దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి - టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుల నిజ జీవిత పాత్రల ఆధారంగా ఓ ఫిక్షనల్ పొలిటికల్ థ్రిల్లర్ తీయబోతున్నట్టు ప్రస్థానం దర్శకుడు దేవా కట్టా అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇద్దరు దిగ్గజ నాయకుల మధ్య స్నేహం, రాజకీయ వైరం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలిపారు. 'ఇంద్రప్రస్థం' అనే టైటిల్‌ తో మోషన్ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. ఇది జరిగి మూడేళ్లుదాటినా ఇంతవరకూ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అసలు ఈ మధ్య కాలంలో ఊసేలేదు. అయితే ఇన్నాళ్లకు తాజాగా మళ్ళీ ఈ ప్రాజెక్ట్ వార్తల్లోకి వచ్చింది. 


రాజకీయాల్లో భిన్న ధృవాలుగా ఉండే వైఎస్సార్ - చంద్రబాబు నిజ జీవితంలో ఒకప్పుడు మంచి మిత్రులనే సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. యూత్ కాంగ్రెస్‌ ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి మెలిసి వుండేవారని, ఇద్దరికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని అంటారు. అయితే ఆ తర్వాత రోజుల్లో వేర్వేరు పార్టీల్లో ఉండటం వల్ల వారి దారులు వేరయ్యాయి. ఇద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పని చేసారు. ఒకరు అధికారంలో ఉంటే మరొకరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఒకరిపై మరొకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఇలాంటి అంశాలనే కోర్ పాయింట్ గా తీసుకొని దర్శకుడు దేవాకట్టా కథ రాసుకున్నారు. 


హాలీవుడ్ 'గాడ్‌ ఫాదర్‌' సినిమా స్ఫూర్తితో రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు కథను మూడు భాగాలుగా చెప్పాలని స్క్రిప్ట్‌ రెడీ చేసుకున్నారు దేవాకట్టా. ముందుగా సినిమాగా తీయాలనుకున్నారు కానీ, ఆ తర్వాత దాన్ని వెబ్‌ సిరీస్‌ ఫార్మాట్‌ లోకి మార్పు చేసారు. ఈ స్క్రిప్ట్ ఐడియాను కొన్ని ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ లకు కూడా వివరించారు. చివరకు సోనీ లివ్ ఓటీటీ సంస్థతో డీల్ కుదిరినట్లు టాక్. అయితే ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. కాకపోతే రెండు ప్రధాన పాత్రలకు సరైన యాక్టర్స్ దొరకని కారణం చేతనే ఆలస్యమవుతూ వచ్చిందట. 


ఇప్పటికే చంద్రబాబు నాయుడి పాత్ర కోసం రానా దగ్గుబాటిని సంప్రదించారట. ఆల్రెడీ ఎన్టీఆర్ బయోపిక్ లో అదే పాత్ర పోషించిన రానా, దీనికి సుముఖుత వ్యక్తం చేశారట. కాకపోతే తనకు సమ ఉజ్జీ అయిన నటుడే వైఎస్ పాత్ర చేయాలని చెప్పారట. ఆ టైములో ఆ పాత్రకు ఎవరూ దొరక్క పోవడంతో ఆ చాన్స్ వదులుకున్నారట. అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, రెండు పాత్రల్లో ఓ పాత్రకు హీరో ఆది పినిశెట్టిని తీసుకోవాలని దేవా కట్టా అనుకుంటున్నారని తెలుస్తోంది. అలానే మరో పాత్రకు వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ ను సంప్రదిస్తే సున్నితంగా తిరస్కరించారని టాక్ నడుస్తోంది. ఆ పాత్ర కూడా సెట్ అయితే త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు.


Also Read: 'ఖుషి' కోటి సాయం - చెప్పినట్లుగానే 100 ఫ్యామిలీలను ఎంపిక చేస్తున్న విజయ్ దేవరకొండ!


నిజానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి - చంద్రబాబు నాయుడుల వెబ్ సిరీస్ విషయంలో అప్పట్లో దర్శకుడు దేవా కట్టా, నిర్మాత విష్ణు ఇందూరి మధ్య వివాదం చెలరేగింది. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని రాజకీయ వైరాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజ్ దర్శకత్వంలో విష్ణు ఇందూరి నిర్మాణంలో ఓ వెబ్ సిరీస్ రూపొందనుందని అప్పట్లో కథనాలు వచ్చాయి. దీనిపై దేవా కట్టా స్పందిస్తూ.. తన ఐడియాస్ ని హైజాక్ చేసి ఎన్టీఆర్ బయోపిక్ రూపొందించారని, ఒకసారి మోసపోయాను కానీ మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు. విష్ణు ఇందూరి ఏ విధంగానైనా తన ఎఫర్ట్స్ ని, తన ఫిక్షనల్ ఆలోచనలను కాపీ చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ క్రమంలో తన ఐడియాను 'ఇంద్రప్రస్థం' మోషన్ పోస్టర్ రూపంలో తీసుకొచ్చారు.


''నైతికత మారుతుంది.. కానీ అధికారం కోసం జరిగే యుద్ధం స్థిరంగా ఉంటుంది'' అనే లైన్ తో డిజైన్ చేసిన 'ఇంద్రప్రస్థం' పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఇద్దరు పొలిటికల్ ఐకాన్స్ నుండి ప్రేరణ పొంది ఈ మూవీ తీస్తున్నట్లు తెలిపారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి - నారా చంద్రబాబు నాయుడులు తమశైలిలో అభివాదం చేస్తున్న షాడో ఇమేజెస్ తో పోస్టర్ రూపొందించారు. ''ప్రపంచంలో జరిగే పోటీలన్నిటికీ పర్పస్ ఒక్కటే.. విన్నర్స్ ని ఎంచుకోవడం. విన్నర్స్ రన్ ది వరల్డ్.. ఆ పోటీలో అనుకోకుండా ఇద్దరు స్నేహితులు ఎదురైతే.. ఆ ఆటకున్న కిక్కే వేరు'' అంటూ దేవా కట్ట వాయిస్ ఓవర్ ఇచ్చారు. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, మరి త్వరలోనే దీనికి దృశ్యరూపం తీసుకొస్తారేమో చూడాలి.


Also Read: 'ఫ్యాన్స్‌నే కాదు డిస్ట్రిబ్యూటర్స్‌ని కూడా ఆదుకోండి'.. విజయ్‌ దేవరకొండని ఉద్దేశిస్తూ నిర్మాత షాకింగ్ ట్వీట్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial