వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాల విషయంలో చాలా రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అప్పటివరకు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ తమ సినిమాలను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ సడెన్ గా రేసులోకి 'ఆర్ఆర్ఆర్' వచ్చింది. దీంతో మహేష్ బాబు ముందుగా వెనక్కి తగ్గదు. తన 'సర్కారు వారి పాట' సినిమాను వాయిదా వేసుకున్నాడు. ఇదే బాటలో పవన్ కళ్యాణ్ సినిమా 'భీమ్లానాయక్' కూడా నడుస్తుందని అనుకున్నారు కానీ అలా జరగలేదు. రాజమౌళి రిక్వెస్ట్ చేసినా.. 'భీమ్లానాయక్' నిర్మాతలు తగ్గడం లేదని తెలుస్తోంది. 


Also Read: 'సొంతింటి కోసం దాచుకున్న డబ్బు.. పునీత్ కల కోసం వాడతా..'


సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయకపోతే మళ్లీ సమ్మర్ వరకు సినిమాను వాయిదా వేసుకోవాల్సి ఉంటుందని.. అప్పటివరకు సినిమాను ఆపలేమని 'భీమ్లానాయక్' నిర్మాతలు చెబుతున్నారట. పండగ సీజన్ లో సినిమాను రిలీజ్ చేయకపోతే ఆశించిన స్థాయిలో వసూళ్లు కూడా రావని భావిస్తున్నారు. అందుకే రిలీజ్ డేట్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదని ఫిక్సయి కూర్చున్నారు. 'భీమ్లానాయక్' సినిమా హక్కులను దిల్ రాజుతో సహా టాలీవుడ్ లో ఉన్న టాప్ డిస్ట్రిబ్యూటర్లు చాలా మంది తీసుకున్నారు. 


ఇప్పుడు పవన్ సినిమా సంక్రాంతి రేసులో ఉంటే కచ్చితంగా థియేటర్ల సమస్య ఎదురవుతుంది. 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలైన ఐదు రోజులకే 'భీమ్లానాయక్' రిలీజ్ ఉంటుంది కాబట్టి థియేటర్ల విషయంలో 'ఆర్ఆర్ఆర్'కి కోత తప్పదు. దీంతో 'ఆర్ఆర్ఆర్'పై భారీ పెట్టుబడులు పెట్టిన బయ్యర్లకు రికవరీ కష్టమవుతుంది. 'రాధేశ్యామ్' వచ్చాక మళ్లీ థియేటర్లు తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇలా 'ఆర్ఆర్ఆర్'తో రెండు సినిమాలు పోటీ అంటే డిస్ట్రిబ్యూటర్లకు నష్టం తప్పదు. 


ఈ విషయంలో చాలా మంది 'ఆర్ఆర్ఆర్' సినిమాను సపోర్ట్ చేస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమ స్థాయిని పెంచే సినిమా 'ఆర్ఆర్ఆర్' అని దానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దిల్ రాజు నేతృత్వంలోని ప్రొడ్యూసర్స్ గిల్డ్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. 'భీమ్లానాయక్' చిత్రబృందంతో దిల్ రాజు అలానే మరికొంతమంది నిర్మాతలు చర్చలు జరుపుతున్నారట. ఎట్టిపరిస్థితుల్లో సినిమాను వాయిదా వేయించే దిశగా మంతనాలు జరుపుతున్నారు. మరి దీనికి పవన్ కళ్యాణ్, 'భీమ్లా నాయక్' టీమ్ తలొగ్గుతుందేమో చూడాలి!



 


 


 


 


 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి