'ఖుషి' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో విజయ్ దేవరకొండ.. సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా రూ. 1 కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రాబోయే పది రోజుల్లో పది రోజుల్లో 100 ఫ్యామిలీలను ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు అందిస్తానని స్టేజ్ మీద అనౌన్స్ చేశారు. సోషల్ మీడియాలో ఒక అప్లికేషన్ ఫార్మ్ పెడతానని, హెల్ప్ కావాల్సిన వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు. చెప్పినట్లుగానే ఈరోజు నుంచే 100 కుటుంబాలను ఎంపిక చేసే ప్రక్రియ మొదలు పెట్టారు విజయ్. తాజాగా ట్విట్టర్ వేదికగా ఓ ఫార్మ్ ను షేర్ చేసారు. 


''నా విజయాన్ని, సంతోషాన్ని మీతో పంచుకోవాలని నేను కోరుకున్నాను. అందుకే నా 'ఖుషి' సంపాదన నుండి 1 కోటి రూపాయలని మీకు షేర్ చెయ్యాలని నిర్ణయించుకున్నాను. 100 కుటుంబాలకు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఇవ్వబడుతుంది!. ఇది నిజంగా ఎవరికైనా సహాయం చేస్తే అది నాకు చాలా సంతోషాన్నిస్తుంది. క్రింద లింక్ ద్వారా అప్లై చేసుకోగలరు. #SpreadingKushi, #DevaraFamily'' అని విజయ్ దేవరకొండ ట్వీట్ లో పేర్కొన్నారు. దీనికి అప్లికేషన్ ఫార్మ్ ను జోడించారు.  


''నిజంగా అవసరాల్లో ఉన్నవారికి చేయూత అందించు.. నిరు పేదలు ఆనందాన్ని పొందేలా చేద్దాం.. దేవర ఫ్యామిలీలో చిరునవ్వులు చిందిద్దాం'' అంటూ 'స్ప్రెడ్డింగ్ ఖుషి' పేరుతో ఈ ఫార్మ్ ఇవ్వబడింది. ఇందులో దరఖాస్తు చేసుకునే వారు పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ, సోషల్ మీడియా ప్రొఫైల్ లింక్ (ట్విట్టర్ X, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్), అడ్రెస్, ఫ్యామిలీలో ఎంత మంది ఉంటారు?, పెద్దలు ఎంత మంది? చిన్న పిల్లలు ఎందరు? మీరు ఉంటున్న ఇల్లు సొంతమా లేదా అద్దెకు ఉంటున్నారా? మిమ్మల్ని ఖుషీ చేయడానికి ఈ 1 లక్ష రూపాయలు ఎలా సహాయం చేస్తుంది? చెక్కు తీసుకోవడానికి ఫ్యామిలీతో సహా హైదరాబాద్ కు రాగలరా? వంటి వివరాలను ఈ అప్లికేషన్ ఫార్మ్ లో పొందుపరచాల్సి ఉంటుంది. 






Also Read: డబ్బులిచ్చి మరీ విజయ్ దేవరకొండపై నెగెటివ్ ప్రచారం చేయిస్తున్నది ఎవరు?


చెప్పినట్లుగానే సాయం చేయడానికి ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారని చెప్పాలి. గతంలో పలు సందర్భాల్లో తన సేవా కార్యక్రమాలతో విజయ్ అందరి మన్ననలు పొందారు. కరోనా టైములో మిడిల్ క్లాస్ ఫండ్ ఛారిటీని ఏర్పాటు చేసి ఎందరికో హెల్ప్ చేసారు. అలానే క్రిస్మస్, న్యూ ఇయర్ ఫెస్టివల్స్ సమయంలో అవసరాల్లో ఉన్న పేదవారికి పది వేల చొప్పున అందించారు. ఇప్పుడు ఏ హీరో చేయని విధంగా తన రెమ్యూనరేషన్ నుంచి ఏకంగా రూ. కోటి రూపాయలను 100 కుటుంబాలకు పంచడానికి రెడీ అయ్యారు. 


విజయ్ దేవరకొండ, సమంత రూత్ ప్రభు జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' సినిమా తెరకెక్కింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతోంది. మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ నేపథ్యంలో వైజాగ్ లో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పేరుతో గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగానే విజయ్ కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. 


విజయ్ దేవరకొండా మాట్లాడుతూ.. 'నా విజయంలో నా సంతోషంలో మీరు కూడా భాగం పంచుకోవాలి. నా సంపాదనను మీతో షేర్ చేసుకోలేకపోతే ఇందంతా వేస్ట్. మీరంతా నా ఫ్యామిలీ.. దేవర ఫ్యామిలీ. అవసరం ఉన్నవాళ్లకి ఏ హెల్ప్ చేసినా నాకు సంతోషమే. 100 ఫ్యామిలీలను ఎంపిక చేసుకొని హైదరాబాద్ లో చేయబోయే 'ఖుషి' ఈవెంట్ కంటే ముందే ఈ చెక్ లను వారికి అందజేస్తా. అప్పుడే నాకు ఖుషి సక్సెస్ సంపూర్తి అవుతుంది'' అని అన్నారు.


Also Read: 'ఖుషి' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో కన్నీళ్లు పెట్టుకున్న విజయ్ దేవరకొండ!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial