NT Rama Rao Junior In Politics?: యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా? గతంలో తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేసిన ఆయన ముఖ్యమంత్రి అవుతారా? నందమూరి కుటుంబం నుంచి నెక్స్ట్ సీఎం అయ్యేది ఆయనేనా? - ప్రస్తుతానికి ఇటువంటి ప్రశ్నలకు ఆన్సర్స్ లభించడం కష్టం. కానీ, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కొంతమంది మనసులో కోరిక.


ఎన్టీఆర్ ఇప్పుడు పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టారు. ఆయన ఎటువంటి రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. మాట్లాడటం లేదు. అయితే... ఆయన పేరును కొంత మంది రాజకీయాల్లోకి తీసుకు వస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారు. అందుకు ఉదాహరణ... 'ది వారియర్' ట్రైలర్ లాంఛ్‌. 


ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా నటించిన 'ది వారియర్' ట్రైలర్ విడుదల కార్యక్రమం శుక్రవారం రాత్రి అనంతపురంలో జరిగింది. అందులో 'CM NTR RRR' బ్యానర్స్ కనిపించాయి. ఎన్టీఆర్‌కు సంబంధం లేని సినిమా వేడుకలో ఆయన సీఎం కావాలని కొంత మంది బ్యానర్స్ పెడుతున్నారంటే... పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. 


Also Read : రామ్ 'ది వారియర్' ట్రైలర్ వచ్చేసిందోచ్ - యాక్షన్ పీక్స్



అనంతపురంలో నందమూరి కుటుంబానికి అభిమానులు ఎక్కువ. రాజకీయ ఆదరణకు తిరుగులేదు. అక్కడ హిందూపూర్ నియోజకవర్గం నుంచి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్.టి. రామారావు మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా చేశారు. అందువల్ల, అనంతపురంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి ఈ కోరిక వినిపిస్తున్నట్లు ఉంది. అభిమానుల ఆకాంక్షపై ఎన్టీఆర్ స్పందిస్తారో? లేదంటే ఎప్పటిలా మౌనం వహిస్తారో?