తెలుగు సినిమాలు, రాజకీయాల మధ్య గీతను ఏపీ రాజకీయాలు పూర్తిగా మార్చాయి. కొన్నేళ్ల క్రితం, ఆ మాటకు వస్తే ఐదేళ్ల ముందు వరకు... సినీ తారల్లో ఎవరెవరు ఏయే పార్టీల్లో ఉన్నప్పటికీ సినిమాల పరంగా తమ మధ్య స్నేహ సంబంధాలు మాత్రం చెడకుండా చూసుకున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది.
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో ఒకరైన పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తుండటంతో ఆయనను తిట్టించడానికి పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali)ని వైసీపీ రంగంలోకి దించిందని ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. యాంకర్ శ్యామల (Anchor Shyamala)లా కాస్తో కూస్తో పేరున్న నటీనటులు సైతం వైసీపీ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఆవిడ నారా చంద్రబాబు నాయుడు, పవన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. వింత వింత పిట్ట కథలు చెప్పారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే ట్విట్టర్ సాక్షిగా ప్రతిసారీ రెచ్చిపోయారు. ఏ ఒక్క పొలిటికల్ ఈవెంట్ వదల్లేదు. పవన్, లోకేష్ మీద వెకిలి పోస్టులు చేశారు. ఓ అడుగు ముందుకు వేసి సినిమాలు తీశారు. కట్ చేస్తే కాలం గిర్రున తిరిగింది. ఏపీ ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు తెగి కిందకు పడింది. వెంటనే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు కంగ్రాట్స్ చెప్పిన వర్మ ఆయనకు బోలెడు దండాలు పెట్టారు. వర్మ తన మీద వచ్చే విమర్శలను పట్టించుకోరు. ఎవరేమన్నా లాజిక్కులతో కొడతారు. వర్మ వంటి వ్యక్తులపై ఏపీ ఎన్నికల ఫలితాలు పెద్దగా ప్రభావం చూపవు. ఆయన కూడా లైట్ తీసుకుని మూవ్ ఆన్ అవుతాడు. మరి, పోసాని & శ్యామల పరిస్థితి ఏంటి?
ఫుల్ టైమ్ యాక్టింగ్ మీద కాన్సంట్రేట్ చేస్తారా?
ఎన్నికలకు ముందు నుంచి పోసాని కృష్ణమురళి, శ్యామలను ప్రేక్షకులు టార్గెట్ చేశారు. ఒక వైపు పవన్ ఫ్యాన్స్, మరో వైపు నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆ ఇద్దరి మీద నిప్పులు చెరిగారు. అయితే, సదరు విమర్శలను వాళ్ళు ఖాతరు చెయ్యలేదు. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే ధీమాతో జనసేన, టీడీపీ అధినేతల మీద నిప్పులు చెరిగారు.
Also Read: పవన్ పర్సనల్ లైఫ్, పెళ్లిళ్లే టార్గెట్ - వైసీపీ తప్పుల్లో ఇదొకటి, ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా
వచ్చే ఐదేళ్లు వైసీపీ ప్రతిపక్షానికి పరిమితం అవుతుంది. ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రశ్నించడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలుగా పరాజయం పాలైన మంత్రులు అంబటి రాంబాబు, రోజా వంటి నాయకులు ఎలాగో వుండనే వుంటారు. ఈ తరుణంలో పోసాని, శ్యామలకు పొలిటికల్ పరంగా పెద్ద పని పడే అవకాశాలు తక్కువ అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు వాళ్లిద్దరూ ఫుల్ టైమ్ సినిమా ఇండీస్ట్రీలో ఛాన్సులు, యాక్టింగ్ అండ్ యాంకరింగ్ మీద కాన్సంట్రేట్ చేస్తారా? అని ఇండస్ట్రీ వర్గాల్లో డిస్కషన్ మొదలైంది. ఒకవేళ మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చినా మునుపటిలా ఛాన్సులు వస్తాయా? నిజానికి పవన్ స్నేహాన్ని కాదనుకుని వైసీపీకి మద్దతు పలికిన అలీకి నటుడిగా అవకాశాలు తగ్గాయనేది కాదనలేని వాస్తవమని ఇండస్ట్రీ ప్రముఖులు, విశ్లేషకులు కొందరు గుర్తు చేస్తున్నారు. పోసాని కూడా ఐదేళ్లల్లో పెద్దగా సినిమాల్లో కనిపించింది లేదు. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.
జనసేనకు మద్దతు పలికిన 'బేబీ' నిర్మాత ఎస్.కె.ఎన్ అయితే 'పోసాని అదే ఫైర్ తో ప్రెస్ మీట్ పెట్టాలి' అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. పోసాని వ్యవహార శైలి ఇండస్ట్రీలో కొందరికి నచ్చలేదని టాక్. ఇప్పుడు ఆయన పట్ల వాళ్ళ వైఖరి ఎలా వుంటుందో చూడాలి.