Dil Raju About Meeting with CM Revanth Reddy: తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ గిల్డ్ కు సంబంధించిన పలువురు నిర్మాతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దాదాపు గంటన్నర పాటు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు గురించి చర్చించారు.
పాజిటివ్ గా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
సినీ ఇండస్ట్రీ సమస్యల మీద సీఎం రేవంత్ రెడ్డి పాజిటివ్ గా స్పందించారు. సమస్యలే కాదు, సమస్యలకు పరిష్కారాలు కూడా సూచించాలన్నారు. ప్రభుత్వం నుంచి ఏ సాయం కావాలన్నా చేయడానికి రెడీ ఉన్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూల స్పందన పట్ల నిర్మాత దిల్ రాజు సంతోషం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలోని సమస్యలపై ఈసీ మీటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమస్యలపై చర్చించడంతో పాటు ఆ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన నిర్ణయాలపైనా సమాలోచనలు జరపనున్నట్లు తెలిపారు. సమస్యలతో పాటు వాటి పరిష్కార మార్గాలను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన విధానం చాలా పాజిటివ్ గా అనిపించిందన్న దిల్ రాజు, ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఈసీ మీటింగ్ లో అన్ని విషయాల గురించి చర్చించి ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
సీఎం రేవంత్ ను ఎవరెవరు కలిశారంటే?
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్, వై వి ఎస్ చౌదరి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్ కూచిబొట్ల, ఏ కే ఎంటర్టైన్మెంట్స్ రాజేష్ ఉన్నారు.
ఫిబ్రవరి 9న ‘ఈగల్’, ఫిబ్రవరి 16న ‘భైరవకోన’ విడుదల
అటు తెలంగాణ ఫిలిం ఛాంబర్ కోరగానే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్, వివేక్, రవితేజ ముందుకు వచ్చి సంక్రాంతి సినిమాల బరి నుంచి తప్పుకుని ‘ఈగల్’ రిలీజ్ డేట్ ను ఫిబ్రవరి 9కి మార్చుకోవడం జరిగిందని దిల్ రాజు చెప్పారు. “ఇప్పుడు అదే ఫిబ్రవరి 9కి ‘భైరవకోన’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ విషయం ఛాంబర్ నోటీస్ కి రాలేదు. వచ్చిన వెంటనే ఏ కె ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర, రాజేష్ తో మాట్లాడటం జరిగింది. వారు కూడా ఛాంబర్ వినతిని మన్నించి తమ డేట్ ని ఒక వారం రోజులు అంటే 16 ఫిబ్రవరికి మార్చుకోవడం జరిగింది. సంక్రాంతి అప్పుడు ఛాంబర్ వినతిని మన్నించి తమ రిలీజ్ డేట్ మార్చుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారికి ఇప్పుడు కూడా తమ డేట్ ని మార్చుకొని ఛాంబర్ వినితిని మన్నిస్తున్న ఏ కె ఎంటర్టైన్మెంట్స్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరి 9కి రిలీజ్ అవుతున్న ‘ఈగల్’కి ఎక్కువ శాతం థియేటర్స్ వచ్చేలాగా చూడడం జరుగుతుంది. ఫిబ్రవరి 9 కి ఈగల్ మేజర్ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది” అని తెలిపారు.
నిజాలను తెలుసుకుని వార్తలు రాయండి!
ఇక ఇండస్ట్రీకి సంబంధించి వార్తలు రాసే విషయంలో కాస్త జాగ్రత్త వహించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు నిర్మాతలు. ఎవరో చెప్పిన గాలి వార్తలు విని ఇండస్ట్రీలో ఒకరిని నిందించడం ఒకరి గురించి తప్పుగా మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదన్నారు. ఇక మీద నుంచి ఏదన్నా ఇంపార్టెంట్ విషయం ఉంటే కచ్చితంగా ఛాంబర్ నుంచి మీటింగ్ పెడతామన్నారు. లేదంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తామన్నారు.
Read Also: నా సినిమా చూడండి ప్లీజ్, మోకాళ్ళ మీద పడి ప్రేక్షకుల్ని వేడుకున్న సోహైల్