నటుడు సుమన్‌కు దేశభక్తి ఎక్కువ. కార్గిల్ యుద్ధం సమయంలో ఇండియన్ ఆర్మీ కోసం 117 ఎకరాల భూమిని ఆయన విరాళంగా ఇవ్వాలని అనుకున్నారు. ఆ మేరకు ప్రకటన కూడా చేశారు. అయితే... ఆ భూమి తమ సొంతమని కొందరు కోర్టుకు వెళ్లారు. అప్పటి నుంచి వివాదం కోర్టులో ఉంది. వాస్తవానికి భూమికి సంబంధించిన పత్రాలు అన్నీ సుమన్ వద్ద ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇతరుల దగ్గర కూడా పత్రాలు ఉన్నాయి. అందువల్ల, వివాదానికి ఇంకా పరిష్కారం రాలేదు.
సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఆ భూమిని ఇండియన్ ఆర్మీకి సుమన్ దానం చేసినట్టు ఈ రోజు (సోమవారం) ఉదయం నుంచి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కొలువైన ప్రాంతానికి అతి సమీపంలో ఆ భూమి ఉంది. సోషల్ మీడియా ప్రచారం నేపథ్యంలో సుమన్ స్పందించారు.
"సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నటువంటి వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. వాటిని నమ్మవద్దు. ఆ భూమికి సంబంధించిన వివాదం కోర్టులో కొనసాగుతోంది. వివాదానికి పరిష్కారం లభించిన వెంటనే... వ్యక్తిగతంగా నేనే అందరికీ తెలియజేస్తాను. దానికి సంబంధించి ఏ విషయమైనా నేనే చెబుతా. అప్పటి వరకూ వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా కోరుతున్నాను" అని సుమన్ తెలిపారు.