Muskan Nancy James : హన్సిక మోత్వాని గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కరలేదు. 'దేశముదురు' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. సిల్వర్ స్క్రీన్ నుంచి బుల్లితెర వరకు అన్ని వర్గాల ప్రేక్షకులకు తన సినిమాలు, పలు షోలతో హన్సిక బాగా దగ్గరయింది. కానీ తాజాగా హన్సిక ఫ్యామిలీ మొత్తంపై ఆ ఇంటి కోడలు కేసు నమోదు చేసిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. దీంతో అసలు వీళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? హన్సిక సోదరి భార్య వీళ్ళ ఫ్యామిలీ మొత్తంపై ఎందుకు కేసు పెట్టింది? అనే చర్చ జరుగుతుంది. 


ఈ ముస్కాన్ ఎవరు ?
ప్రముఖ బాలీవుడ్ టెలివిజన్ నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్. ఈ అమ్మడు హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వాని మాజీ భార్య. తాజాగా ముస్కాన్ హన్సికతో పాటు ఆమె తల్లి, సోదరుడిపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ముస్కాన్ నాన్సీ జేమ్స్ డార్జిలింగ్ కు చెందిన అమ్మాయి. ఆ తర్వాత ఢిల్లీకి నివాసం మార్చుకుంది ఈ ఫ్యామిలీ. 2006 నుంచి ఆమె టెలివిజన్ పరిశ్రమలో తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. మొదట చిన్నా చితకా పాత్రలు చేసిన ముస్కాన్ 2008లో వచ్చిన 'మాతా కి చౌకీ' షోలో లీడ్ రోల్ చేసింది. ఈ సీరియల్లో ఆమె పాత్ర విపరీతంగా పాపులర్ అయింది. ఇక ఆ తర్వాత ముస్కాన్ 'అదాలత్',  'క్రైమ్ పెట్రోల్', 'మహారాణా ప్రతాప్' వంటి అనేక హిందీ సీరియల్స్ లో నటించి, మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. కెరీర్ ప్రారంభంలో ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా పని చేసింది. 


హన్సిక ఫ్యామిలీపై గృహంస కేసు 


2021లో ముస్కాన్ నాన్సీ జేమ్స్ సౌత్ హీరోయిన్ హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానిని పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి ఉదయ్ పూర్ లో వైభవంగా జరిగింది. ఇక ప్రేమ పెళ్లి తర్వాత ముస్కాన్ - ప్రశాంత్ ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా తాము సంతోషంగా ఉన్నాము అనే విధంగా ఫోటోలు, వీడియోలు షేర్ చేసేవాళ్ళు. వీరిద్దరి మధ్య విభేదాలు బయట పడటం మొదలైంది. అయితే అసలు సమస్య ఏంటి అన్న విషయాన్ని ఈ జంట ఎప్పుడూ బహిరంగంగా వెల్లడించలేదు. కానీ పెళ్లి అయిన రెండు నెలలకే ఇద్దరూ విడివిడిగా జీవించడం మొదలు పెట్టారు. 


ఇక ముస్కాన్ సోషల్ మీడియా నుంచి తన పెళ్లి ఫోటోలు కూడా డిలీట్ చేసింది. చివరకు ముస్కాన్ జనవరి 2025 లో గృహ హింస, ఆస్తి సంబంధిత మోసపూరిత ఆరోపణలు చేస్తూ హన్సికతో పాటు ఆమె మాజీ భర్త, అత్తపై కేసు నమోదు చేసింది. ఈ విషయమై అంబులి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై ముస్కాన్ స్పందిస్తూ తను గృహహింస చట్టం కింద కేసు నమోదు చేసిన విషయం నిజమేనని వెల్లడించింది. అయితే కేసు కోర్టులో ఉన్న కారణంగా తాను దీని గురించి ఇప్పుడు ఇంకేమీ మాట్లాడలేనని స్పష్టం చేసింది. ఈ కేసు గురించి ఇప్పటిదాకా ఇటు హన్సిక గానీ, లేదా ఆమె ఫ్యామిలీ గానీ స్పందించలేదు.



Also Readవెండితెరకు రాజకీయ రంగులు... తెలుగులో బెస్ట్ పొలిటికల్ ఫిలిమ్స్ - 'గేమ్ చేంజర్'కు ముందు... మీరెన్ని చూశారు?