టాలీవుడ్ నిర్మాతలు షూటింగులు బంద్ చేయాలనుకుంటున్నారని రెండు రోజులుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. శని, ఆదివారాలు నిర్మాతలంతా కలిసి హైదరాబాద్ లో ఓ హోటల్ లో మీటింగ్ పెట్టుకొని సినిమా ప్రొడక్షన్, నష్టాలు, రెమ్యునరేషన్స్ వంటి విషయాలపై చర్చించుకున్నారు. ముందుగా ఈరోజు నుంచి షూటింగులు బంద్ అని వార్తలొచ్చాయి. ఆ తరువాత ఆగస్టు 1 నుంచి బంద్ అని అన్నారు. 


ఈ విషయాలపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన నిర్మించిన 'థాంక్యూ' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు దిల్ రాజు. ఈ సందర్భంగా ఆయన టాలీవుడ్ నిర్మాతల సమ్మె గురించి మాట్లాడారు. నిర్మాతలంతా కలిసి మాట్లాడుకున్న విషయం నిజమేనని.. అయితే బంద్ గురించి ఇంకా ఏం అనుకోలేదని చెప్పారు. మీడియాలో మాత్రం డేట్ తో సహా బంద్ గురించి వార్తలొస్తున్నాయని వ్యంగ్యంగా అన్నారు. 


ఇండస్ట్రీని ఎలా కాపాడుకోవాలనే చర్చ మాత్రమే సాగుతుందని.. ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నిర్మాతలంతా ఒకే తాటిపైకి వస్తారని స్పష్టం చేశారు. ఇది నిర్మాతల సమస్య కాదని.. ఇండస్ట్రీ సమస్య అని చెప్పారు. నిర్మాత నష్టపోతే అందరి జీవితాలు నష్టాల్లో పడతాయని.. నిర్మాతల బాధలను హీరోలు, టెక్నీషియన్స్ అర్ధం చేసుకుంటారని నమ్ముతున్నట్లు చెప్పారు. ఒక సినిమా ఆపాలంటే, నిర్మాత.. హీరోలతో, దర్శకులతో మాట్లాడాలని.. దానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. 


ఇక 'థాంక్యూ' సినిమా విషయానికొస్తే.. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాను విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేశారు. ఇందులో రాశిఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. అలానే అవికా గోర్ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.   


Also Read: శ్రీనువైట్లకు షాక్ - విడాకులకు అప్లై చేసిన భార్య!


Also Read: రామ్ చరణ్ సినిమాతో శంకర్ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా?