లెజెండరీ సినీ దర్శకుడు కె విశ్వనాథ్ మరణం పట్ల సినీ ప్రముఖు నివాళులర్పిస్తున్నారు. ఆయనతో తమకునన అనుబంధాన్ని ఈ సందర్భగా గుర్తు చేసుకుంటున్నారు.
సెల్యూట్ టు మాస్టర్- కమల్ హాసన్
కళాతపస్వి మరణం పట్ల లోకనాయకుడు కమల్ హాసన్ ఎమోషనల్ అయ్యారు. విశ్వనాథ్, జీవిత పరమార్థం, కళ అమరత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారని చెప్పారు. ఆయన కళ అజరామరం అని కొనియాడారు. కమల్ హాసన్ కు తెలుగులో స్టార్ హీరోగా నిలిపిన దర్శకుడు విశ్వనాథ్. వీరిద్దరి మధ్య గొప్ప అనుబంధం ఉంది.
విశ్వనాథ్ మృతి పట్ల అనిల్ కపూర్ భావోద్వేగం
బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ విశ్వనాథ్ మరణం పట్ల భావోద్వేగానికి లోనయ్యారు. విశ్వనాథ్ తనకు నటనలో ఎన్నో మెళకువలు నేర్పించారని చెప్పారు. ‘స్వాతి ముత్యం’ చిత్రాన్ని బాలీవుడ్‌లో ‘ఈశ్వర్’ పేరుతో రీమేక్ చేశారు విశ్వనాథ్. అందులో అనిల్ కపూర్, విజయశాంతి లీడ్ రోల్స్ చేశారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు-బాలయ్య
“కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు కన్నుమూయడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు. భారతీయ సంస్కృతీ సంప్రదాయలు, తెలుగు దనాన్ని అణువణువున ప్రతిబింబించేలా ఆయన తీసిన అత్యద్భుత చిత్రాలు తెలుగు సినిమా కే గర్వ కారణం. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిని దిగ్గజ దర్శకుడి మరణం తీవ్ర విచారానికి గురిచేసింది. కళా తపస్వి ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను” అని బాలకృష్ణ తెలిపారు.
విశ్వనాథ్ మరణ వార్త బాధించింది- మోహన్ బాబు
కళాతపస్వి కె విశ్వనాథ్ మరణ వార్త తనను ఎంతో బాధించిందని సీనియర్ నటుడు మోహన్ బాబు తెలిపారు. “శ్రీ.కె.ఎస్.విశ్వనాథ్ గారి వార్త విని చాలా బాధపడ్డాను. ఆయన ఆత్మ శాంతి కోసం ప్రార్థిస్తున్నాను. అతని సన్నిహితులు, కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాను” అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.
ఆయన సినిమాలు కళాత్మక ప్రతిబింబాలు- కల్యాణ్ రామ్
కె విశ్వనాథ్ మరణం సినీ పరిశ్రమకు తీరని నష్టం అని నందమూరి కల్యాణ్ రామ్ తెలిపారు. “కళాతపస్వి విశ్వానాథ్ గారు భారతీయ సినీ పరిశ్రమపై చెరిగిపోని ముద్ర వేశారు. ఆయన సినిమాలు మన సమాజానికి అత్యంత కళాత్మకంగా ప్రతిబింబిస్తాయి. ఆయన లేని లోటు మాటల్లో చెప్పలేని. ఓం శాంతి” అని వెల్లడించారు.
సినిమా చాలా గొప్పదని నిరూపించిన వ్యక్తి- నాని
“సినిమా అనేది బాక్సాఫీస్ కంటే గొప్పది. సినిమా అనేది స్టార్స్ కంటే గొప్పది, సినిమా అనేది వ్యక్తి కంటే గొప్పదని నేర్పించారు గ్రేట్ విశ్వనాథ్ గారు. ఆయనకు వీడ్కోలు” అని నాని ట్వీట్ చేశారు.
సినీ వర్గానికి తీరని లోటు- నిర్మాత నాగ వంశీ
విశ్వానాథ్ మరణం పట్ల సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగ వంశీ భావోద్వేగానికి గురయ్యారు. “ఇది మా సినీ వర్గానికి తీరని లోటు. మనకు క్లాసిక్స్ అందించి, కళారూపాలను, సాటి మనుషులను గౌరవిస్తూ, విభేదాలను విడనాడాలని విద్యాబుద్ధులు నేర్పిన వ్యక్తి మనల్ని విడిచిపెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం” అని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు సినీ పరిశ్రమకే కాదు, దేశానికీ లోటే- వెంకటేష్
కళాతపస్వి మరణం యావత్ దేశానికే తీరని లోటని టాలీవుడ్ టాప్ హీరో వెంకటేష్ అభిప్రాయపడ్డారు. ఆయన మరణం తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు. “కె విశ్వనాథ్ గారి మరణవార్త విని నిజంగా బాధ కలిగింది. ఇది తెలుగు సినీ పరిశ్రమకే కాదు, దేశానికే తీరని లోటు. ఆయన సన్నిహితులు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అని వెంకటేష్ ట్వీట్ చేశారు.
Read Also: కె.విశ్వనాథ్ కెరీర్‌లో ఆ మూవీ ఓ మైలురాయి - కానీ, అది మానసికంగా చాలా బాధించిందట!