100 రోజులు.. 200 రోజులు.. 300 రోజులు.. ఒక ఏడాది.. 500వందల రోజులు ! ఇప్పుడు ఏకంగా 600వ రోజు !అమరావతి రైతులు ఆర్తనాదాలు మొదలై నేటికి 600రోజులు. తమ భవిష్యత్  బాగుంటుంది అని నమ్మి... సర్వస్వాన్ని ప్రభుత్వానికి అప్పగించి ఇప్పుడు మోసపోయాం అంటూ ఆందోళన ప్రారంభించిన రోజులు.. మొత్తానికి రాజాధాని రైతులు రోడ్డున పడి రెండేళ్లు.. ! భవిష్యత్ రాజధానికి భూములు ఇస్తున్నాం అనుకున్నవారు.. ఇప్పుడు తమ భవిష్యత్ ఏంటో తెలీక ఆందోళన పడుతున్నారు. ఒక్క ప్రకటన.. రాష్ట్రంలో మూడు రాజధానులు పెడుతున్నాం అంటూ అసెంబ్లీ సాక్షిగా  ప్రభుత్వం చేసిన ఒక్క ప్రకటన  రాజధాని రైతుల జీవితాలని తలకిందులు చేసింది. అమరావతే ఏకైక రాజధాని అనే పేరుతో ఆరువందల  రోజులుగా రాజధాని రైతులు పోరాటం చేస్తూనే ఉన్నారు. 
 
అప్పుడు సరే అన్న వైకాపా.. ఇప్పుడు కాదంటోంది. 


ఆరు వందల రోజుల కిందట... డిసెంబర్ 17న సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేశారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులున్నాయని... అందుకే దక్షిణాఫ్రికాను ఫాలో అయిపోతున్నామని సీఎం ప్రకటించేశారు. 2019 ఎన్నికలకు ముందు వరకూ ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని సమస్యగా లేదు.  రాష్ట్రం మధ్యలో ఉంటుందని.. గుంటూరు- విజయవాడ మధ్య నగరాన్ని కడితే.. రెండు నగరాలు కలిసి... పొరుగు రాష్ట్రాలకు ధీటుగా ఓ మహానగరం అభివృద్ధి చెందుతుందని... ఆంధ్ర భావి పౌరులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని అప్పటి ప్రభుత్వం అమరావతిని ఎంపిక చేసింది. ఇప్పటి ముఖ్యమంత్రి.. అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి  అసెంబ్లీ సాక్షిగా సమర్థించారు. అదేమీ రాజకీయ ప్రకటన కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాల ఆమోదంతోనే... అప్పటి ప్రభుత్వం అమరావతిని నిర్ణయించింది. ఏ ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. అందుకే.. అమరావతి కోసం రైతులు కూడా భూములివ్వడానికి ధైర్యంగా ముందుకొచ్చారు. ఇచ్చారు. 2019 ఎన్నికల వరకూ వైకాపా కూడా రాజధానిని వ్యతిరేకించలేదు. చంద్రబాబు గ్రాఫిక్స్‌తోనే  కడుతున్నారు.. తాము వచ్చి నిజమైన అమరావతిని కట్టి చూపిస్తామని వైఎస్ఆర్ సీపీ నేతలు ప్రకటించారు. ఎన్నికల తర్వాత సీన్ మారింది. మూడు రాజధానులు తెరపైకి వచ్చింది. ఏకైక రాజధానిగా ఉన్న అమరావతి శాసనరాజధానిగా మారిపోయింది. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ వైజాగ్ కు తరలిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 


