చాలాకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరో విజయ్ దేవరకొండ ఇన్నాళ్లకు మంచి విజయాన్ని అందుకున్నారు. 'లైగర్' లాంటి డిజాస్టర్ మూవీ తర్వాత ఇప్పుడు 'ఖుషి' హిట్టుతో కంబ్యాక్ ఇచ్చారు. ఈ ఖుషీలో ఉన్న విజయ్.. తన సంతోషంతో పాటుగా సంపాదనను కూడా అభిమానులతో షేర్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఖుషీకి వచ్చిన రెమ్యూనిరేషన్ లో ఒక కోటి రూపాయలను 100 మంది కుటుంబాలకు అందజేయనున్నట్టు ప్రకటించి తన మంచి మనసు చాటుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను తాజాగా ట్విట్టర్ లో పంచుకున్నారు. అందరూ VD చేసిన గొప్ప పనిని కొనియాడుతుంటే, టాలీవుడ్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా మాత్రం విజయ్ సినిమా వల్ల నష్టపోయిన తమ ఫ్యామిలీలను కూడా ఆదుకోవాలంటూ ట్వీట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 


అభిషేక్ పిక్చర్స్ సంస్థ ట్వీట్ చేస్తూ.. ''డియర్ విజయ్ దేవరకొండ, 'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీ డిస్ట్రిబ్యూషన్‌లో మేము 8 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాం. కానీ దానిపై ఎవరూ స్పందించలేదు!! ఇప్పుడు మీరు మీ పెద్ద మనసుతో వంద కుటుంబాలకు 1 కోటి రూపాయలు విరాళం ఇస్తున్నారు. దయచేసి మమ్మల్ని, మా ఎగ్జిబిటర్స్ & డిస్ట్రిబ్యూటర్స్ ఫ్యామిలీలను కూడా కాపాడాలని కోరుతున్నాం.. ఆశిస్తున్నాము'' అని ట్వీట్ చేసారు. దీనికి విజయ్ ను ట్యాగ్ చేస్తూ మానవత్వం, ప్రేమ అనే హ్యాష్ ట్యాగ్స్ కూడా పెట్టారు. సాయం చేయడానికి 100 ఫ్యామిలీల ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు విజయ్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికి, అభిషేక్ నామాకు చెందిన అభిషేక్ పిక్చర్స్ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ ట్వీట్ రావడం చర్చనీయంగా మారింది. 






Also Read: 'ఖుషి' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో కన్నీళ్లు పెట్టుకున్న విజయ్ దేవరకొండ!


విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు ఈ సినిమాని నిర్మించారు. 2020 వాలెంటైన్స్ డే స్పెషల్ గా, సరిగ్గా కరోనా పాండమిక్ కు కొన్ని రోజుల ముందు రిలీజైన ఈ రొమాంటిక్ డ్రామా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. దీని తర్వాత ఇకపై లవ్ స్టోరీలు చేయనని ప్రకటించిన వీడీకి తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ మూవీని అభిషేక్ పిక్చర్స్ వారు కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ చేసారు. సినిమా ప్లాప్ అవ్వడంతో దాదాపు 8 కోట్ల వరకూ నష్టపోయారు. అదే విషయాన్ని ఇప్పుడు లేటెస్టుగా విజయ్ దేవరకొండ దగ్గర ప్రస్తావించారు అభిషేక్ నామా. 


విజయ్ దేవరకొండ ను ట్యాగ్ చేస్తూ, అభిషేక్ పిక్చర్స్ చేసిన ట్వీట్ పై ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అదే టాలీవుడ్‌కి చెందిన పెద్ద సినీ ఫ్యామిలీకి చెందిన హీరో అయితే ఇలానే సోషల్ మీడియా వేదికగా నిలదీసేవారా? బ్యాగ్రౌండ్ ఉన్న హీరో అయ్యుంటే ఇలా ప్రొడక్షన్ హౌస్ అఫీషియల్ అకౌంట్ నుంచి ట్వీట్ చేసేవారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విజయ్ దేవరకొండ నటించిన 'అర్జున్ రెడ్డి' సినిమాని ఇదే అభిషేక్ పిక్చర్స్ వారు పశ్చిమ గోదావరిలో పంపిణీ చేసారు. అప్పుడు ఆ సినిమాకి వచ్చిన లాభాల్లోంచి హీరోకి ఎంత ఇచ్చారు? అని క్వశ్చన్ చేస్తున్నారు. విజయ్ పెద్ద మనసుతో కొన్ని కుటుంబాలను ఆదుకోడానికి ముందుకు వస్తే అభినందించడంపోయి, ఇలా డీగ్రేడ్ చేయడం తగదని అంటున్నారు. అసలు సినిమా లాభ నష్టాలతో హీరోకి సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 


నిజానికి ఒక సినిమా ప్లాప్ అయినప్పుడు డబ్బులు వెనక్కి ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది ఆయా హీరోలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య సంబంధాల మీద ఆధారపడి ఉంటాయి. లాభాలు వచ్చినప్పుడు పంపిణీదారులు హీరోలకు షేర్ ఇవ్వరు కాబట్టి, నష్టాలు వచ్చినప్పుడు కూడా అడిగే హక్కు ఎవరికీ ఉండదు. కాకపోతే వారి మధ్య మంచి సంబంధాలు ఉంటే ఎంతో కొంత వెనక్కి తిరిగి ఇచ్చేయడమో, లేదా తర్వాతి సినిమా డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడమో జరుగుతూ ఉంటుంది. 'లైగర్' సినిమా భారీ నష్టాలు మిగిల్చినప్పుడు విజయ్ దేవరకొండ తన రెమ్యునరేషన్ ను ఇచ్చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక్కడ 'వరల్డ్ ఫేమస్ లవర్' విషయంలో ఏం జరిగిందో తెలియదు కానీ, తాను నష్టపోయానంటూ ఇప్పుడు అభిషేక్ నామా సంస్థ ట్వీట్ చేసింది. నిర్మాతను నిర్మాణ సంస్థను వదిలేసి, తమ ఫ్యామిలీలను ఆదుకోవాలంటూ హీరోని కోరుతున్నారు. మరి దీనిపై విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి. 


Also Read: 'ఖుషి' కోటి సాయం - చెప్పినట్లుగానే 100 ఫ్యామిలీలను ఎంపిక చేస్తున్న విజయ్ దేవరకొండ!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial