కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మార్క్ ఆంటోనీ'. ట్రైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాని అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేశారు. విశాల్ సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఎస్ జె సూర్య, సెల్వ రాఘవన్, సునీల్, అభినయ కీలక పాత్రలు పోషించారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఇదిలా ఉంటే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.


ఇందుకు సంబంధించి త్వరలోనే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంది. ఇక ఈ సినిమాలో విశాల్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. టైం ట్రావెల్ బ్యాగ్ డ్రాప్ లో డిఫరెంట్ రోల్స్ లో విశాల్ కనిపిస్తున్నాడు. తాజాగా విడుదలైన ట్రైలర్లో విశాల్ రెట్రో లుక్స్ ఆకట్టుకున్నాయి. ఒక ఫోన్ ద్వారా టైం ట్రావెల్ చేయడం అనే సరికొత్త పాయింట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. ట్రైలర్ లో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో పాటు విశాల్ నుంచి ప్రేక్షకులు కోరుకునే యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇక ట్రైలర్లో ఎస్ జె సూర్య నటన సైతం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. విశాల్ కెరియర్ కి ఈ సినిమా చాలా కీలకం అని చెప్పాలి.


ఎందుకంటే గత కొంతకాలంగా విశాల్ వరుస అపజయాలతో ప్రేక్షకుల్ని నిరాశ పరుస్తున్నాడు. 2018 లో వచ్చిన 'అభిమన్యుడు' తర్వాత విశాల్ కి ఇప్పటివరకు తగిన హిట్ పడలేదు. దీంతో విశాల్ ఆశలన్నీ 'మార్క్ ఆంటోనీ' పైనే ఉన్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఈసారి రొటీన్ కమర్షియల్ మూవీ తో కాకుండా ఓ కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి విశాల్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మినీ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, తమిళం తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.


ఇక చివరగా విశాల్ 'లాఠీ' అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. మరి 'మార్క్ ఆంటోనీ' సినిమాతోనైనా విశాల్ సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి. ఇక 'మార్క్ ఆంటోనీ'తోపాటు విశాల్ నటించిన మరో రెండు సినిమాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. అందులో ఒకటి హరి దర్శకత్వంలో చేస్తుండగా, మరొకటి 'డిటెక్టివ్' సీక్వెల్ లో నటిస్తున్నారు. ఈ సీక్వెల్ని విశాల్ స్వయంగా డైరెక్ట్ చేస్తూ ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్స్  శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాదిలో ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.


Also Read : వెండితెరపై శ్రీలంక బౌలర్ ముత్తయ్య బయోపిక్ - సచిన్ రిలీజ్ చేసిన '800' ట్రైలర్ చూశారా?




Join Us on Telegram: https://t.me/abpdesamofficial