినిమా చేశారు. కుటుంబ విలువలకు పెద్ద పీట వేస్తూ ముందుకు సాగిన ఈ సినిమా క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరి ఆదరణ దక్కించుకుంది. అనంతరం అల్లు శిరీష్ హీరోగా ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు.
‘గీతగోవిందం’తో స్టార్ డైరెక్టర్ హోదా
2018లో వచ్చిన ‘గీతగోవిందం’ సినిమా పరుశురామ్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించిన ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. పరశురామ్ కు స్టార్ డైరెక్టర్ హోదాను కట్టబెట్టింది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమా చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయినా, పరుశురామ్ కెరీర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చింది. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠూకూర్ హీరోహీరోయిన్లుగా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో పక్కా ఫ్యామిలీ మ్యాన్‍గా విజయ్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ తో ఈ మూవీపై ఆసక్తి విపరీతంగా పెరిగింది. ‘గీతగోవిందం’ మూవీ తర్వాత విజయ్, పరశురామ్ కాంబో మరోసారి రిపీట్ కావడంతో ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.
హ్యాపీ బర్త్ డే పరుశురామ్
పరుశురామ్ ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నం జిల్లా చెర్లోపాలెంలో డిసెంబరు 25న జన్మించాడు. జవహర్ నవోదయ విద్యాలయంలో తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో MBA డిగ్రీని పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆయన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం ‘గీతగోవిందం’ కంటే పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ.. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఏబీపీ దేశం ఆకాంక్షిస్తుంది.
Read Also: 'సరిహద్దులు చెరిగిపోతున్నాయి.. ఇండియన్ ఫిల్మ్ రేంజ్ పెరుగుతోంది' ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్