ప్రముఖ నటుడు శరత్‌ బాబు (71) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఎన్నో ఏళ్లుగా సినీ అభిమానులను అలరించిన సీనియర్ నటుడి మరణ వార్తతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ఆయన మృతికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సినీ, వ్యక్తిగత జీవిత విషయాలు చర్చకు వస్తున్నాయి. 


ఆ సత్యంబాబే ఈ శరత్ బాబు


శరత్ బాబు 1951 జులై 31న ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జన్మించారు. ఆయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. వారి పూర్వీకులది వెస్ట్ బెంగాల్ మూలాలు అని.. అందుకే దీక్షిత్ అని బెంగాలీ పేరు వుంటుందని అంటుంటారు. అయితే అది దీక్షిత్ కాదు దీక్షితులు అని, ఆయన ఒరిజినల్ నేమ్ స‌త్యం బాబు దీక్షితులు అని కూడా మరికొందరు చెబుతుంటారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన పేరు 'శరత్ బాబు' గా మారింది. అనకాపల్లికి చెందిన రామవిజేతా బ్యానర్ లో కె.ప్రభాకర్, కె.బాబూరావు ఆయన్ను సినీ రంగానికి పరిచయం చేస్తూ పేరును శరత్ బాబుగా మార్చారు. బాబూరావు మరెవరో కాదు 'నిశ్శబ్దం' సినిమా దర్శకుడు హేమంత్ మధుకర్ తండ్రి. 


పోలీస్ అవ్వాలనుకున్న శరత్ బాబు


నిజానికి శరత్ బాబు సినిమాల మీద ప్యాషన్ తో సినీ రంగంలోకి రాలేదు. వాళ్ళ నాన్న అతన్ని ఒక బిజినెస్ మ్యాన్ గా చూడాలని అనుకుంటే, ఆయన మాత్రం చిన్నప్పటి నుంచీ పోలీస్ అవ్వాలని కలలు కన్నాడు. కానీ షార్ట్ సైట్ రావడంతో ఆ దిశగా ప్రయత్నాలు చేయలేకపోయారు. ఈ విషయాన్ని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా వెల్లడించారు. ''మా నాన్న హోటల్ వ్యాపారి, నేను ఆ వ్యాపారాన్ని నిర్వహించాలని ఆయన కోరుకున్నాడు. కానీ నేను పోలీసు ఆఫీసర్ కావాలనుకున్నాను. అయితే కాలేజీ రోజుల్లో నాకు ఐ సైట్‌ వచ్చింది. పోలీసులలో చేరడానికి స్పష్టమైన కంటి చూపు తప్పనిసరి కావడంతో, నా కలలు దెబ్బతిన్నాయి'' అని శరత్ బాబు చెప్పారు. అయితే నిజ జీవితంలో పోలీస్ కాలేకపోయిన ఆయన, అనేక చిత్రాల్లో పోలీసాఫీర్ గా ఖాకీ ధరించి లాఠీ చేతబట్టుకున్నాడు. ఆ విధంగా తన డ్రీమ్ ను కొంతవరకూ నెరవేర్చుకున్నాడని అనుకోవాలి. 


బిజినెస్‌ వదిలి సినిమాల వైపు


తల్లి సపోర్ట్ తోనే సినిమాల్లోకి వచ్చినట్లుగా శరత్ బాబు చెబుతుంటారు. ''నీ కొడుకు అందంగా ఉన్నాడని, సినిమాల్లో హీరో అవుతాడని చుట్టుపక్కల వాళ్ళు మా అమ్మతో అంటుండేవారు. కాలేజీలో నా లెక్చరర్లు కూడా అదే చెప్పారు. ఇదంతా నా మనసులో పడింది. దీన్ని మా నాన్న వ్యతిరేకించినా, అమ్మ చాలా సపోర్ట్ చేసింది. నేను బిజినెస్ కు సరిపోనని నా మనసుకు తెలుసు. నేను ఒకవేళ అక్కడ ఫెయిల్ అయితే, మళ్ళీ వెనక్కి వచ్చి ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవచ్చు. వ్యాపారానికి సరిపోనని తెలిసినప్పటికీ నేను అదే అనుకున్నాను. అలాంటి టైంలో ఓ సినిమా కోసం కొత్తవారు కావాలని పేపర్‌ లో వచ్చిన ప్రకటన చూసి వెళ్ళాను. నేను ఊహించిన దానికంటే చాలా ఈజీగా ఆడిషన్‌ జరిగింది'' అని శరత్ బాబు తెలిపారు. 


సినీ జీవితం అలా మొదలైంది


1973లో 'రామరాజ్యం' అనే సినిమాతో శరత్ బాబు సినీ రంగ ప్రవేశం చేసారు. అయితే ముందుగా 'కన్నెవయసు' అనే చిత్రం విడుదలైంది. వికీపీడియా ప్రకారం ఇదే ఆయనకు తొలి చిత్రంగా పేర్కొనబడింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో అమెరికా అమ్మాయి, పంతులమ్మ వంటి చిత్రాలలో నటించారు శరత్ బాబు. ఇదే క్రమంలో తెలుగులో కె. బాలచందర్ దర్శకత్వంలో 'చిలకమ్మ చెప్పింది' సినిమా చేసాడు. ఆయనకు బాలచందర్ డైరెక్షన్ లో చేసిన తమిళ్ మూవీ తనకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిందని నటుడు చెబుతుంటారు. ఈ సినిమా తెలుగులో కమల్‌ హాసన్‌, చిరంజీవి, శరత్ బాబులతో 'ఇది కథ కాదు' గా రీమేక్‌ చేయబడింది. 


శరత్ బాబు అప్పట్లోనే పాన్ ఇండియా స్టార్


శరత్ బాబు అప్పట్లోనే ఒక పాన్ ఇండియా స్టార్‌ అని చెప్పాలి. తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగానే కాకుండా విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. మరో చరిత్ర, మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, అన్వేషణ, సంకీర్తన, సంసారం ఒక చదరంగం, స్వాతిముత్యం, సాగర సంగమం, ఖైదీ రాణి, జీవన పోరాటం, ఓ భార్య కథ, నీరాజనం, ఆడపిల్ల, ప్రాణ స్నేహితులు, సితార, ఆపద్భాందవుడు, అన్నయ్య, సిసింద్రీ లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో శరత్ బాబు నటించారు. చివరగా 'వకీల్ సాబ్' సినిమాలో కనిపించిన ఆయన.. త్వరలో రిలీజ్ కాబోతున్న 'మళ్ళీ పెళ్లి' చిత్రంలో భాగమయ్యారు.


నటనకు ఎన్నో సత్కారాలు, పురస్కారాలు


దాదాపు ఐదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న శరత్ బాబు, అన్ని భాషల్లో కలిపి ఇప్పటి వరకూ 220కి పైగా సినిమాల్లో నటించారు. మూడు సార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలను అందుకున్నారు. భారతీరాజా దర్శకత్వం వహించిన సీతాకోక చిలుక (1981) సినిమాకు గాను మొదటిసారి అవార్డు అందుకున్న ఆయన.. ఆ తర్వాత 'ఓ భార్య కథ' (1988), 'నీరాజనం' (1989) చిత్రాల్లో తన నటనకు గాను అవార్డులు సాధించాడు.