'Bahubali' Writer Vijayendra Prasad Latest Interview: దర్శక ధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి - ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన 'బాహుబలి' సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో దగ్గుపాటి రానా విలన్ గా అదరగొట్టగా సీనియర్ నటి రమ్యకృష్ణ శివగామి దేవిగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.


ప్రభాస్ మాత్రమే కాదు సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికి ఎంతో మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ప్రభాస్, దగ్గుబాటి రాణాల తర్వాత కట్టప్ప పాత్ర ఎంత హైలెట్ అయిందో చెప్పనవసరం లేదు. తమిళ నటుడు సత్య రాజ్ కట్టప్ప పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారు. అయితే నిజానికి 'బాహుబలి' లో కట్టప్ప పాత్ర కోసం మొదట ఓ బాలీవుడ్ హీరోని అనుకున్నారట. ఇదే విషయాన్ని రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.


'బాహుబలి' లో కట్టప్ప పాత్రని మిస్ చేసుకున్న బాలీవుడ్ హీరో


'బాహుబలి' లో కట్టప్ప పాత్రకి భారీ గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్నతో 'బాహుబలి 2' పై మరింత క్రేజ్ వచ్చేలా చేసాడు రాజమౌళి. అలాంటి కట్టప్ప పాత్ర కోసం ముందుగా బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ ని అనుకున్నారట. ఇదే విషయాన్ని రచయిత విజయేంద్ర ప్రసాద్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు." బాహుబలి కథ ప్రభాస్ కోసం రాసిందే. కానీ కట్టప్ప పాత్రలో ముందుగా సంజయ్ దత్ తీసుకోవాలని అనుకున్నాం. కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో నా పాత్ర కోసం వేరే వాళ్ళని తీసుకోవాలని డిసైడ్ అయ్యాం. ఈ క్రమంలోనే తమిళ నటుడు సత్య రాజ్ ను కట్టప్ప గా తీసుకుంటే బాగుంటుందని అనిపించి ఆయన సంప్రదించగా ఆయన కూడా ఓకే చెప్పారు" అని అన్నారు. కాగా కట్టప్ప పాత్ర సత్యరాజ్ కి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చి పెట్టింది.


'బాహుబలి'లో మిస్ అయినా 'KGF' తో ఫుల్ క్రేజ్


సంజయ్ దత్ 'బాహుబలి' లో కట్టప్ప పాత్ర చేసుంటే అప్పుడే ఆయనకు సౌత్ లో భారీ గుర్తింపు వచ్చుండేది. అయితే అలాంటి ఓ పవర్ ఫుల్ పాత్ర 'కేజిఎఫ్' తో సంజయ్ దత్ కి దక్కింది. కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించిన 'KGF' సినిమాలో సంజయ్ దత్ అధీరాగా విలన్ పాత్రలో అదరగొట్టాడు. నటన మాత్రమే విలన్ రోల్ కోసం డిఫరెంట్ గా మేకోవర్ అయ్యాడు. 'KGF' సెన్సేషనల్ హిట్ అందుకోవడంతో సౌత్ లో సంజయ్ దత్ కి భారీ క్రేజ్ వచ్చింది. 


'డబుల్ ఇస్మార్ట్' లో విలన్ గా


పూరి జగన్నాథ్ - ఉస్తాద్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'డబుల్ ఇస్మార్ట్' మూవీలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. ఇందులో 'బిగ్ బుల్' అనే పాత్ర లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సంజయ్ దత్ ఫస్ట్ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మార్చి 8న విడుదల కావలసిన ఈ మూవీ రిలీజ్ వాయిదా పడనున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మూవీ టీం నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.


Also Read : షారుఖ్ ఖాన్ కోసమే ఆ పనిచేశా, అది ఆయన దగ్గరే నేర్చుకున్నా - ప్రియమణి