''రమణ విల్లర్ట్ గారు ఫోటోగ్రాఫర్‌గా తెలుసు. ఆయన చెప్పిన కథ బాగుంది. ఎలా తీశారోనని వచ్చా. సినిమా అద్భుతంగా ఉంది. ప్రేక్షకులందరికీ తెలియాల్సిన, అందరూ చూడాల్సిన చిత్రమిది. ఫోటో మీద మంచి కథ రాసుకుని తీశారు. సినిమా చూశాక కన్నీళ్లు వచ్చాయి'' అని రేణూ దేశాయ్ (Renu Desai) అన్నారు. ఇంతకీ, ఆవిడను ఏడిపించిన సినిమా ఏదో తెలుసా? '1000 వర్డ్స్' (1000 Words Movie). ఆ సినిమాలో అరవింద్ కృష్ణ హీరో. 'బిగ్ బాస్' ఫేమ్ దివి హీరోయిన్. మేఘన శ్రీనివాస్, వినయ్ కీలక పాత్రల్లో నటించారు.
విల్లర్ట్ ప్రొడక్షన్ హౌస్ సంస్థలో రమణ విల్లర్ట్ (Ramana Villart) దర్శకత్వం వహిస్తూ నిర్మించిన సినిమా '1000 వర్డ్స్'. కె. రవి కృష్ణా రెడ్డి సహ నిర్మాత. డా. సంకల్ప్ కథ, కథనం, మాటలు అందించిన ఈ సినిమాకు శివ కృష్ణ సంగీత దర్శకుడు. పీవీఆర్ రాజా నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ హైదరాబాద్‌లో వేశారు. రేణూ దేశాయ్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చి రెడ్డి, మధుర శ్రీధర్, జ్యోతి పూర్వాజ్, సుకు పూర్వాజ్ తదితరులు హాజరు అయ్యారు.
ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ... ''అందరినీ కంటతడి పెట్టించిన అద్భుతమైన చిత్రమిది. కచ్చితంగా అవార్డులు వస్తాయి. చాలా రోజులకు ఓ చక్కటి సినిమా చూశానని సంతోషమేసింది. ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిపేసే చిత్రమిది'' అని అన్నారు. హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ... ''ఈ సినిమాలో నటించడం నా అదృష్టం. రమణ గారితో ఒకసారి ఫోటో షూట్ చేశా. 'మీరెప్పుడైనా సినిమా చేస్తే నాకు చెప్పండి' అన్నాను. బాగా నటించానని, ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అనుకుంటున్నా. సూపర్ హీరో ఫిల్మ్ 'ఏ మాస్టర్ పీస్' చిత్రీకరణలో నాకు గాయమైంది. సుమారు 8 నెలలు విశ్రాంతి తీసుకున్నా. ఆ టైంలో ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. మేఘన, దివి అద్భుతంగా నటించారు. '1000 వర్డ్స్'కు నూరీ హీరో. నా మూడేళ్ల కొడుకు అద్విక్ కృష్ణ తొలిసారి నా సినిమా స్క్రీన్ మీద చూశాడు. ఇది నాకెంతో స్పెషల్'' అని అన్నారు.
Also Read: రేసింగ్ సర్క్యూట్‌లో కోలీవుడ్ స్టార్ కారుకు ఘోర ప్రమాదం... స్వల్ప గాయాలతో బయటపడిన అజిత్
దర్శక నిర్మాత రమణ విల్లర్ట్ మాట్లాడుతూ... ''నేను గత 20 ఏళ్లుగా మంచి సినిమా చేయాలని తపిస్తున్నా. నేను కథలు రాయలేను. చాలా కథలు వింటున్న టైంలో సంకల్ప్ ఈ కథ చెప్పాడు. బిడ్డను కనేటప్పుడు తల్లి పడే బాధను చెప్పాలని, చూపించాలని ఈ సినిమా తీశాం. చిత్రీకరణ అంతా అరకులో చేశాం. అమ్మగా మేఘన అద్భుతంగా నటించారు. హీరో అరవింద్ కృష్ణ, దివి, చైల్డ్ ఆర్టిస్ట్ విజయ్ అలియాస్ నూరీ అద్భుతంగా నటించారు. సంగీత దర్శకుడు శివ కృష్ణ బాణీకి కీరవాణి తండ్రి శివశక్తి దత్తా అద్భుతమైన పాట రాశారు. రచయిత లక్ష్మీ భూపాల గారు రెమ్యూనరేషన్ లేకుండా మరో పాట రాసిచ్చారు. టీం అంతా ఎంతో సపోర్ట్ చేశారు. దర్శక నిర్మాతగా నా తొలి ప్రయత్నం ఇది. తప్పులు ఉంటే చెప్పండి. సరిదిద్దుకుంటా'' అని అన్నారు. ఈ కార్యక్రమంలో దివి, మేఘన, నూరి, సంకల్ప్, సినిమాటోగ్రఫర్ శివ రామ్ చరణ్, మ్యూజిక్ డైరెక్టర్ శివ కృష్ణ, నేపథ్య సంగీత దర్శకుడు పీవీఆర్ రాజా, అచ్చి రెడ్డి, మధుర శ్రీధర్, నటి జ్యోతి పూర్వాజ్, సుకు పూర్వాజ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: పాన్ ఇండియా స్పై థ్రిల్లర్‌తో టాలీవుడ్‌లోకి వామిక రీ ఎంట్రీ - హ్యాండ్సమ్ హీరోతో యాక్షన్ ఫిల్మ్‌లో