RRR మూవీ లాస్ ఏంజెల్స్ ను షేక్ చేస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద థియేటర్ ఈ సినిమా స్క్రీనింగ్ చేశారు. ప్రేక్షకులతో ఈ థియేటర్ కిక్కిరిసిపోయింది. ‘నాటు నాటు’ పాటకు ఆడియెన్స్ అదిరిపోయే స్టెప్పులు వేయడంతో థియేటర్ దద్దరిల్లింది. ఆస్కార్స్ 2023 వేడుకకు ముందు, మార్చి 1న లాస్ ఏంజిల్స్‌ లోని ఏస్ హోటల్‌ థియేటర్‌లో ‘RRR’ రీరిలీజ్ అయ్యింది. ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు టికెట్ల కోసం థియేటర్ ముందు క్యూ కట్టారు. అమెరికాలో ఈ సినిమా విడుదలైన 342వ రోజున ఏకంగా ఈ థియేటర్ లో 1647 టికెట్లు అమ్ముడయ్యాయి.  ప్రేక్షకులు ఈ సినిమా పట్ల చూపిస్తున్న ఆదరణకు ‘RRR’ టీమ్ సంతోషం వ్యక్తం చేసింది.






లాస్ ఏంజెల్స్‌ ను ఊపేసిన ‘నాటు నాటు’  


ఇక డౌన్‌టౌన్ లాస్ ఏంజెల్స్‌లోని ఏస్ హోటల్‌ థియేటర్‌లో  స్క్రీనింగ్ హౌస్‌ ఫుల్‌గా సాగింది. LAలో స్క్రీనింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. థియేటర్‌లో ‘నాటు నాటు’ పాట ప్లే అవుతున్నప్పుడు అభిమానులు హుషారుగా డ్యాన్సులు చేశారు.  రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ స్టెప్పులను అనుసరిస్తూ సందడి చేశారు. త్వరలో ఆస్కార్ ప్రదాన వేడుక జరుగనున్న నేపథ్యంలో ‘RRR’ సినిమాను అమెరికాలో రీ రిలీజ్ చేస్తున్నారు. ఎన్టీఆర్,రామ్ చరణ్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా మార్చి 3న 275కు పూగా థియేటర్లలో విడుదల కానుంది. వేరియెన్స్ ఫిల్మ్స్, బియాండ్ ఫెస్ట్, అమెరికన్ సినిమాథెక్, పొటెన్టేట్, సరిగమ సినిమాస్ ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నాయి. అందులో భాగంగానే మార్చి 1న  లాస్ ఏంజిల్స్‌ లో ‘RRR‘ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ‘RRR ఫ్యాన్ CelebRRRation Live‘ ఈవెంట్ గా ఈ ప్రదర్శనను నిర్వహించారు.  మార్చి 3న అమెరికా అంతటా ఈ సినిమా రీ రిలీజ్ కానుంది.  






ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటిన ‘RRR‘


వివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ‘RRR‘ సినిమాను నిర్మించారు.  ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25, 2022న ఈ మూవీ  విడుదలై కలెక్షన్ల సునామీని సృష్టించింది. ప్రపంచ ప్రఖ్యాత అవార్డులను కొల్లగొట్టింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషాల్లో విడుదలైన ఈ సినిమా, ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించగా, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని అందించారు. ఇండియాలో థియేటర్ రన్ ముగియడంతో ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ (హిందీ), జీ5(తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌  పోరాట యోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రల్లో నటించారు. హాలీవుడ్ నటీ ఒలివియా మోరీస్, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్లుగా నటించారు. శ్రియ,అజయ్ దేవ్‌గణ్ కీలకపాత్రల్లో నటించారు.


నాటు నాటుపాటకు ప్రతిష్టాత్మక సినీ అవార్డులు


ఇక ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ పాట అవార్డును అందుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పాటను చంద్రబోస్ రాయగా, రాహుల్ సిప్లిగంజ్, కాళ భైరవ పాడారు. ఇప్పటికే ఈ పాటకు పలు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. ఆస్కార్ తర్వాత ఆస్కార్ స్థాయి గోల్డెన్ గ్లోబ్ అవార్డు ‘నాటు నాటు’ పాటకు దక్కింది. క్రిటిక్ ఛాయిస్ అవార్డు అందుకుంది.


Read Also: షారుఖ్ ఇంట్లోకి చొరబడిన ఇద్దరు ఆగంతకులు, పోలీసులు విచారణలో ఏం చెప్పారో తెలుసా?