దాదాపు ఐదు దశాబ్దాలు నటుడిగా సినీ ప్రస్థానం కొనసాగించిన సీనియర్ నటుడు శరత్ బాబు నేడు తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత జీవితంలోని ప్రేమ, పెళ్లి, విడాకులు వంటి విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నటి రమాప్రభతో ఆయనకున్న సంబంధం గురించి నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. 


శరత్ బాబు వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. ఆయన సినిమాలలో నిలదొక్కుకోవటానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో, ‘కన్నెవయసు’ హీరో లక్ష్మీకాంత్ ద్వారా రమాప్రభకు పరిచయం అయ్యారు శరత్ బాబు. అప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో స్థిరపడిపోయిన రమాప్రభ.. ఆయన్ను దర్శక నిర్మాతలకు రికమెండ్ చేశారని నివేదికలు ఉన్నాయి. శరత్ బాబును హీరోగా ప్రమోట్ చేసేందుకు రమాప్రభ నిర్మాతగా మారి, 'వింత ఇల్లు సొంత గోల' అనే సినిమా నిర్మించారు. అప్పుడే వారిద్దరి బంధంపై పుకార్లు షికారు చేయగా.. వాటినే నిజం చేస్తూ, 1974లో పెళ్లి బంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. 


వయసులో తన కంటే చాలా పెద్దదైన రమాప్రభను శరత్ బాబు ప్రేమ వివాహం చేసుకోవడం అప్పట్లో సంచలంగా మారింది. దాదాపు పదేళ్ళ పాటు వీరిద్దరూ కలిసి జీవించారు. గాంధీనగర్ రెండవ వీధి, అప్పుల అప్పారావు వంటి చిత్రాలను కలిసే నిర్మించారు. అప్పట్లో శరత్ బాబు ఓ సినిమా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లైఫ్ లో మరచిపోలేని రోజులు మూడే అని.. ఒకటి తన పుట్టినరోజు, రెండు తన భార్య రమ పుట్టినరోజు, మూడు తమ పెళ్ళి రోజు అని పేర్కొన్నారు. అంతలా భార్యను ప్రేమించిన శరత్ బాబు, ఎందుకనో రమాప్రభతో విడిపోయారు. వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో పద్నాలుగేళ్ల తర్వాత 1988లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 1990లో తమిళ నటుడు ఎంఎన్ నంబియార్ కుమార్తె స్నేహలత నంబియార్ ను వివాహం చేసుకున్నారు శరత్ బాబు. కొన్నేళ్లకు ఆమెతో కూడా విడిపోయారు. 


శరత్ బాబు, రమాప్రభ మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగానే మనస్పర్థలు వచ్చాయని అంటారు. అసలు శరత్ బాబు తనకంటే పెద్దదైన రమాప్రభను ఆస్తి కోసం, సినిమా ఆఫర్స్ కోసమే పెళ్లి చేసుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పటికీ రమాప్రభ పలు ఇంటర్వ్యూలలో శరత్ బాబుని తీవ్రంగా విమర్శిస్తూ, ఆయన వ్యక్తిత్వాన్ని దూషిస్తూ ఉంటుంది. మోసం చేసి తన ఆస్తులను రాయించుకున్నాడని ఆరోపిస్తూ ఉంటుంది. 2007లో ఓ ఇంటర్వ్యూలో రమాప్రభ మాట్లాడుతూ.. నేను ఆసరా కోసం పెళ్ళిచేసుకుంటే, శరత్ బాబు అవసరానికి పెళ్ళి చేసుకున్నాడని.. తమది పరస్పర అవకాశవాదపు పెళ్ళి అని వ్యాఖ్యానించింది. 


