సినీ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్. 50 వసంతాల పాటు టాలీవుడ్‌‌లో దిగ్గజ నటుడిగా వెలుగొందిన శరత్ బాబు ఇక లేరు. తన తోటి కళాకారులు, అభిమానులు, బంధువులను వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. శరత్ బాబు గత కొద్ది రోజులుగా కిడ్నీస్ ఫెయిల్యూర్, బ్లడ్ ఇన్ఫెక్షన్‌తో బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం ఇటీవలే హైదరాబాద్‌‌లోని AIG హాస్పిటల్‌కు తరలించారు. సోమవారం తీవ్ర అస్వస్థతకు గురైన శరత్ బాబు 2 గంటల సమయంలో కన్ను మూశారు. శరత్ బాబు పార్థీవ శరీరాన్ని చెన్నైకు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.  శరత్ బాబు మరణంపై తెలుగు సినీ పరిశ్రమ, ఆయన అభిమానాలు దీగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 


పోలీస్ అవుదామనుకున్న శరత్ బాబు


శరత్ బాబు 1951 జులై 31న ఆంధ్రప్రదేశ్ లోని ఆముదాలవలసలో జన్మించారు. ఆయన పూర్తి పేరు సత్యనారాయణ దీక్షితులు. కాలక్రమేనా ఆయన పేరు సత్యం బాబు దీక్షితులుగా మారింది. చివరికి ఆయన తన స్క్రీన్ నేమ్‌ను శరత్ బాబుగా మార్చుకున్నారు. శరత్ బాబు తండ్రి హోటల్ వ్యాపారి. దీంతో బిజినెస్‌ను చూసుకోవాలని ఆయన తండ్రి చెప్పేవారట. అయితే, శరత్ బాబుకు మాత్రం పోలీస్ కావాలని ఉండేదట. అయితే, కాలేజీ రోజుల్లోనే తనకు షార్ట్ సైట్ వచ్చేసిందని, దాని వల్ల పోలీసు డిపార్టుమెంట్‌లో చేరాలనే తన లక్ష్యం.. కలగానే మిగిలిపోయింది. 


అమ్మ మద్దతుతో సినిమాల్లోకి


కాలేజీల్లో చదువుకున్న రోజుల్లోనే శరత్ బాబును తమ లెక్చరర్లు.. నువ్వు అందగాడివి సినిమాల్లోకి వెళ్లొచ్చుగా అనేవారట. అది ఆయన మనసులో బాగా నాటుకుపోయిందట. ఈ విషయాన్ని శరత్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇరుగుపొరుగువారు సైతం అమ్మతో అదే మాట అనేవారట. దీంతో శరత్ బాబుకు అమ్మ మద్దతు లభించింది. ఆయన తండ్రి వ్యతిరేకించినా.. అమ్మ మాత్రం శరత్‌ బాబుకు మద్దుతుగా నిలిచి సినిమాల్లోకి వెళ్లేందుకు ప్రోత్సహించారట. ‘‘నేను వ్యాపారానికి సరిపోనని నాకు తెలుసు. అందుకే, సినిమాలో ప్రయత్నిద్దామని అనుకున్నా. ఒకవేళ అక్కడ ఫెయిలైతే.. ఎలాగో వ్యాపారం ఉందిగా, చూసుకుందాంలే అనే ధీమాతో సినిమాల్లో ప్రయత్నించా’’ అని శరత్ బాబు పేర్కొన్నారు. సినిమాల్లో కొత్తవారికి అవకాశాలంటూ పేపర్లో ప్రకటన రావడం పాపం.. వెంటనే వెళ్లిపోయేవాడినని అన్నారు. తాను ఊహించిన దానికంటే చాలా సులభంగా ఆడిషన్స్‌లో శరత్ బాబు సెలక్ట్ అయ్యేవారట.


రమాప్రభతో పెళ్లి


శరత్ బాబు సినిమాల్లో ఇంకా స్థిరపడుతున్న సమయంలో రమాప్రభ పాపులర్ నటి. ఆ సమయంలో వారిద్దరు మధ్య ఏర్పడిన పరిచయం.. క్రమేనా ప్రేమగా మారింది. దీంతో 1974 ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 14 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 1988లో విడాకులు తీసుకున్నారు. వారిమధ్య ఏర్పడిన మనస్ఫర్థలే ఇందుకు కారణమని తెలిసింది. ఆ తర్వాత రమప్రభ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను ఆసరా కోసం శరత్‌కుమార్‌ను పెళ్లి చేసుకుంటే.. ఆయన అవసరం కోసం తనని పెళ్లిచేసుకున్నాడని ఆరోపించారు. అప్పట్లో ఆమె వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే శరత్‌బాబు ఓ ఇంటర్వ్యూలో రమ ప్రభను తాను అస్సలు పెళ్లే చేసుకోలేదని, తన మొదటి పెళ్లి స్నేహ నంబియార్‌తో జరిగిందని వెళ్లడించడం గమనార్హం. అయితే, ఆమెతో 2011లో విడాకులయ్యాయి. 


50 ఏళ్ల సినీ ప్రయాణం


శరత్ బాబు 1973లో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అంటే, ఈ ఏడాదికి సుమారు 50 ఏళ్లు. ‘రామరాజ్యం’ సినిమాలో ఆయనకు మొదటి అవకాశం లభించింది. అయితే, ‘కన్నె మనసు’ మూవీ దాని కంటే ముందు రిలీజైంది. అయితే, ఆయనకు గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం ‘ఇది కథ కాదు’. 1979లో విడుదలైన ఈ మూవీలో శరత్ బాబు నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కమల్ హాసన్, జయసుధ, చిరంజీవి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా తన కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిందని ఓ ఇంటర్వ్యూలో శరత్ బాబు చెప్పడం విశేషం. ఈ మూవీకి కె. బాలచందర్ దర్శకత్వం వహించారు. దీనికి తమిళ రీమేక్ 'అవరాగళ్'లో కూడా శరత్ బాబే నటించడం విశేషం. దీంతో శరత్ బాబుకు తమిళంలో కూడా మంచి ఫాలోయింగ్ వచ్చింది. అయితే, శరత్ బాబు మొదటి నుంచి హీరో పాత్రలకే పరిమితం కాకుండా.. వివిధ పాత్రల్లో నటించేవారు. విలన్ క్యారెక్టర్లకు సైతం ఒకే చెప్పేవారు. అలా ఆయన చాలా సినిమాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించేవారు. అయితే, అప్పటికే అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరొందిన శరత్.. నెగటివ్ రోల్స్‌లో కనిపించడం అభిమానులకు నచ్చేది కాదు. కానీ, ఆయన నటనకు మాత్రం ఎప్పుడూ మంచి మార్కులే పడేవి. ఇప్పటివరకు 220 వరకు సినిమాల్లో నటించారు. 


Read Also: నాకు ఒక శక్తి అండగా ఉంది, కష్టపడి నా కలలు నెరవేర్చుకున్నా: పవిత్ర లోకేష్