కరోనా కారణంగా సినిమా థియేటర్లు కొన్ని నెలలుగా మూతపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే దీని ప్రభావం నుండి కోలుకొని థియేటర్లలో సినిమాలు విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా విడుదలవుతున్న సినిమాలకు సంబంధించి ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. రెండు రోజుల క్రితం బీజేపీ నేత యామిని సాధినేని 'ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు' అనే సినిమాపై మండిపడ్డారు. ఆ సినిమాలో భజగోవిందం పాటలో భక్తుల మనోభావాలను కించపరిచారంటూ ఆమె దర్శకనిర్మాతలకు వార్నింగ్ ఇచ్చింది. 


దీంతో వాళ్లు క్షమాపణలు చెప్పారు. అక్కడితో ఆ వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు తాజాగా 'వరుడు కావలెను' సినిమా విషయంలో కూడా ఇలాంటి వివాదమే చోటుచేసుకుంది. నాగశౌర్య, రీతువర్మ జంటగా తెరకెక్కిన ఈ సినిమాలో 'దిగు దిగు నాగ' పేరుతో ఓ ఐటెం సాంగ్ ఉంది. ప్రముఖ గీత రచయితే అనంత శ్రీరామ్ ఈ పాటను రాశారు. నాగదేవతను భక్తితో పాడుకునే పాటను ఐటెం సాంగ్ గా మార్చడంతో కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పార్టీకి చెందిన యువ మోర్చా విభాగం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా.. భక్తులను కించపరిచేలా ఈ పాట ఉందని.. ఈ పాటను రాసిన అనంత శ్రీరామ్ తో పాటు పాట చిత్రీకరించిన వారిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీజేపీ యువమోర్చా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలానే ధర్మ రక్షాదళ్‌ అధ్యక్షుడు నరేంద్ర చౌదరి బాచుపల్లి మండల తహసీల్దార్‌ కార్యాలయం నిరసన తెలియజేశారు. ఆ పాటను వెంటనే తొలగించి బేషరుతుగా చిత్ర దర్శక, నిర్మాతలు క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. 


మరి దీనిపై 'వరుడు కావలెను' టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ వివాదాల కారణంగా సినిమాలకు ఫ్రీ పబ్లిసిటీ వస్తోంది. ఇదంతా యాదృచ్చికంగా జరుగుతుందా లేక పబ్లిసిటీ కోసం దర్శకనిర్మాతలే ఇలాంటి వివాదాస్పద ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటున్నారా..? అనే ప్రశ్నలు మాత్రం ప్రేక్షకుల్లో కలుగుతున్నాయి. 


గతంలో కూడా చాలా సినిమాల విషయాల్లో ఇలాంటి గొడవలు జరిగాయి. రొమాన్స్ డోస్ఎక్కువైనా.. పోస్టర్లు అసభ్యకరంగా ఉన్నా.. రచ్చ రచ్చ చేసేవారు. 'అర్జున్ రెడ్డి' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా కూడా ఇలాంటి వివాదాలన్నీ దాటుకొని బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మధ్యకాలంలో అందరూ కాస్త బోల్డ్ కంటెంట్ మీద పడ్డారు కాబట్టి ఫ్యూచర్ లో కూడా ఇలాంటి వివాదాలు మరిన్ని చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.