తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఆదివారం (ఆగస్టు 8న) వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఆదివారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురు‌స్తా‌యని, ఒకటి రెండు‌చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. దీనికి సంబంధించిన హెచ్చరిక జారీ చేశారు. అయితే, భారీ వర్షాలకు సంబంధించిన హెచ్చరికలు ఏమీ లేవు.


శనివారం (ఆగస్టు 7న) రాత్రి 8 గంటల సమయంలో హైదరాబాద్ వాతావరణ విభాగం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. మర్నాడు అంటే ఆగస్టు 8న రాత్రి వరకూ తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రదేశాలలో కురిసే అవకాశం ఉందని సూచించారు. చాలాచోట్ల వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పారు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షప్రభావం ఉంటుందని వివరించారు. 


తెలంగాణలో ఈ జిల్లాల్లోనే వానలు పడే అవకాశం
హైదరాబాద్‌లోని వాతావరణ విభాగం అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 8న హైదరాబాద్, జనగామ, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, కొమురం భీం, మంచిర్యాల, మెదక్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, నారాయణ పేట, నాగర్ కర్నూల్, ములుగు, మేడ్చల్ మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, మహబూబాబాద్, ఖమ్మం, భూపాలపల్లి, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.


ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఇలా..
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 8న విజయవాడలో కనిష్ఠ-గరిష్ఠ ఉష్ణోగ్రతలు 26-37 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది. రాత్రి వేళ వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ వెబ్ సైట్‌లో పేర్కొన్నారు. 


విశాఖపట్నంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్‌గా, గరిష్ఠ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఇక్కడ సాయంత్రం 5 గంటల నుంచి వానలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా. ఇక ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.


తిరుపతిలో కనిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్‌, గరిష్ఠ ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది. ఆదివారం తిరుపతిలో అర్ధరాత్రి దాటాక వర్షం పడే అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు imd.gov.in వెబ్ సైట్‌ను కానీ, mausam.imd.gov.in వెబ్‌సైట్‌ను గానీ సందర్శించవచ్చు.


దేశంలో ఈసారి తక్కువగానే వర్షపాతం..
కేంద్ర వాతావరణ విభాగం గత నెల జులైలో దేశ వ్యాప్తంగా కురిసిన వర్షపాతానికి సంబంధించిన సమాచారాన్ని ఇటీవల ప్రకటించింది. తెలంగాణలో కాస్త ఎక్కువగా వానలు, ముంబయికి వరదలు సంభవించినా.. దేశవ్యాప్త సరాసరి సాధారణం కంటే 7 శాతం తక్కువగా వర్షాలు పడ్డట్లు విశ్లేషించింది. జులై తొలి వారంలో కేరళ నుంచి రుతుపవనాలు వచ్చాయని, అవి చురుగ్గా కదిలినా చివరికి జులై నెలలో 7 శాతం లోటుతో వర్షపాతం నమోదైందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.