మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' తరువాత రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. గత కొన్నేళ్లుగా మన హీరోలు తమిళ దర్శకులతో చేస్తోన్న సినిమాలేవీ పెద్దగా వర్కవుట్ కావడం లేదు.
మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన 'స్పైడర్' సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. ఆ తరువాత యంగ్ హీరో విజయ్ దేవరకొండ.. ఆనంద్ శంకర్ కలిసి 'నోటా' అనే సినిమా తీశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. రీసెంట్ గా హీరో రామ్ కూడా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నాడు. తమిళ దర్శకుడు లింగుస్వామితో తీసిన 'ది వారియర్' సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
వరుసగా తమిళ దర్శకుడు తెలుగు స్టార్స్ కి షాకులిస్తుండడంతో ఇప్పుడు అందరి దృష్టి శంకర్ పై పడింది. ఒకప్పుడు మంచి ఫామ్ లో ఉన్నప్పుడు శంకర్ తెలుగు హీరోలతో సినిమాలు చేయలేదు. గత కొన్నేళ్లుగా ఆయన తీస్తోన్న సినిమాలు వర్కవుట్ కావడం లేదు. ఈ విషయం తలచుకుంటేనే మెగా ఫ్యాన్స్ లో భయం కలుగుతోంది. కమల్ తో చేయాల్సిన 'ఇండియన్ 2' సినిమా మధ్యలో ఆగిపోయిన సమయంలో శంకర్.. చరణ్ తో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. అతడి నమ్మి దిల్ రాజు రూ.200 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారు. కానీ తన ఫామ్ ని కోల్పోయిన శంకర్ మునుపటిలా హిట్టు కొట్టగలడా..? తెలుగు స్టార్స్ కి షాక్ ఇస్తోన్న తమిళ దర్శకుల ట్రెండ్ ను శంకర్ బ్రేక చేస్తారా..? అనేది చూడాలి.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ గవర్నమెంట్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా అక్టోబర్ నాటికి పూర్తవుతుందని అంటున్నారు. శ్రీకాంత్, అంజలి, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర వంటి తారలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యహరించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
Also Read: నాగచైతన్య 'థాంక్యూ' సినిమా రన్ టైం ఎంతంటే?
Also Read: కోవిడ్ బారిన పడ్డ హీరోయిన్ - వీడియో వైరల్