అయితే ఈ వివాదంలో శరత్ బాబు కూడా తన వర్షన్ వినిపిస్తూ వచ్చారు. రమాప్రభకు అప్పట్లోనే తాను కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి ఇచ్చానని చెప్పేవారు. సినిమాల్లో అవకాశాల కోసం రమాప్రభను పెళ్లి చేసుకున్నారనే వార్తలపై స్పందిస్తూ.. "నేను ఫుడ్ బెడ్ కోసం ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు. నేను సిల్వర్ స్పూన్ తో పుట్టాను. నేను హీరోగా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాను. ఆమె ఎప్పుడూ నన్ను ఏ దర్శకుడికి లేదా నిర్మాతకు రికమెండు చేయలేదు. నేను 40 ఏళ్లుగా సినీ పరిశ్రమలో నిలకడగా కొనసాగుతున్నాను. కరుణానిధి గారి కొడుకు కూడా ఎక్కువ కాలం నిలవలేకపోయాడు. కె.బాలచందర్ గారు పరిచయం చేయడం వల్లనే నేను నిలబడ్డాను. నేను ఆమెను కలవకముందే నాకు స్టార్‌ డమ్ ఉంది" అని చెప్పుకొచ్చాడు శరత్ బాబు. 


రమా ప్రభతో నాకు జరిగింది పెళ్లే కాదు - ఓ ఇంటర్వ్యూలో శరత్ బాబు వ్యాఖ్యలు


రమాప్రభను మోసం చేసి ఆస్తులు కూడబెట్టుకున్నారనే ఆరోపణలను శరత్ బాబు మొదటి నుంచీ ఖండిస్తూ వస్తున్నారు. "చెన్నైలోని అగ్రికల్చర్ ల్యాండ్ ని అమ్మి నేను ఆమెకు ప్రాపర్టీని గిఫ్ట్ గా ఇచ్చాను. దాని వాల్యూ ఇప్పుడు రూ. 60 కోట్ల వరకూ ఉంటుంది. ఆమె తమ్ముడి పేరుమీద మరొకటి, ఇద్దరి పేరు మీద ఇంకొకటి.. ఇలా మూడు ప్రాపర్టీలు కొనిచ్చాను" అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తన దృష్టిలో రమా ప్రభతో జరిగింది పెళ్లే కాదని.. ఒక కలయిక మాత్రమే అని అన్నారు. 


"నేను తమిళ యాక్టర్ ఎంఎన్ నంబియార్ కూతురిని చాలా ఏళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నాను. అదే నా ఫస్ట్ మ్యారేజ్. కానీ మీడియా నా మాజీ భార్య అని వేరొకరిని పేరుని చెబుతోంది. మేము ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు. మా బంధానికి పేరు లేదు'' అని శరత్ బాబు ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అప్పట్లో నా వయసు 22 ఏళ్ళు.. రమాప్రభ నా కంటే వయసులో చాలా పెద్దది. ఫ్రెష్ గా కాలేజీ నుంచి, మంచి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చా. బయటి ప్రపంచం గురించి తెలియని వయసులో ఆమెతో పరిచయం ఏర్పడింది. అందుకే సరైన ఛాయిస్ తీసుకోలేకపోయానని, ఆ వయసులో ఎలాంటి అనుభవం లేకుండా ఆ తప్పు చేశానని పేర్కొన్నారు. 


'రమాప్రభ అంత స్వార్థపరురాలైతే, ఆమెతో అన్నేళ్లు ఎలా కలిసున్నారు?' అని అడిగితే.. "నేను ఆర్టిస్ట్‌ గా చాలా బిజీగా ఉండేవాడిని. ఎక్కువ సమయం అవుట్‌ డోర్ లొకేషన్‌ లలో షూటింగ్ చేస్తుంటాను. ఆమెతో గొడవ పెట్టుకోవడానికి కూడా నాకు సమయం ఉండేది కాదు" అని శరత్ బాబు బదులిచ్చారు. ఇండస్ట్రీలో ఎవరూ ఎప్పుడూ తన గురించి నెగెటివ్‌ గా మాట్లాడలేదని.. అందరితో మంచిగా ఉంటాను కాబట్టి తనను ఇష్టపడుతున్నారని చెప్పుకొచ్చాడు. ఇలా రమాప్రభ, శరత్ బాబు ఇద్దరూ ఎవరి వెర్షన్స్ వారు వినిపిస్తూ వచ్చారు. ఇందులో ఎవరిది నిజమనేది పక్కన పెడితే, వీరి విడాకుల గురించి సోషల్ మీడియాలో అనేక కథనాలు కనిపిస్తూనే ఉన్నాయి.


Read Also: పోలీసు కావాలనుకున్న శరత్ బాబు నటుడు ఎలా అయ్యారు? ఆయన గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు