సౌత్ సినిమా పరిశ్రమలో ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టు, నటుడిగా గుర్తింపు పొందిన రవి శంకర్ తన వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. ఆయన కొడుకు అధ్వయ్ హీరోగా ఓ మూవీని ప్లాన్ చేస్తున్నారు. చాలా కాలంగా అధ్వయ్ ని పరిశ్రమలోకి తీసుకురావాలి అని రవి శంకర్ భావిస్తున్నారు. ఎట్టకేలకు ఆయన డెబ్యూ మూవీ ఖరారు అయ్యింది. ఈ చిత్రానికి రవి శంకర్ స్వయంగా దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. త్వరలోఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ టీజర్ తో ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 24న సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి కథ కూడా రవి శంకరే రాశారట. ఈ సినిమా యూత్ ఫుల్ రొమాంటిక్ కాలేజీ లవ్ స్టోరీగా తెరకెక్కనుండగా, మిస్టరీ, దైవత్వంతో కూడిన ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నట్లు రవిశంకర్ తెలిపారు.


నా కొడుకు తొలి సినిమాకు నేనే దర్శకత్వం వహిస్తున్నా- రవిశంకర్


ఇక తన కొడుకు తొలి సినిమాకు దర్శకత్వం వహించడం రవి శంకర్ సంతోషం వ్యక్తం చేశారు. “నేను 20 ఏళ్ల క్రితం మాలాశ్రీ నటించిన ‘దుర్గి’ చిత్రానికి  దర్శకత్వం వహించాను. ఆ తర్వాత నేను నటన వైపు మళ్లాను. కానీ, దర్శకత్వం చేయాలనే కోరిక మాత్రం తీరలేదు. మా అబ్బాయి గురించి అందరి కంటే నాకు బాగా తెలుసు. ఆయనకు ఎలాంటి కథ అయితే సూటవుతుంది అనేది కూడా నాకు తెలుసు. అందుకే, ఆయన తొలి సినిమాకు నేనే దర్శకత్వం వహించాలని నిర్ణయం తీసుకున్నాను” అని రవిశంకర్ తెలిపారు.


ఇక ఈ చిత్రానికి ప్రమఖ సంగీత దర్శకుడు రవి బస్రూర్‌ను స్వరకర్తగా రవి శంకర్ ఖరారు చేశారు. ఇక హీరోయిన్ సహా నటీనటుల సెలెక్షన్ పై  ఆయన ఫోకస్ పెట్టారు. హీరోయిన్ గా కొత్త అమ్మాయిని తీసుకోవాలని రవి శంకర్ భావిస్తున్నారట. ఇక ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు.


అమెరికాలో యాక్టింగ్ కోర్సు పూర్తి చేసిన అధ్వయ్


అధ్వయ్ న్యూయార్క్‌ లోని ది లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏడాదిపాటు యాక్టింగ్ కోర్సు పూర్తి చేశారు. తాజాగా ఆయన అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చారు. తన తొలి మూవీ కోసం ఆయన సిద్ధం అవుతున్నారు. అటు రవి శంకర్ ప్రస్తుతం ధృవ సర్జా, సంజయ్ దత్, రీష్మా నానయ్య ప్రధాన పాత్రలు పోషించిన ‘కెడి’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం తన కొడుకు చిత్రంపై ఆయన ఫుల్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో కొంత కాలం పాటు నటనకు విరామం తీసుకునే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.


Read Also: వాత పెట్టిన ఎదపై ఐస్ రాసినట్టు, ఆకట్టుకుంటున్న ‘డీజే పిల్లా’ లిరికల్ సాంగ్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial