Baby Died Due to Rat Biting in Nagarkurnool: నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఎలుక కొరకడంతో 40 రోజుల పసికందు ప్రాణాలు కోల్పోయాడు. పట్టణంలోని నాగనూల్ (Naganool) గ్రామానికి చెందిన లక్ష్మీకళ, పెద్ద కార్పాముల గ్రామానికి చెందిన శివ దంపతులకు 40 రోజుల క్రితం మగ శిశువు జన్మించాడు. అప్పటి నుంచి లక్ష్మీకళ ఆమె అమ్మ ఇంటి వద్దే ఉంటోంది. శనివారం రాత్రి నేలపై తల్లి వద్ద నిద్రించిన చిన్నారి ముక్కును ఎలుక కొరకడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే గమనించిన తల్లి, కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని సూచించారు. దీంతో నిలోఫర్ లో శిశువును చేర్పించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం చిన్నారి మృతి చెందాడు. శిశువు మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతో జాగ్రత్తగా చూసుకున్నా ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదని శిశువు కుటుంబ సభ్యులు వాపోయారు. 


కుక్కల దాడిలో బాలుడు 


మరోవైపు, హైదరాబాద్ (Hyderabad) లోనూ కుక్కల దాడిలో 5 నెలల చిన్నారి మృత్యువాత పడ్డాడు. షేక్ పేట (Shaikpeta) వినోబానగర్ (Vinobha Nagar) లో అంజి, అనూష దంపతులు  ఈ నెల 8న తమ 5 నెలల బాలుడు శరత్ ను గుడిసెలో ఉంచి కూలీకి వెళ్లారు. ఇంతలో అక్కడికి వచ్చిన కుక్కలు బాలుడిపై తీవ్రంగా దాడి చేశాయి. తల్లిదండ్రులు వచ్చి చూసే సరికి బాలుడు రక్తపు మడుగులో ఏడుస్తూ కనిపించాడు. వెంటనే వారు బాలున్ని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి నిలోఫర్ కు, ఆపై ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు ఆదివారం ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తల్లిదండ్రులు, స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిపై కుక్కల దాడి ఘటన సీసీ టీవీల్లో రికార్డైందని పోలీసులు తెలిపారు. అయితే, గతంలోనూ వీధి కుక్కల దాడి ఘటనలు జరిగాయని, కుక్కలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు తెలిపారు. తాము ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా స్పందించి తమను కుక్కల బారి నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు.


Also Read: Road Accident News: పొగమంచు కారణంగా తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు- వివిధ ప్రమాదాల్లో ఆరుగురు మృతి