పెదవి దాటని మాటకు ప్రభువు నీవు, పెదవి దాటిన మాటకు బానిస నీవు అని ఓ సామెత ఉంది. ఒక్కసారి మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోలేమని, ఆ మాటలకు బానిసగా ఉండక తప్పదని ఆ సామెత తాత్పర్యం. అందుకే ప్రజల ముందు ప్రముఖులు మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని చెబుతుంటారు. ముఖ్యంగా లైవ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ వంటివి జరిగేటప్పుడు సెలబ్రిటీలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. లేదంటే ప్రెజెంట్ ఉన్న సోషల్ మీడియా దాటికి నలుగురిని నోళ్ళల్లో తిట్లు తినడం ఖాయం.‌ ఇటీవల ఓ నటుడు ఆ విధంగానే అందరితో తిట్లు తింటున్నారు. ఆ నటుడి ప్రవర్తన ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతుంది.


తాగి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడా?
ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉంటుంది. ఆ అభిప్రాయం ఇతరులను కించపరిచే విధంగా లేనంత వరకు ఎటువంటి సమస్య ఉండదు. తమ హద్దు దాటి... మితిమీరిన భాష, బూతులు ఉపయోగిస్తే సభ్య సమాజంలో ఆమోదయోగ్యంగా ఉండదు. ఎంతో ప్రేమతో ప్రతి ఒక్కరూ సినిమా తీస్తారు. అయితే ఆ సినిమా అందరినీ మెప్పిస్తుందని చెప్పలేం. విమర్శకులకు కొందరు తమకు నచ్చని సినిమాల పట్ల నచ్చలేదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇటీవల వచ్చిన ఓ సినిమా విమర్శకులు కొంత మందికి నచ్చలేదు. అయితే ఆ సినిమాల్లో నటించిన నటుడు ‌ రివ్యూ రైటర్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు.‌ ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడని ఇండస్ట్రీ గుసగుస. 


మద్యం మత్తులో సినిమా వేడుకలకు రావడం ఇంటర్వ్యూలో ఇవ్వడం సదరు నటుడికి అలవాటుగా మారిందని గుసగుసలు సైతం ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాలలో ఆఫ్ ద రికార్డుగా వినపడుతూ ఉండడం విశేషం. గతంలో ఒకసారి ప్రభుత్వం మీద బూమ్ బూమ్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆ టైంలో కూడా అతను మద్యం మత్తులో ఉన్నాడని టాక్. 


Also Read: సంక్రాంతికి వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమా... గేమ్ చేంజర్ కోసం వాయిదా వేయట్లేదు



నటుడు మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు?
తప్పు ఎవరు చేసినా తప్పే. నటుడికి ఓ విధమైన ట్రీట్మెంట్, ఇతర వృత్తుల్లో ఉన్న వారికి మరొక విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలనే రూలేమీ లేదు.‌ ఇటీవల ఓ మహిళా విలేకరి సదరు సినిమా విలేకరుల సమావేశంలో కథానాయికను అడిగిన ప్రశ్నను, అడిగిన తీరును సభ్య సమాజమంతా విమర్శించింది. ఆ మహిళా విలేకరి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని ఫిలిం ఛాంబర్ నుంచి జర్నలిస్టు సంఘాలకు లేఖలు వచ్చాయి.‌ మరి ఇప్పుడు రివ్యూ రైటర్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బూతులు మాట్లాడిన నటుడి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారని ఇప్పటికే ఓ జర్నలిస్ట్ సంఘం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇంకా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి వంటి ఇండస్ట్రీ బాడీలకు లేఖ రాసినట్లు తెలిసింది. అదే బాటలో నడుస్తూ మిగతా జర్నలిస్టు సంఘాలు‌ లేఖలు రాసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.


Also Read'కల్కి 2' ఎప్పుడు మొదలవుతుంది? - ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్



రివ్యూ రైటర్ల మీద విమర్శలు రావడం ఇది కొత్త ఏమీ కాదు.‌ ఓ అగ్ర నిర్మాత కొంతకాలంగా సినిమాలకు రివ్యూ అవసరం ఏముంది? అని బలంగా ప్రశ్నిస్తున్నారు. ఆ మధ్య ఒక చోట సినిమా తీసిన దర్శకుడు అయితే ఆమె తీసిన సినిమా అర్థం కావడానికి మినిమం డిగ్రీ చేసి ఉండాలి అని ఒక టీ షర్టు వేసుకొని వచ్చారు. ఈ విధంగా రివ్యూల మీద తమ అసంతృప్తి అసహనం వ్యక్తం చేసిన సెలబ్రిటీలు ఉన్నారు. అయితే ఇటీవల నటుడు ఉపయోగించిన భాషను ఇంతకుముందు ఎవరూ వాడలేదు. అందువల్ల అతడి తీరును సామాన్య ప్రేక్షకులు సైతం తప్పుపడుతున్నారు. మరి అతడిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. అతను సినిమా వేడుకలకు వచ్చేటట్లు అయితే సదరు సినిమా ప్రెస్‌మీట్‌లను బాయ్‌కాట్ చేయాలని జర్నలిస్టులు నిర్ణయించుకుంటున్నారు.