Students Protest: నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో తాగేందుకు మంచి నీళ్ళు రావడం లేదని విద్యార్థులు రోడ్డుపైకి వచ్చారు. ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తాగేందుకు మంచినీళ్లు లేకపోవడమే కాకుండా తినే అన్నంలో కూడా పురుగులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బియ్యం సరిగ్గా లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని... ఇలాంటి పురుగుల అన్నం తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నామని వెల్లడించారు. బియ్యం సరిగ్గా లేకపోతే కనీసం రీపాలిష్ కూడా చేయించట్లేరని తెలిపారు. 


వర్షంలోనే విద్యార్థినుల ధర్నా..


తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లు దొరక్క ఇబ్బంది పడుతున్నామని అధికారులకు చెప్పినా ఎలాంటి ఫలితం లేదని విద్యార్థినులు వాపోయారు. విద్యార్థినిలు ఎన్ని అవస్థలు పడుతున్నా అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా రోడ్డుపై బాలికలు ధర్నా చేస్తున్నారు. నీళ్లు లేకుండా ఎన్ని రోజులు గడపాలంటూ ప్రశ్నించారు. భైంసా - నిజామాబాద్ రోడ్డుపై బైఠాయించి తమకు నాణ్యమైన భోజనం, మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే నిరసనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. 


పిల్లలు చెప్పేది నిజమే.. కానీ


పాఠశాల ప్రిన్సిపాల్ పద్మ మాట్లాడుతూ..  పిల్లలు చెప్పేది వాస్తవమే.. మోటార్ పాడవ్వడంతో మంచి నీటి సమస్య ఏర్పడిందని తెలిపారు. అయితే వర్షం కారణంగా సమస్యను పరిష్కరించలేకపోయామని.. సమస్యలు తీరుస్తామని చెప్పారు. అయినా సరే పిల్లలు ధర్నా ఆపకపోవడంతో స్థానిక సర్పంచ్ రాజేందర్ కు ఫోన్ చేయగా... గ్రామ పంచాయతీ నీటి ట్యాంకర్ ద్వారా నీళ్లు పంపిచారని చెప్పారు. ఈరోజు సాయంత్ర నాలుగు గంటల లోపు కచ్చితంగా మోటర్ బాగు చేయించి.. పిల్లలకు మంచి నీళ్లు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుడి హామీతో విద్యార్థినులు నిరసనను విరమించారు. 


నీళ్లే కాదు నాణ్యమైన భోజనం కూడా కావాలి..


సమస్య రాగానే అధికారులు స్పందించి సమస్యలు తీరిస్తే బాగుంటుందని విద్యార్థినులు చెప్పారు. చిన్న పిల్లలు ఇలా వర్షంలో రోడ్డెక్కే పరిస్థితి రావడానికి పాఠశాల అధికారులే కారణమని తెలిపారు. కేవలం మంచినీళ్లు అందిస్తే సరిపోదని.. నాణ్యమైన భోజనం కూడా పెట్టాలని కోరారు. ప్రస్తుతం తినే అన్నం సరిగ్గా లేదని.. చాలా సార్లు పురుగులు వస్తున్నాయని మరోసారి తెలిపారు. ఆ సమస్య కూడా తీరిస్తేనే తాము ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకోగలమని వివరించారు. పిల్లలు అడగకముందే వారి సమస్యలు అడిగి తెల్సుకుంటే బాగుంటుందని సూచించారు.