మూడు రాజధానులు -వికేంద్రీకరణ-వివాదం


పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటి ప్రభుత్వం చెబుతోంది. కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసనరాజధాని, విశాఖలో పరిపాలనా రాజధాని పెడుతూ చట్టం కూడా చేసింది. అయితే ప్రభుత్వం చేసే వాదనను ప్రతిపక్షాలు అంగీకరించడం లేదు.  రాజధాని తెచ్చిన కీర్తి తమకు దక్కకూడదని అమరావతిని నాశనం చేస్తున్నారని తెదేపా, ఒకవర్గం ప్రజలపై ద్వేషంతోనో.. రాజకీయ కారణాలతోనో అమరావతి రైతులను ఇబ్బంది పెడుతున్నారని మిగతా రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒక్క వైకాపా తప్ప... మిగిలిన రాజకీయ పక్షాలు అన్నీ కూడా రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్నాయి. అమరావతిపై వ్యతేరికత లేకపోతే.. పరిపాలన రాజధానిగా అమరావతిని ఉంచి... విశాఖలో లెజిస్లేటివ్ కేపిటల్ పెట్టొచ్చుగా అని ప్రశ్నిస్తున్నాయి. దీనికి ప్రభుత్వం సమాధానం లేదు. అమరావతిపై చాలా ఆరోపణలు చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ దగ్గర్నుంచి ముంపు ముప్పు వరకూ.. చాలా ఉన్నాయి. ఇన్ సైడర్ ట్రేడింగ్ నిరూపించలేకపోయారు. ముంపు సమస్య విషయంలోనూ అంతే.. అమరావతిలో అంతా ఓ సామాజికవర్గం వారు ఉంటారని.. అక్కడ అమరావతి కడితే.. వారు మాత్రమే లాభపడతారని.. మంత్రులు బహిరంగంగా చెప్పారు. వాస్తవం మాత్రం వేరుగా ఉంది. ప్రభుత్వానికి 33, 771 ఎకరాలను రాజధాని కోసం రైతులు ఇచ్చారు. ఇలా ఇచ్చిన రైతుల సంఖ్య 29754. అంటే.. దాదాపుగా ఒక్కొక్క రైతు.. ఒక్కొక్క ఎకరానికి కొద్దిగా ఎక్కువ మాత్రమే సగటున ప్రభుత్వానికి ఇచ్చారు. 29 గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి.   ఐదు నుంచి పది ఎకరాలలోపు ఇచ్చిన వారు 765 మంది. పది నుంచి ఆపై ఎకరాలు ఇచ్చిన వారు వందల్లో కూడా లేరు.  69 శాతం మంది రైతులు ఎకరంలోపు ఇచ్చారు. వీరంతా నిరుపేద రైతులు. భూములు ఇచ్చినవారిలో 90 శాతం మంది రెండున్నర ఎకరాలలోపు ఉన్నవారే. వీరిని మధ్యతరగతి కేటగిరి కింద వేయవచ్చు. కేవలం 3.3 శాతం మంది మాత్రమే.. ఎగువ మధ్యతరగతి, ధనికవర్గాలు. సామాజికపరంగా చూసుకుంటే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు 75 శాతం ఉన్నారు. మిగిలిన పాతిక శాతంలో కమ్మ, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ వంటి అగ్రకులాలకు చెందినవారున్నారు. 


ఒకటే నినాదం... అమరావతే రాజధాని


అమరావతే ఏకైక రాజధాని అన్న నినాదంతో ఉద్యమిస్తున్నారు.. రాజధాని రైతులు. 600రోజులుగా ఆగకుండా ఉద్యమిస్తున్నారు. లాఠీలు విరిగినా.. జైలు గోడలు మధ్య గడిపినా.. ఎక్కడికక్కడ అణచివేస్తున్నా..కేసులతో వేధిస్తున్నా.. కరోనా విజృంభించినా అమరావతి నినాదాన్నిమాత్రం ఆపలేదు. లాక్‌డౌన్ టైమ్ లో కూడా ఉద్యమాన్ని ఆపకుండా... తక్కువ స్థాయిలో శాంతియుతంగా ఆందోళన చేశారు. అమరావతికి ఉద్యమానికి 100,200 ఏడాది పూర్తైన సందర్భాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ముఖ్యంగా మహిళా రైతులు రోడ్డెక్కారు. జైలు పాలయ్యారు. తాము ప్రభుత్వానికి భూములు ఇచ్చామని  ప్రభుత్వమే మోసం చేస్తే.. ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు.


న్యాయపోరాటమే ఆప్షన్..! 
   
మూడు రాజధానులు దురుద్దేశపూరితమని... అసంబద్ధమని.. రాజ్యాంగ విరుద్ధమని కూడా చెబుతూ కొందరు కోర్టును ఆశ్రయించారు. మూడు రాజధానుల అంశం ఇప్పుడు న్యాయస్థానంలో ఉంది. jరైతులు కూడా ప్రభుత్వం తమను మోసగించిందని సుప్రీంకు వెళ్లారు. సీఆర్‌డీఏతో రైతులు చేసుకున్న ఒప్పందంలో 9.14 ఫాంలోని 18వ షరతు ప్రకారం..  ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే 2013 చట్టం కింద పరిహారమివ్వాలని పేర్కొన్నారు. న్యాయపరంగా ఒప్పందాల్ని ఉల్లంఘిస్తే... 2013 భూసేకరణ చట్టం ప్రకారం  .. 72 వేల కోట్ల రూపాయల మేర పరిహారం చెల్లించాల్సి వస్తుంది. లెక్కన రైతుల నుంచి సమీకరించిన 33వేల ఎకరాలకు సుమారు 72వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే రాజధానిని కొనసాగించాలన్నదే తమ అభిమతమని రైతులు చెబుతున్నారు. తమకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వమే 'న్యాయం' చేస్తుందని నమ్ముతున్నారు.