ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, స్వశక్తితో ఎదిగిన హీరోలలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవర‌కొండ ఒకరు. సినిమాలతోనే కాకుండా తన రియల్ లైఫ్ యాటిట్యూడ్ తో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొన్నేళ్లుగా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోతున్న VD.. ఇప్పుడు 'ఖుషి' సినిమాతో సూపర్ హిట్ అందుకొని మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్ లో విజయ్ కాస్త ఎమోషనల్ అవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. 


'ఖుషి' సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా సోమవారం సాయంత్రం మేకర్స్ వైజాగ్ లో గ్రాండ్ గా ఈవెంట్ ఏర్పాటు చేసారు. దీనికి హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణతో పాటుగా ఇతర చిత్ర బృందం హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ కు సంబంధించిన AVని ప్రదర్శించారు. రౌడీ స్టార్ సినీ ప్రయాణం, అతనికి దక్కిన ప్రశంసలు విమర్శలు, అతని స్పీచ్ లు కలిపి రూపొందించిన ఈ వీడియో ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. తన సినీ ప్రయాణాన్ని ఒక్కసారి ఈ వీడియో రూపంలో స్క్రీన్ మీద చూసుకున్న వీడీ కళ్ళు చెమర్చాయి. 


Also Read: డబ్బులిచ్చి మరీ విజయ్ దేవరకొండపై నెగెటివ్ ప్రచారం చేయిస్తున్నది ఎవరు?


సపోర్టింగ్ రోల్స్ తో కెరీర్ ప్రారంభించిన విజయ్ దేవరకొండ.. 'నువ్విలా' 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' 'ఎవడే సుబ్రహ్మణ్యం' వంటి ఇతర హీరోల సినిమాలలో నటించాడు. ఆ తర్వాత 2016లో 'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. 'అర్జున్ రెడ్డి' చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న వీడీ.. 'గీత గోవిందం' చిత్రంతో 100 కోట్ల క్లబ్ లో చేరాడు. 'మహానటి'తో మెప్పించగా, 'టాక్సీవాలా' పర్వాలేదనిపించాడు. మధ్యలో 'ద్వారక' 'ఏమంత్రం వేశావే' 'నోటా' చిత్రాలు నిరాశ పరిచాయి. 'డియర్ కామ్రేడ్' 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలు ఆశించిన విజయాన్ని అందించలేదు. ఎన్నో హోప్స్ పెట్టుకున్న 'లైగర్' మూవీ పాన్ ఇండియా వైడ్ డిజాస్టర్ గా మారింది. 


ఇండస్ట్రీలో ఎవరికైనా హిట్లు ప్లాపులు సర్వసాధారణం. అయితే 'లైగర్' రిలీజ్ ముందు విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు ఆయన్ను ఎదుర్కొనేలా చేసాయి. అయినప్పటికీ డీలా పడకుండా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తానని ధీమా వ్యక్తం చేసారు. చెప్పినట్లుగానే సరిగ్గా ఏడాది తర్వాత ఇప్పుడు 'ఖుషి' సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ చిత్రం మూడు రోజుల్లోనే 70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విజయంతో విజయ్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ సంతోషాన్ని అభిమానులతో సెలబ్రేట్ చేసుకోడానికి తన సంపాదనలో నుంచి 1 కోటి రూపాయలను విరాళంగా ప్రకటించి, మంచి మనసు చాటుకున్నాడు. 


విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలానే దిల్ రాజు బ్యానర్ లో పరశురాం దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. 'గీత గోవిందం' తర్వాత దర్శక హీరోల కాంబోలో రాబోతున్న సినిమా ఇది. త్వరలోనే VD సైన్ చేసిన ఇతర ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ రానుంది. 


Also Read: 'ఖుషి' విజయాన్ని పురస్కరించుకుని రూ.1 కోటి విరాళం ప్రకటించిన విజయ్ దేవరకొండ


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial