Yash Bithday Special: అప్పటి వరకు యష్ ఎవరో కూడా తెలియదు. ఏవో సినిమాలు చేసుకుంటూ, కన్నడలో ఫ్యాన్ బేస్ పెంచుకుంటూ వెళుతున్నాడు అంతే. అప్పుడొచ్చాడు ఒకడు ప్రశాంత్ నీల్ అని. యష్‌లో ఏం చూశాడో తెలియదు కానీ.. ‘కెజియఫ్’ అంటూ ముఖానికి బొగ్గురాసి బంగారాన్ని బయటికి తీశాడు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌ తవ్వి తీసినా ఆ బంగారానికి ఉన్న విలువ ఏంటో, ఆ బంగారానికి ఎంత క్రేజ్ ఉందో.. వరుస చిత్రాలతో నిరూపించాడు. ఇన్నాళ్లూ ఈ బంగారాన్ని ఎవరూ బయటికి తీయలేకపోయారనేలా.. కోటాను కోట్ల రూపాయలను, తద్వారా కన్నడ ఇండస్ట్రీ ఘనతను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చాటి చెప్పాడు. ఇంతకీ ఆ బంగారం ఎవరో అర్థమైందా? రాకింగ్ స్టార్, రాకీ భాయ్.. యష్. ‘కెజియఫ్’ సిరీస్ చిత్రాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీపై వార్ ప్రకటించిన యష్.. హీరోగా ఒకేసారి 100 మెట్లు ఎక్కేశాడు. ఇప్పుడాయన నుండి వచ్చే సినిమా కోసం పాన్ ఇండియా వేచి చూస్తుందంటే.. కెజియఫ్‌తో యష్ ఎంతగా జనాల్లోకి వెళ్లాడో అర్థం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే.. వెండితెరపై ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్న రాకింగ్ స్టార్ యష్ పుట్టినరోజు నేడు (జనవరి 8). ఈ సందర్భంగా ‘కెజియఫ్’ తర్వాత ఆయన నటిస్తోన్న ‘టాక్సిక్’ మూవీ నుండి ఫస్ట్ లుక్‌ గ్లింప్స్‌ని మేకర్స్ వదిలారు. 


‘టాక్సిక్’ విషయానికి వస్తే.. ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోనప్స్‌’ అనేది సినిమా పూర్తి పేరు. ‘కెజియఫ్’ తర్వాత యష్ చాలా గ్యాప్ తీసుకుని మరీ చేస్తున్న చిత్రమిది. అయితే ఈ సినిమాపై కూడా రకరకాలుగా వార్తలు వినిపించాయి. రీసెంట్‌గా కూడా ఈ సినిమా ఆగిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలన్నింటినీ యూనిట్ ఖండిస్తూ వస్తుంది. ఇప్పుడిక అనుమానపడాల్సిన అవసరం లేకుండా గ్లింప్స్ వదులుతున్నట్లుగా ఓ పోస్టర్ వదిలి మేకర్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ‘కెజియఫ్’ తర్వాత యష్‌ని చూసే కోణం మారిపోయింది. ఇకపై ఆయన నుండి అంతా భారీగానే ఉంటుంది. ఈ ‘టాక్సిక్’ చిత్రం కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఆ వదిలిన పోస్టర్ కూడా మరోసారి యష్ స్టయిలిష్ వింటేజ్ రా లుక్‌లో కనిపించబోతున్నాడనే విషయాన్ని తెలియజేసింది.


Also Readరేసింగ్ సర్క్యూట్‌లో కోలీవుడ్ స్టార్ కారుకు ఘోర ప్రమాదం... స్వల్ప గాయాలతో బయటపడిన అజిత్



ఆ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే ట‌క్సెడో, ఫెడోరా డ్రెస్‌లో య‌ష్ ఓ వింటేజ్ కారుని అనుకుని స్టైల్‌గా సిగ‌రెట్ అంటిస్తున్నాడు. ‘అతని అంతులేని ఉనికి మీ అస్తిత్వానికి సంక్షోభం’ అనే ట్యాగ్ లైన్ మరోసారి కెజియఫ్ ఛాయలను పరిచయం చేస్తోంది. ఇప్పుడొచ్చిన గ్లింప్స్ చూస్తుంటే.. మరో పవర్ ఫుల్ మూవీతోనే యష్ రాబోతున్నాడనేది అర్థమవుతోంది. రెట్రో పబ్‌లో సిగార్ కాలుస్తూ ఉన్న యష్ లుక్, ఆ వీడియో గ్లింప్స్‌ చివరలో పబ్‌లో అమ్మాయితో చేసిన డ్యాన్స్ క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. ఇప్పటి వరకు వార్తలలో చాలా తక్కువగా ఉన్న ఈ సినిమా.. ఈ గ్లింప్స్ తర్వాత బాగా వినిపించే అవకాశం అయితే లేకపోలేదు. అలా ఈ గ్లింప్స్‌తో ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేశారు మేకర్స్. ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోనప్స్‌’ డిఫ‌రెంట్ జోన‌ర్‌లో ఇంటెన్స్ క‌థ‌తో రూపొందిన సినిమా అనేది ఈ గ్లింప్స్ చెప్పేస్తుంది. మళ్లీ రికార్డులపై రాకీ భాయ్ తాండవానికి ఇదే నాంది అనేలా గ్లింప్స్‌ని కట్ చేశారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.


Also Read: ఆ ఒక్క పని చేయండి... అనిరుధ్‌కు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సలహా


గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోనప్స్‌’ చిత్రాన్ని కె.వి.ఎన్‌.ప్రొడ‌క్ష‌న్స్‌, మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేష‌న్స్ ప‌తాకాల‌పై వెంక‌ట్ కె.నారాయ‌ణ‌, య‌ష్ నిర్మిస్తున్నారు. ఈ 2025లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ గ్లింప్స్‌ని షేర్ చేస్తూ.. ఆయన ఫ్యాన్స్ యష్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రీసెంట్‌గా తన పుట్టినరోజు అని చెప్పి.. ఎటువంటి స్టంట్స్ చేయవద్దని అభిమానుల కోసం యష్ ఓ లెటర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మీరు మీ లక్ష్యం కోసం ప్రయత్నించి, విజయం సాధిస్తే.. అది నాకెంతో సంతోషాన్ని ఇస్తుందని అభిమానులను ఉద్దేశిస్తూ.. యష్ ఆ లెటర్‌లో పేర్కొన్నారు.


Also Readపాన్ ఇండియా స్పై థ్రిల్లర్‌తో టాలీవుడ్‌లోకి వామిక రీ ఎంట్రీ - హ్యాండ్సమ్ హీరోతో యాక్షన్ ఫిల్మ్‌లో