ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించినట్లుగానే ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించింది. జీతాల బిల్లులు ప్రాసెస్ చేయని ట్రెజరీ ఉద్యోగులకు చార్జి మెమోలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలు మాత్రమే చేస్తున్నారు. ఇంకా సమ్మెలోకి వెళ్లలేదు. విధుల్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం చెప్పినట్లుగానే చేయాలని ట్రెజరీ అధికారులు, పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులను ఆదేశించారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు ప్రాసెస్ చేయాలని ఉన్నత అధికారులు పలుమార్లు ఆదేశాలు జారీ చేశారు. సర్క్యూలర్లు ఇచ్చారు. అయితే అలా ప్రాసెస్ చేయవద్దని ఉద్యోగ సంఘాలు ట్రెజరీ అధికారులను కోరారు.  దీంతో కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్ చేయబోమని ట్రెజరీ ఉద్యోగులు స్పష్టం చేశారు. కలెక్టర్ల ఒత్తిడి మేరకు పోలీసులు, జడ్జిలు, మున్సిపల్ సిబ్బందికి సంబంధించిన జీతాలు మాత్రం ప్రాసెస్ చేశారు. 


తాము ఎంత చెప్పినా.. ఎన్ని సార్లు సర్క్యూలర్లు జారీ చేసినా జీతాల బిల్లులను ప్రాసెస్ చేయకపోవడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు , మూడు రోజుల నుంచి విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతోంది. ఈ క్రమంలో అధికారులకు చార్జీ మెమోలు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వివిధ జిల్లాలకు చెందిన మొత్తం 27 మంది డిడి, ఎస్టీఓ, ఏటిఓ లకు మెమోలు జారీచేసారు. 2022 జనవరి 29 తేదీ సాయంత్రం 6 గంటల వరకూ తమ విధుల్లో విఫలమైన వారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


శ్రీకాకుళం, అనంతపురం, కర్నూల్ జిల్లాలకు చెందిన ముగ్గురు డిడివోలతో పాటు వివిధ జిల్లాలకు చెందిన 21 మంది సబ్ ట్రెజరీ అధికారులు, ఇద్దరు ఏటిఓ లకు ఛార్జ్ మెమోలు జారీ అయ్యాయి. నూతన పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు సిద్ధం చేయడంలో అలక్ష్యంగా వ్యవహరించినందుకు వీరికి మెమోలు జారీ చేసినట్లు ఉన్నతాధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  ఇప్పటివరకు కేవలం 25శాతం బిల్లులు మాత్రమే ట్రెజరీకి వచ్చాయని ఉద్యోగులు చెబుతున్నారు. ట్రెజరీల నుంచి ప్రతి రెండు గంటలకు ఒకసారి నివేదిక పంపాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.


 
జీతాల బిల్లులు ఇప్పటికీ 75 శాతం వరకూ ప్రాసెస్ కాకపోవడంతో మంగళవారం ఉద్యోగుల అకౌంట్లలో జీతాలు పడటం అనుమానంగా మారింది. అయితే తము ప్రత్యామ్నాయాలను కూడా చూసి పెట్టుకున్నామని పెన్షన్లు, వేతనాలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు, పెన్షన్లు జమ చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది.