"ఫిబ్రవరి 25 నుంచి పెద్ద సినిమాలను విడుదల చేయాలని టాలీవుడ్ నిర్మాతలు అందరం సన్నాహాలు చేసుకుంటున్నాం. మార్చి, ఏప్రిల్ కల్లా పెద్ద చిత్రాలన్నీ వచ్చేస్తాయి. విడుదల తేదీలు మాట్లాడుకుని ప్లాన్ చేసుకుంటాం" - శనివారం ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ 'దిల్' రాజు చెప్పిన మాటలు. ఆయన చెప్పినట్టుగా రెండు మూడు రోజులుగా టాలీవుడ్ అగ్ర నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. విడుదల తేదీల పంపకం మొదలైంది.


ఫిబ్రవరి 11న విడుదలకు సిద్ధమైన విడుదల తేదీల్లో ఎటువంటి మార్పు లేదు. ఆ రోజున మాస్ మహారాజ రవితేజ 'ఖిలాడి' విడుదల ఖాయమే. దాంతో పాటు చిన్న సినిమాలు 'డీజే టిల్లు', 'సెహరి' కూడా వస్తాయి. ఆ తర్వాత వారం పెద్ద సినిమా అంటే ఆలియా భట్ నటించిన 'గంగూబాయి కతియావాడి' ఉంది. దాంతో ఆ రెండు మూడు తెలుగు సినిమాలు రానున్నాయి. అసలు విషయం, ప్లానింగ్ ఆ తర్వాత విడుదల తేదీల విషయంలో!


పవన్ కల్యాణ్, రానా నటించిన 'భీమ్లా నాయక్'ను సంక్రాంతి బరి ఫిబ్రవరి 25కి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ తేదీకి సినిమా రావడం లేదని పుకార్లు వినిపించాయి. ఆ రోజున అజిత్ 'వలిమై' విడుదల కానుంది. అలాగే... శర్వానంద్, రష్మిక జంటగా నటించిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' కూడా! మరి, 'భీమ్లా నాయక్' పరిస్థితి ఏంటి? అంటే... అయితే... ఫిబ్రవరి 25న లేదంటే ఏప్రిల్ 1న విడుదల చేస్తామని సితార ఎంటర్టైన్మెంట్స్ వెల్లడించింది. ఫిబ్రవరి 24న తమ సినిమాను విడుదల చేయడం లేదని ఆల్రెడీ 'విక్రాంత్ రోణ' టీమ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అది మేలో వచ్చే అవకాశాలు ఉన్నాయి..


మార్చిలో రెండు పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. ఒకటి... యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'రాధే శ్యామ్'. మార్చి 11న డేట్ లాక్ చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత 25న యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' వస్తుంది. ఈ సినిమా విడుదలతో ఆ రోజున రావాలనుకున్న రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' వాయిదా పడుతోంది. అన్నీ చూసుకుని కొత్త విడుదల తేదీ ప్రకటించనున్నారు.


'ఆర్ఆర్ఆర్' ముందుకు రావడంతో ఆ డేట్ మీద మెగాస్టార్ 'ఆచార్య' టీమ్ కర్చీఫ్ వేసింది. ఏప్రిల్ 29న సినిమాను విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. మధ్యలో ఏప్రిల్ 14న 'కె.జి.యఫ్ 2', విజయ్ 'బీస్ట్' విడుదల కానున్నాయి. ఆ రెండు సినిమాల విడుదల తేదీల్లో ఎటువంటి మార్పు లేదు. అయితే... ఏప్రిల్ 1న విడుదల చేయాలనుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' మరోసారి వాయిదా పడిందని టాక్. మార్చి 25న 'ఆర్ఆర్ఆర్' విడుదల అవుతుంది కాబట్టి... రెండు వారాలు ఆ సినిమా హవా ఉంటుందని, అప్పుడు రావడం వల్ల రెండు సినిమాలకూ నష్టం జరుగుతుందనేది నిర్మాతల ఆలోచన. అందుకని, మే 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకుంటున్నారట.


ఏప్రిల్ 29కి 'ఆచార్య' షెడ్యూల్ కావడంతో 'ఎఫ్ 3' విడుదలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. వేసవి సీజన్ కాబట్టి రెండు పెద్ద సినిమాలు ఓకే తేదీకి వస్తే ప్రాబ్లమ్ కాదు. ఏప్రిల్ 28న 'ఎఫ్ 3' సినిమా వస్తోంది. ఒక్క రోజు ముందుకు వెళ్లింది.   


టోట‌ల్ ఎపిసోడ్‌లో, విడుదల తేదీల పంపకంలో పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్'కు సరైన రిలీజ్ డేట్ పడలేదు. ప్రతి సినిమాకు ఏదో ఒక రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేస్తున్నారు... లేదంటే చేసుకుంటున్నారు. కానీ, పవన్ సినిమాకు డేట్ సెట్ కాలేదు. ఆల్రెడీ సంక్రాంతి బరి నుంచి సినిమా వెనక్కి వచ్చినప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫీలయ్యారు. తమ హీరో సినిమాను అన్యాయం చేశారని సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి ప‌వ‌న్‌కు అన్యాయం జరిగిందని అంటారేమో!? అయితే ఫిబ్రవరి 25న లేదంటే ఏప్రిల్ 1న వస్తామని 'భీమ్లా నాయక్' నిర్మాత అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 25న వస్తే ఎవరికీ ఏ ప్రాబ్లమ్ లేదు. అప్పుడు 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమా వాయిదా పడుతుంది. ఏప్రిల్ 1న వస్తే... 'ఆర్ఆర్ఆర్' వసూళ్లకు గండి పడుతుంది. 'భీమ్లా నాయక్'కూ ఇబ్బందే. ఇప్పుడు ఆ డేట్ మీద కర్చీఫ్ వేయడంతో 'సర్కారు వారి పాట' వచ్చే అవకాశాలు లేవు. వాళ్లు కూడా మే 12న విడుదల చేయాలని అనుకుంటున్నారు.